‘అజేయ’ హరికృష్ణ


 పోకెర్‌స్టార్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో టైటిల్ సొంతం

 మహిళల విభాగంలో హారికకు మూడో స్థానం


 

 సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం పక్కా వ్యూహాలతో ఆడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పోకెర్‌స్టార్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. బ్రిటిష్ దీవుల్లోని ఐల్ ఆఫ్ మ్యాన్ ద్వీపంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో హరికృష్ణ చాంపియన్‌గా అవతరించాడు. 39 గ్రాండ్‌మాస్టర్లతోపాటు మరో 66 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ మాస్టర్స్ ఈవెంట్‌లో హరికృష్ణ ఒక్క గేమ్‌లోనూ ఓడకపోవడం విశేషం. నిర్ణీత తొమ్మిది రౌండ్‌లపాటు జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ ఏడు పాయింట్లతో మరో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు లారెంట్ ఫ్రెసినెట్ (ఫ్రాన్స్), గాబ్రియెల్ సర్గిసియాన్ (ఆర్మేనియా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హరికృష్ణకు టైటిల్ దక్కగా... లారెంట్ రెండో స్థానంలో, గాబ్రియెల్ మూడో స్థానంతో సంతృప్తి పడ్డారు. విజేతగా నిలిచిన హరికృష్ణకు రెండు ట్రోఫీలతోపాటు 10 వేల పౌండ్లు (రూ. 9 లక్షల 95 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

 

 భారత్ రెండో ర్యాంకర్ అయిన హరికృష్ణ ఈ టోర్నీలో అజేయంగా నిలువడం విశేషం. తొమ్మిది రౌండ్‌లలో ఈ హైదరాబాదీ ఐదు విజయాలు సాధించి, మరో నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. నెజైల్ షార్ట్ (ఇంగ్లండ్)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌ను హరికృష్ణ 50 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. అంతకుముందు ఓరీ కోబో (ఇజ్రాయెల్), విష్ణుప్రసన్న (భారత్), ఎర్విన్ లాఅమీ (నెదర్లాండ్స్), మార్టిన్ జుమ్‌సాండీ (జర్మనీ), అర్కాదిల్ నాదిష్ (అజర్‌బైజాన్)లపై గెలిచిన హరి... సెర్గీ మూవ్సియన్ (ఆర్మేనియా), గ్రాన్‌డెలియస్ (స్వీడన్)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.

 

 ఇదే టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. నిర్ణీత తొమ్మిది రౌండ్‌లు ముగిశాక హారిక 4.5 పాయింట్లు సంపాదించింది. మూడు గేముల్లో గెలిచిన హారిక, మరో మూడు గేముల్లో ఓడిపోయి, మిగతా మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. 5.5 పాయింట్లతో జోవన్‌కా హుస్కా (ఇంగ్లండ్) విజేతగా నిలువగా, 5 పాయింట్లతో ఎలిజబెత్ (జర్మనీ) రెండో స్థానాన్ని పొందింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top