బీసీసీఐ ప్రత్యేక కమిటీలో గంగూలీ

బీసీసీఐ ప్రత్యేక కమిటీలో గంగూలీ


చైర్మన్‌గా రాజీవ్‌ శుక్లా  

ఏడుగురికి స్థానం  

లోధా సంస్కరణల అమలుపై ఏర్పాటు  




న్యూఢిల్లీ: లోధా ప్యానెల్‌ సూచించిన సంస్కరణల అమలు కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీలో భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి చోటు దక్కింది. ఏడుగురితో కూడిన ఈ కమిటీ లోధా సంస్కరణల అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై నివేదిక ఇవ్వనుంది. సోమవారం జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కమిటీకి రాజీవ్‌ శుక్లా చైర్మన్‌గా... బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.



 మిగతా సభ్యుల్లో టీసీ మ్యాథ్యూ (కేరళ క్రికెట్‌ సంఘం మాజీ అధ్యక్షులు), నబా భట్టాచార్జీ (మేఘాలయ క్రికెట్‌ సంఘం కార్యదర్శి), జయ్‌ షా (బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు, గుజరాత్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి), బీసీసీఐ కోశాధికారి అనిరుధ్‌ చౌదరి ఉన్నారు. ఈనెల 30న కమిటీ తొలి సమావేశం జరిగే అవకాశం ఉంది. లోధా ప్యానెల్‌ ప్రతిపాదనల్లో కొన్నింటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కానీ ఈ తీర్పులో ఉన్న కొన్ని క్లిష్టమైన విషయాలను గుర్తించి ఈ కమిటీ బీసీసీఐకి 15 రోజుల్లో నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.



‘లోధా ప్రతిపాదనల అమలుపై కోర్టులో వచ్చే నెల 14న విచారణ జరగనుంది. వీలైనంత త్వరగా సమావేశం తేదీని ఖరారు చేసుకుని వచ్చే నెల 10నే నివేదిక అందించాల్సి ఉంటుంది. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు వీకే ఖన్నాకు కమిటీ తుది నివేదికను సమర్పిస్తుంది. ఆ తర్వాత మరోసారి ఎస్‌జీఎంలో చర్చ జరుగుతుంది’ అని కార్యదర్శి అమితాబ్‌ చౌదరి తెలిపారు. ఒక రాష్ట్రం ఒక ఓటు, ఆఫీస్‌ బేరర్ల గరిష్ట వయస్సు 70 ఏళ్లకు మించకపోవడం, మూడేళ్ల కూలింగ్‌ పీరియడ్, జాతీయ సెలక్షన్‌ ప్యానెల్‌లో సభ్యుల సంఖ్యపై బీసీసీఐ సభ్యులకు తీవ్ర అభ్యంతరాలున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top