వింబుల్డన్...విలువలే అస్తి

వింబుల్డన్...విలువలే అస్తి


వందేళ్లు దాటినా అక్కడి ఆహ్లాదకర వాతావరణం మారలేదు. పచ్చటి పచ్చిక, ధవళ కాంతుల్లో మెరిసిపోయే ఆటగాళ్లు... ఏ దేశ ఆటగాడు ఆడుతున్నా నాణ్యమైన టెన్నిస్‌ను చప్పట్లతో అభినందించే ప్రేక్షకులు... వింబుల్డన్ అంటే సంప్రదాయం.

 

బ్రిటిష్ రాణి రాగానే స్టేడియంలో అందరూ వంగి అభివాదం చేయడం... తెల్లదుస్తులు, తెల్ల బూట్లే ధరించే ఆటగాళ్లు... చెర్రీ పండ్లు, క్రీమ్... చిరు జల్లులు... డ్రెస్ కోడ్‌లా సూటూ బూటుల్లో వచ్చి కూర్చునే ప్రేక్షకులు... ఎంత డబ్బు ఇస్తామని ఎందరొచ్చినా మారని తీరు... వింబుల్డన్ అంటే ‘విలువలు’.

 

నాలుగు గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీల్లోకి వింబుల్డన్ ప్రత్యేకం. కొంత మంది సుతిమెత్తగా విమర్శించే సంప్రదాయాలు, నిబంధనలే ఈ గుర్తింపును నిలబెడుతున్నాయి. బ్రిటన్ క్రీడాభిమానుల మనసుల్లో వింబుల్డన్ ముద్ర పదిలం. అందుకే ఇంగ్లిష్ కంట్రీ గార్డెన్‌గా వారు ఈ టోర్నీని ముద్దుగా పిలుచుకుంటారు. ప్రపంచంలో చాలా మంది తమ భార్యను ఎంతగా ఇష్టపడతారో అంతే స్థాయిలో వింబుల్డన్‌నూ ఇష్టపడతారు. ఈ టోర్నీకున్న గౌరవం ఇది.


 

వింబుల్డన్ టోర్నీకి ఘనమైన చరిత్ర ఉంది. 1877 నుంచి ఈ టోర్నీ కొనసాగుతుండటం విశేషం. ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రోకెట్ అనే ప్రైవేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరగడం వల్ల వారు మంచిగానో, మొండిగానో సాంప్రదాయం అంటూ పట్టు పట్టడం వల్లే ఈ టోర్నీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోందనేది అందరూ చెప్పే మాట. ముఖ్యంగా వింబుల్డన్ విలువల గురించి చెప్పాల్సి వస్తే ఈ మెగా ఈవెంట్ స్పాన్సర్‌షిప్‌ల గురించి చెప్పాలి. భారీ మొత్తాలు ఆఫర్ చేస్తూ పోటీ వచ్చినా... చాలా సందర్భాల్లో నిర్వాహకులు ‘మా చరిత్రను అమ్ముకోం’ అంటూ.... తమ పేరు చెడగొట్టరని నమ్మిన చిన్న సంస్థలకే అవకాశాలు ఇచ్చారు.



ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్‌లా తాము డబ్బు వెంట పరుగెత్తబోమంటూ కుండబద్దలు కొట్టి మరీ బహిరంగంగానే చెప్పడం వింబుల్డన్ నిర్వాహకులకే సాధ్యమైంది. సెంటర్ కోర్టుకు పైకప్పు వేయాలని నిర్ణయించినప్పుడు... వింబుల్డన్ రూపు కోల్పోతుందని బెంగ పెట్టుకున్నవారు కూడా ఎంతో మంది ఉన్నారు.

