గేల్ దుమారం

గేల్ దుమారం


పంజాబ్‌పై బెంగళూరు ఘన విజయం

రాణించిన డివిలియర్స్

బెయిలీసేన ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు


 

పులి ఆకలి మీదుంటే ఎంత భయంకరంగా వేటాడుతుందో... పరుగుల దాహంతో ఉన్న కరీబియన్ ఆజానుబాహుడు క్రిస్ గేల్ ఐపీఎల్‌లో అంతకు రెట్టింపు దాడి చేశాడు. వరుస పరాజయాలతో బిక్క చచ్చిపోయిన పంజాబ్‌ను నిర్దాక్షిణ్యంగా వేటాడేశాడు. బౌలర్ ఎవరైనా.. బంతి ఎలాంటిదైనా... దయ, జాలి లేకుండా ఊచకోత కోశాడు. బాదితే బౌండరీ లేదంటే గ్యాలరీ... అనే స్థాయిలో రెచ్చిపోయిన గేల్ జోరుకు చిన్నస్వామి స్టేడియం పరుగుల ప్రవాహంతో ఉప్పొంగిపోయింది. గేల్‌కు డివిలియర్స్ మెరుపులు తోడవడంతో... పరుగుల సునామీలో పంజాబ్ కొట్టుకుపోయింది.

 

నాలుగేళ్ల క్రితం 2011 మే 6న బెంగళూరు లోనే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ సెంచరీ  చేశాడు. అదే మ్యాచ్‌లో  శ్రీనాథ్ అరవింద్ కూడా నాలుగు వికెట్లు తీయడం  విశేషం.

 

రొనాల్డో తరహాలో...

 సెంచరీ పూర్తి చేయగానే బ్యాట్ వదిలేసి గేల్ ఇచ్చిన పోజు చూశారా...ఇలా చేయాలని అతను మ్యాచ్‌కు ముందే అనుకున్నాడట! విఖ్యాత ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఫ్యాన్ అయిన గేల్ అచ్చం అతడిని అనుకరించాడు. ‘సెంచరీతో అభిమానులకు ఆనందం పంచడం సంతోషంగా ఉంది. మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. గత మ్యాచ్ ఆడకపోవడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాను. నేను రొనాల్డో అభిమానిని. సెంచరీ చేస్తే అతనిలాగే సంబరాలు చేసుకుంటానని మా సహచరులతో ముందే చెప్పాను’ అని గేల్ తెలిపాడు.

 

 బెంగళూరు : ‘ఇప్పటి వరకు ఆశించిన రీతిలో ఆడలేకపోయాను. ఈ రోజు తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తా’ మ్యాచ్‌కు ముందు క్రిస్ గేల్ వ్యాఖ్య ఇది. చెప్పినట్లుగానే... అభిమానులు ఆశించిన స్థాయిలోనే ఈ విండీస్ స్టార్ చెలరేగిపోయాడు. పంజాబ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ సిక్సర్లు, బౌండరీలతో పరుగుల వర్షం కురిపించాడు. గేల్ (57 బంతుల్లో 117; 7 ఫోర్లు, 12 సిక్సర్లు) సునామీకి డివిలియర్స్ (24 బంతుల్లో 47 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు తోడుకావడంతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు 138 పరుగుల భారీ తేడాతో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది.



ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద విజయం. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 226 పరుగులు చేసింది. కోహ్లి (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. తర్వాత పంజాబ్ 13.4 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. అక్షర్ పటేల్ (21 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన బెంగళూరు ప్లేయర్ శ్రీనాథ్ అరవింద్ (4/27), స్టార్క్ (4/15) పంజాబ్ పతనాన్ని శాసించారు. 10 మ్యాచ్‌ల్లో 8 ఓడిన బెయిలీసేన ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది.



మూడు ఓవర్లు మినహా...

