కాచుకో... ముంబై

కాచుకో... ముంబై


ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్

నెహ్రా సూపర్ బౌలింగ్

క్వాలిఫయర్-2లో బెంగళూరుపై విజయం

ఫైనల్లో రేపు ముంబై ఇండియన్స్‌తో ధోని సేన అమీతుమీ

 


 ధోని వ్యూహాల ముందు కోహ్లి దూకుడు పనిచేయలేదు. బెంగళూరు భారీ హిట్టర్లంతా... చెన్నై బౌలర్ల క్రమశిక్షణకు చేష్టలుడిగారు. గేల్, కోహ్లి, డివిలియర్స్ త్రయం కీలక మ్యాచ్‌లో విఫలం కావడంతో... క్వాలిఫయర్-2లో చెన్నై గెలిచింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ధోనిసేన కాస్త తడబడ్డా నిలబడింది. రాయల్ చాలెంజర్స్‌పై నెగ్గిన సూపర్ కింగ్స్... ఇక ముంబై ఇండియన్స్‌తో రేపు జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.

 

 రాంచీ : మొదట్లో... ఆఖర్లో కాస్త తడబడినా... మైక్ హస్సీ (46 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (29 బంతుల్లో 26; 1 ఫోర్)ల సమయోచిత బ్యాటింగ్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. పటిష్టమైన బెంగళూరుకు పగ్గాలు వేసి ముంబైతో అమీతుమీకి సిద్ధమైంది. బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న కోహ్లిసేన కీలక మ్యాచ్‌లో తడబడింది. దీంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 3 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది.



ఫలితంగా ఎనిమిది సీజన్లలో ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో... మొదట బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. గేల్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సర్ఫరాజ్ (21 బంతుల్లో 31; 4 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) రాణించారు. తర్వాత చెన్నై 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 140 పరుగులు చేసి నెగ్గింది. నెహ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.



 ఒకే ఓవర్‌లో కోహ్లి, డివిలియర్స్...

 టాస్ గెలిచి ధోని బౌలింగ్ తీసుకున్నాడు. అయితే తొలి మూడు ఓవర్లలో ఓపెనర్లు గేల్, కోహ్లి (9 బంతుల్లో 12; 1 ఫోర్, 1 సిక్స్) వేగం గా పరుగులు చేశారు. కానీ ఐదో ఓవర్‌లో నెహ్రా... కోహ్లితో పాటు డివిలియర్స్ (1)నూ అవుట్ చేయడంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్ తడబడింది. దీంతో పవర్‌ప్లేలో బెంగళూరు 2 వికెట్లకు 29 పరుగులతోనే సరిపెట్టుకుంది. మన్‌దీప్ (4) నిరాశపర్చినా...గేల్, దినేశ్ కార్తీక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు.



రైనా వేసిన 14వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన ఈ కరీబియన్ స్టార్ నాలుగో వికెట్‌కు కార్తీక్‌తో 44 పరుగులు జోడించి అవుటయ్యాడు. తర్వాత సర్ఫరాజ్ వేగంగా ఆడినా.. రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో కార్తీక్, వీస్ (12), హర్షల్ పటేల్ (2)లు అవుటయ్యారు. కార్తీక్, సర్ఫరాజ్‌లు ఐదో వికెట్‌కు 27 పరుగులు జోడించారు. తొలి 10 ఓవర్లలో 46 పరుగులు చేసిన బెంగళూరు చివరి 10 ఓవర్లలో 93 పరుగులు చేసింది. నెహ్రా మూడు వికెట్లు తీశాడు.



 హస్సీ యాంకర్ పాత్ర

 ఓపెనర్లలో స్మిత్ (12 బంతుల్లో 17; 3 ఫోర్లు) తొందరగా అవుటైనా...  హస్సీ నిలకడగా ఆడాడు. వన్‌డౌన్‌లో డుప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను క్రమంగా నిర్మించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 40 పరుగులు జోడించాకా... స్పిన్నర్ చాహల్ చెన్నైని దెబ్బతీశాడు. మూడు బంతుల తేడాలో డు ప్లెసిస్, రైనా (0)ను అవుట్ చేశాడు. దీంతో తొలి 10 ఓవర్లలో సూపర్‌కింగ్స్ 3 వికెట్లకు 62 పరుగులు చేసింది. అయితే హస్సీతో జతకలిసిన కెప్టెన్ ధోని సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.



స్ట్రయిక్‌ను రొటేట్ చేస్తూ అవసరమైనప్పుడు భారీ షాట్లు ఆడారు. చివరి ఐదు  ఓవర్లలో 49 పరుగులు చేయాల్సిన దశలో హస్సీ రెండు భారీ సిక్సర్లు కొట్టి అవుటయ్యాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. తర్వాత నేగి (12) కూడా చెలరేగి ఆడాడు. అయితే 12 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన దశలో వరుస బంతుల్లో నేగి, బ్రేవో (0) అవుటయ్యారు. ఇక 6 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన సమయంలో ధోని నాలుగు పరుగులు చేసి అవుటైనా... అశ్విన్ (1 నాటౌట్) విజయాన్ని పూర్తి చేశాడు. చాహల్ 2 వికెట్లు తీశాడు.

 

 స్కోరు వివరాలు

 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : గేల్ (సి అండ్ బి) రైనా 41; కోహ్లి (సి) మోహిత్ (బి) నెహ్రా 12; డివిలియర్స్ ఎల్బీడబ్ల్యు (బి) నెహ్రా 1; మన్‌దీప్ (సి) హస్సీ (బి) అశ్విన్ 4; దినేశ్ కార్తీక్ (సి) మోహిత్ (బి) నెహ్రా 28; సర్ఫరాజ్ (సి) నేగి (బి) బ్రేవో 31; వీస్ (సి) బ్రేవో (బి) మోహిత్ 12; హర్షల్ రనౌట్ 2; స్టార్క్ నాటౌట్ 1; శ్రీనాథ్ అరవింద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 139.

 వికెట్ల పతనం : 1-23; 2-25; 3-36; 4-80; 5-107; 6-125; 7-138; 8-139.

 బౌలింగ్ : నెహ్రా 4-0-28-3; అశ్విన్ 4-0-13-1; మోహిత్ 4-0-22-1; రైనా 3-0-36-1; బ్రేవో 3-0-21-1; నేగి 1-0-4-0; జడేజా 1-0-13-0.



 చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ : స్మిత్ (సి) స్టార్క్ (బి) అరవింద్ 17; హస్సీ (సి) పటేల్ (బి) వీస్ 56; డు ప్లెసిస్ (బి) చాహల్ 21; రైనా (సి) వీస్ (బి) చాహల్ 0; ధోని (సి) కార్తీక్ (బి) పటేల్ 26; నేగి రనౌట్ 12; బ్రేవో (బి) స్టార్క్ 0; జడేజా నాటౌట్ 0; అశ్విన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 140.   

 వికెట్ల పతనం : 1-21; 2-61; 3-61; 4-108; 5-135; 6-135; 7-139. 

బౌలింగ్ : స్టార్క్ 4-0-27-1; అరవింద్ 4-0-25-1; హర్షల్ పటేల్ 3.5-0-26-1; వీస్ 4-0-30-1; చాహల్ 4-0-28-2.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top