 

 

అందరికీ ఒకటే ‘రూల్’

నిర్వాహకుల వైపు నుంచే కాదు... అభిమానులు కూడా తామూ సంప్రదాయంలో భాగమని ఫీల్ కావడం వల్లే ఈ టోర్నీకి ఇంత కళ వచ్చింది. ప్రపంచంలో మ్యాచ్ జరిగే రోజునే వేదిక వద్ద టికెట్లు అమ్మే ఏకైక పెద్ద ఈవెంట్ వింబుల్డన్ మాత్రమే. క్యూ పేరుతో జరిగే ఈ టికెట్ల అమ్మకానికి పెద్దా, చిన్నా తేడా లేకుండా పద్ధతిగా క్యూలో నిలబడటం కూడా కాస్త వింతగా అనిపిస్తుంది. 40 సెంటీమీటర్లకంటే పెద్ద సైజు బ్యాగులు తీసుకెళ్లరాదు... 2 అంగుళాలకంటే పెద్దగా జాతీయ జెండా ఉండరాదు... ఫొటో తీసే కెమెరా జూమ్ లెన్స్ పొడవుకు పరిమితి... తాజాగా సెల్ఫీ స్టిక్‌లపై నిషేధం... ఇలా ఎక్కడా కనిపించని రూల్స్ ఉంటాయి. ఇదంతా మంచికే అంటూ సంప్రదాయవాదులు మద్దతు పలుకుతుంటారు.

 

మేం మారం...

కొన్నిసార్లు సంప్రదాయం అతిగా మారి చాలా మందిని ఇబ్బందికి గురి చేస్తున్నా నిర్వాహకులు పెద్దగా పట్టించుకోరు. తాజాగా ఫెడరర్‌లాంటి వాళ్లు కట్టుబాట్లపై విమర్శలు చేస్తే... చాన్నాళ్ల క్రితమే అమెరికా టెన్నిస్ స్టార్ ఆండ్రీ అగస్సీ తనకు ఇక్కడి రూల్స్ చూస్తే  ఊపిరి ఆడట్లేదని అనేశాడు. అయినా సరే అందరికీ ఆ పచ్చిక అంటే ప్రేమ. ఆ టైటిల్ గెలిస్తేనే కెరీర్‌కు సార్థకత అనుకుంటారు. ఇతర గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి ఇక్కడ ఎన్ని దండయాత్రలు చేసినా వింబుల్డన్ విజయం దక్కని నాటి దిగ్గజం ఇవాన్ లెండిల్ లాంటి వాళ్లను అడిగితే తెలుస్తుంది దాని విలువేమిటో. ఇక్కడ గెలవలేకపోతే అది గెలుపే కాదు అనుకునేవారు ఎంతో మంది. మిగతా మూడింటితో పోలిస్తే వింబుల్డన్ కోసమే ఎదురు చూసే టెన్నిస్ అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ. నాటి సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ నిలబెడుతోంది కూడా వారే.

 

నోరూరించే చెర్రీ, క్రీమ్    

ఇక్కడి సంప్రదాయాలు కొందరు ఇష్టపడతారు. మరికొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఆసక్తికరంగా ఉండటం మాత్రం ఖాయం. అందుకే వింబుల్డన్‌ను, క్రీమ్‌తో కూడిన చెర్రీ పండ్లను వేరు చేయలేం. చెర్రీ లేకుండా ఆట ఉండదంటే ఆశ్చర్యమేమీ లేదు. అటు అభిమానుల చేతిలో చెర్రీ బౌల్ లేకుండా ఉండదు. ఇటు ఆటగాళ్లు కూడా తమ గెలుపుతో చెర్రీ చిన్న ముక్క అయినా కొరికి వేడుక చేసుకోకుండా ఉండలేరు. వింబుల్డన్ జరిగే సమయంలో ఆ పళ్ల సీజన్ కాబట్టి అలా మొదలైనా... తర్వాత తర్వాత అది తప్పనిసరిగా మారిపోయింది. ఒక ఏడాది టోర్నీ సందర్భంగా మొత్తం 28 వేల కిలోల చెర్రీలు లాగిస్తారని  అంచనా.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top