‘మ్యాడ్’ మ్యాక్స్

‘మ్యాడ్’ మ్యాక్స్


మ్యాక్స్‌వెల్ సంచలన ఇన్నింగ్స్

 రాజస్థాన్‌పై పంజాబ్ విజయం

 చెలరేగిన మిల్లర్

 సామ్సన్, వాట్సన్ శ్రమ వృథా

 

 గత మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ రోజు చెన్నైకి చుక్కలు చూపించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి రీప్లే చూపించాడు. తనదైన శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడి దాదాపు అదే స్కోరును ఛేదించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లాగే మ్యాక్స్ సెంచరీ చేజార్చుకున్నా... చివర్లో డేవిడ్ మిల్లర్ మెరుపులతో కింగ్స్ ఎలెవన్‌కు వరుసగా రెండో విజయం దక్కింది. అంతకుముందు సామ్సన్, వాట్సన్ మెరుపు బ్యాటింగ్ వృథా అయింది.

 

 షార్జా: పంజాబ్ విజయలక్ష్యం 192... మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా ఆ తర్వాత తడబడటంతో చివరి 3 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సిన స్థితి. ఈ దశలో కూడా రాజస్థాన్‌కు విజయావకాశాలు ఉన్నాయి. కానీ ధావల్ కులకర్ణి వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఏకంగా 4 సిక్సర్లు బాది ఒక్కసారిగా ఫలితం మార్చేశాడు.

 

 

  తర్వాతి ఓవర్లో మరో 11 పరుగులు రావడంతో... ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే కింగ్స్ ఎలెవన్‌కు అద్భుత విజయం దక్కింది.  ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (34 బంతుల్లో 52; 3 ఫోర్లు,  4 సిక్స్‌లు), వాట్సన్ (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం మ్యాక్స్‌వెల్ (45 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), మిల్లర్ (19 బంతుల్లో 51 నాటౌట్; 6 సిక్స్‌లు) అద్భుత బ్యాటింగ్‌తో పంజాబ్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసి విజయాన్నందుకుంది. పుజారా (38 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు) ఇన్నింగ్స్‌కు అండగా నిలిచాడు.

 

 భారీ భాగస్వామ్యం

  టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. లేని పరుగు కోసం ప్రయత్నించి రహానే (13) అవుట్ కావడంతో రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం అభిషేక్ నాయర్ (20 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) మురళీ కార్తీక్ వేసిన తొలి బంతికే వెనుదిరిగాడు.

 ఈ దశలో సంజు సామ్సన్, షేన్ వాట్సన్ భాగస్వామ్యం రాజస్థాన్‌కు ఊపు తెచ్చింది.

 

 వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగారు. ఈ జోడి కేవలం 7 ఓవర్లలో 74 పరుగులు జత చేసింది.

 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వాట్సన్, అక్షర్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది.

 

 మిల్లర్ చక్కటి క్యాచ్‌తో బిన్నీ వెనుదిరగ్గా... అవానా బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 34 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సామ్సన్ అదే ఓవర్లో బౌల్డయ్యాడు.

 

 చివర్లో ఫాల్క్‌నర్ (8 నాటౌట్) అండతో దూకుడు ప్రదర్శించిన స్టీవెన్ స్మిత్ (15 బంతుల్లో 27 నాటౌట్; 5 ఫోర్లు) 19 బంతుల్లోనే 32 పరుగులు జోడించాడు. పంజాబ్ బౌలర్లలో అక్షర్ పటేల్, జాన్సన్ కొంత వరకు కట్టడి చేసినా... అవానా, బాలాజీ, కార్తీక్ కలిసి 12 ఓవర్లలో 137 పరుగులు సమర్పించుకోవడంతో రాజస్థాన్ భారీ స్కోరు సాధించింది.

 

  మెరుపు వీరులు

 వీరేంద్ర సెహ్వాగ్ (2) తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఆరంభంలోనే వెనుదిరగ్గా... సాహా (2) కూడా అనుసరించడంతో పంజాబ్ 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

 

 ఈ దశలో మ్యాక్స్‌వెల్ పరుగుల ప్రవాహం మొదలైంది. ఒక పరుగు వద్ద కొద్ది తేడాతో అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్న అతను ఆ తర్వాత భారీ షాట్లతో చెలరేగాడు. రిచర్డ్సన్ ఓవర్లో ఫోర్, సిక్స్, ఫాల్క్‌నర్ ఓవర్లో 2 సిక్స్‌లు, భాటియా ఓవర్లలో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు, కులకర్ణి ఓవర్లో 4 ఫోర్లు... ఇలా ఏ బౌలర్‌నూ వదిలి పెట్టకుండా మ్యాక్స్‌వెల్ దూకుడు ప్రదర్శించాడు.

 

 28 బంతుల్లోనే మ్యాక్స్‌వెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. పుజారాతో కలిసి అతను 67 బంతుల్లో 116 పరుగులు జోడించడం విశేషం.

 

 చివరకు రిచర్డ్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గ్లెన్ అవుట్ కావడంతో 116 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.

 

 ఈ దశలో రాజస్థాన్ కాస్త సంతోషించినా...మిల్లర్ వారి ఆనందాన్ని ఆవిరి చేశాడు. ధావల్ కులకర్ణి వేసిన ఒక్క ఓవర్లో 26 పరుగులు రాబట్టి పంజాబ్‌ను గెలిపించాడు.

 

   స్కోరు వివరాలు

 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: నాయర్ (ఎల్బీ) (బి) కార్తీక్ 23; రహానే (రనౌట్) 13; సామ్సన్ (బి) అవానా 52; వాట్సన్ (బి) అక్షర్ 50; బిన్నీ (సి) మిల్లర్ (బి) జాన్సన్ 12; స్మిత్ (నాటౌట్) 27; ఫాల్క్‌నర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191

 వికెట్ల పతనం: 1-22; 2-54; 3-128; 4-144; 5-159

 బౌలింగ్: అక్షర్ 4-0-22-1; జాన్సన్ 4-0-29-1; అవానా 4-0-40-1; బాలాజీ 4-0-46-0; కార్తీక్ 4-0-51-1.  

 

 పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: పుజారా (నాటౌట్) 40; సెహ్వాగ్ (సి) బిన్నీ (బి) కులకర్ణి 2; సాహా (సి) కులకర్ణి (బి) ఫాల్క్‌నర్ 2; మ్యాక్స్‌వెల్ (సి) స్మిత్ (బి) రిచర్డ్సన్ 89; మిల్లర్ (నాటౌట్) 51; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 193

 వికెట్ల పతనం: 1-5; 2-10; 3-126.

 

 బౌలింగ్: రిచర్డ్సన్ 3-0-25-1; కులకర్ణి 4-0-50-1; ఫాల్క్‌నర్ 3.4-0-45-1; తాంబే 4-0-26-0; భాటియా 3-0-38-0; బిన్నీ 1-0-4-0.  

 

 ఐపీఎల్‌లో నేడు

 చెన్నై సూపర్ కింగ్స్ X  ఢిల్లీ డేర్‌డెవిల్స్

 వేదిక: అబుదాబి, రాత్రి గం. 8.00 నుంచి

 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top