 ఆర్‌సీబీ ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం మూడు ఓవర్లలో మాత్రమే బ్యాట్స్‌మెన్ బౌండరీగానీ, సిక్సర్‌గానీ కొట్టలేదు. జాన్సన్ వేసిన రెండో ఓవర్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో రెచ్చిపోయిన గేల్.. ఆ తర్వాత కూడా జోరు తగ్గించలేదు. ప్రతి ఓవర్‌లో ఒకటి, రెండు సిక్సర్లు లేదంటే బౌండరీలు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ స్కోరు 68 పరుగులకు చేరుకుంది. 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ అవుట్ ప్రమాదం నుంచి బయటపడ్డ గేల్.. వరుస ఓవర్లలో మరో నాలుగు సిక్సర్లు బాదాడు.



12వ ఓవర్‌లో కోహ్లి అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అంతే ఊపుతో ఆడిన గేల్... కరణ్‌వీర్ ఓవర్‌లో వరుస సిక్సర్లతో 46 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత డివిలియర్స్ మెరుపులు మెరిపించి గేల్‌తో కలిసి 34 బంతుల్లో 71 పరుగులు జోడించాడు. ఈ దశలో గేల్, కార్తీక్ (8) స్వల్ప విరామాల్లో అవుటైనా.. సర్ఫరాజ్ (11 నాటౌట్) వేగంగా ఆడటంతో ఆర్‌సీబీకి భారీ స్కోరు ఖాయమైంది.



టపటపా వికెట్లు

 బెంగళూరు బౌలర్ల ధాటికి ఒత్తిడిని జయించలేకపోయిన పంజాబ్ బ్యాట్స్‌మెన్ వరుస విరామాల్లో అవుటయ్యారు. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా ఏ ఒక్కరూ నిలకడగా ఆడలేకపోయారు. ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడంతో పంజాబ్ కోలుకోలేకపోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి 5 వికెట్లకు 34 పరుగులు చేసిన బెయిలీసేన చివరి 5 వికెట్లను 54 పరుగుల తేడాతో చేజార్చుకుని ఓటమిపాలైంది.



స్కోరు వివరాలు

 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : గేల్ (సి అండ్ బి) అక్షర్ 117; కోహ్లి (బి) సందీప్ 32; డివిలియర్స్ నాటౌట్ 47; దినేశ్ కార్తీక్ (బి) సందీప్ 8; సర్ఫరాజ్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 226.

 వికెట్ల పతనం : 1-119; 2-190; 3-199.

 బౌలింగ్ : సందీప్ 4-0-41-2; జాన్సన్ 4-0-43-0; అనురీత్ 4-0-25-0; మ్యాక్స్‌వెల్ 2-0-23-0; అక్షర్ పటేల్ 4-0-50-1; కరణ్‌వీర్ సింగ్ 2-0-41-0.



 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్ : విజయ్ (బి) హర్షల్ 2; వోహ్రా (సి) వీస్ (బి) స్టార్క్ 2; సాహా (సి) కోహ్లి (బి) అరవింద్ 13; మ్యాక్స్‌వెల్ (బి) అరవింద్ 1; మిల్లర్ (బి) అరవింద్ 7; బెయిలీ (బి) అరవింద్ 2; అక్షర్ పటేల్ నాటౌట్ 40; జాన్సన్ (బి) స్టార్క్ 1; అనురీత్ (బి) స్టార్క్ 0; కరణ్‌వీర్ (బి) స్టార్క్ 4; సందీప్ (సి అండ్ బి) చాహల్ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (13.4 ఓవర్లలో ఆలౌట్) 88.

 వికెట్ల పతనం : 1-6; 2-19; 3-20; 4-33; 5-34; 6-39; 7-49; 8-49; 9-65; 10-88.

 బౌలింగ్ : స్టార్క్ 4-0-15-4; శ్రీనాథ్ అరవింద్ 4-0-27-4; హర్షల్ 2-0-13-1; చాహల్ 2.4-0-24-1; వీస్ 1-0-4-0.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top