‘పసిడి' పంచ్

‘పసిడి' పంచ్


అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత మేటి బాక్సర్ మేరీకోమ్ ఆసియా క్రీడల్లో ‘పసిడి' కాంతులు విరజిమ్మింది. 51 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా ఆమె గుర్తింపు పొందింది. ఈ క్రీడల 12వ రోజు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. అథ్లెటిక్స్‌లో టింటూ లూకా రజతం, అన్నూ రాణి కాంస్యం సాధించగా... మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

 

 ఇంచియాన్: ప్రత్యర్థి పంచ్‌కు కాసేపు తడబడినా... ఆ తర్వాత పట్టు విడవలేదు... గురి తప్పలేదు. రైట్ హుక్, అప్పర్ కట్, స్ట్రయిట్... బౌట్‌లో ఇలా ఒక్కో రకం పంచ్‌లతో చిరుతలా మెరుపు దాడి చేసిన భారత మేటి బాక్సర్ మేరీకోమ్... ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టించింది. ఆరంభంలో రెండు రౌండ్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ మణిపూర్ మణిపూస... ఆ తర్వాతి రౌండ్లలో తన పంచ్ పవర్ ఏమిటో చూపింది. ఫలితంగా బుధవారం జరిగిన మహిళల 51 కేజీల బాక్సింగ్ ఫైనల్లో ‘ఐదుసార్లు ప్రపంచ చాంపియన్’ మేరీకోమ్ 2-0తో జహైనా షెకెర్‌బెకోవా (కజకిస్థాన్)పై గెలిచి స్వర్ణం సాధించింది. తద్వారా ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన తొలి భారత మహిళా బాక్సర్‌గా రికార్డులకెక్కింది.



     2010 క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న మేరీకోమ్ ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగి అనకున్నది సాధించింది. అయితే తొలి రౌండ్‌లో కజక్ బాక్సర్ బలమైన పంచ్‌లతో విరుచుకుపడింది.  దీంతో 9-10, 9-10, 9-10తో వెనుకబడింది. రెండో రౌండ్‌లో కాస్త పుంజుకున్న మేరీకోమ్ 10-9, 9-10, 10-9తో ఆధిక్యాన్ని తగ్గించింది.



     జహైనా ముఖం, శరీరంపై బలమైన పంచ్‌లతో విరుచుకుపడ్డ మేరీకోమ్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. బలమైన రైట్ హుక్‌ను సంధించిన క్షణకాలంలోనే లెఫ్ట్ పంచ్‌తో కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. దీంతో జడ్జీలు 10-9, 10-9, 10-9 స్కోరును ఇచ్చారు. నాలుగో రౌండ్‌లో కూడా ఇదే స్కోరు పునరావృతం కావడంతో బౌట్ మేరీ సొంతమైంది.



     ముగ్గురు న్యాయ నిర్ణేతలలో ఒక్క జడ్జి స్కోరు 38-38తో సమంకాగా మిగతా ఇద్దరు జడ్జీలు 39-37 చొప్పున ఇచ్చారు.

 

 ‘ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబ జీవితాన్ని త్యాగం చేసుకుని ఈ స్థాయికి చేరుకున్నా. నా ముగ్గురు పిల్లలకు కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకు తగ్గ ఫలితం వచ్చినందుకు సంతృప్తిగా ఉంది. ప్రత్యర్థి బలంగా, వేగంగా పంచ్‌లు విసరడంతో తొలి రౌండ్లలో కాస్త వెనుకబడ్డా. అయితే చివరి రెండు రౌండ్లలో నా పంచ్‌ల్లో పదును పెంచా. మంచి సమన్వయంతో కొట్టాను. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం సిద్ధమవుతున్నా. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తా’.     - మేరీకోమ్



 




 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top