సానియా కన్నీరు

సానియా కన్నీరు


జాతీయతను ఎన్నిసార్లు నిరూపించుకోవాలంటూ కంటతడి

 న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఓ ఇంగ్లీష్ టీవీ చానెల్‌లో ఏడ్చేసింది. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి దేశానికి ఎన్నో పతకాలు అందించిన తాను భారత జాతీయతను ఎన్నిసార్లు నిరూపించుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇది చాలా బాధాకరమైన విషయం. మహిళను అయినందుకే నా పట్ల ఇలా జరుగుతోందా? వేరే దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లాడినందుకా? ఎందుకీ అపహాస్యం? నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాను. పతకాలూ సాధించాను. నాతో పాటు నా కుటుంబ మూలాలను ప్రశ్నిస్తే సహించేది లేదు. నేను ఆడుతున్నప్పుడు తెలంగాణకు, భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లే లెక్క. మున్ముందు ఇలాగే కొనసాగుతుంది.

 

  జీవించి ఉన్నంత వరకు నేను భారతీయురాలినే’ అని మరోమారు సానియా స్పష్టం చేసింది. ఇక పదేపదే తనను ఏదో ఒక వివాదాల్లోకి లాగుతుండటంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘నా జాతీయత విషయంలో వివాదం తలెత్తడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. నా జాతీయతను, దేశభక్తిని నేను ఎన్నిసార్లు నిరూపించుకోవాలి. వేరే దేశంలో అయితే ఇలాగే జరిగేదా?’ అని సానియా ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన నేపథ్యంలో వస్తున్న వివాదాలపై సానియా ఇలా స్పందించింది.

 

 సైనాకు న్యాయం జరుగుతుంది

 సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్ పతకం సాధించిన తనకు ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక మద్దతు లభించలేదన్న సైనా నెహ్వాల్ వ్యాఖ్యలకు సానియా స్పందించింది. ‘క్రీడాకారులకు గుర్తింపు లభించడం లేదని నేను చెప్పలేను. ఈ విషయంలో నేను కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడాను. సైనాకు సమాధానమిచ్చానని ఆయన నాతో చెప్పారు. కాబట్టి నేను ఈ అంశంపై మాట్లాడలేను. నా స్నేహితురాలైన సైనా రాష్ట్రానికి, దేశానికి ఎంతో చేసింది. ఆమెకు న్యాయం జరుగుతుంది’ అని సానియా చెప్పింది. సైనా విషయంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు చొరవ తీసుకుంటారన్న విశ్వాసం తనకుందని పేర్కొంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top