ఎవరికిస్తారు పగ్గాలు?

ఎవరికిస్తారు పగ్గాలు?


భారత క్రికెట్ జట్టు కోచ్ రేసులో గంగూలీ, ద్రవిడ్

డెరైక్టర్‌గా కొనసాగాలనుకుంటున్న శాస్త్రి

ఆసక్తికరంగా కొత్త కోచ్ ఎంపిక


 

ముంబై : భారత క్రికెట్ కోచ్ పగ్గాలు చేపట్టబోయేది ఎవరు? ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ ఇది. డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగియడంతో రాబోయే సీజన్‌కు కొత్త కోచ్‌ను నియమించాలి. ఈ పదవి కోసం అందరికంటే ఎక్కువగా గంగూలీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే ద్రవిడ్‌ను కోచ్‌ను చేయాలని బీసీసీఐలోని పెద్దలు కొందరు భావిస్తున్నారు. ఇలాంటి పెద్ద క్రికెటర్లు కాకుండా బంగర్ లేదా ప్రవీణ్ ఆమ్రేలాంటి లో ప్రొఫైల్ కోచ్ ను నియమించి టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని కొనసాగించాలనేది మరో ప్రతిపాదన.



► భారత జట్టు కోచ్ కోసం తొలుత బీసీసీఐ ప్రకటన చేయాలి. ఆసక్తి ఉన్న వాళ్లంతా ఈ పదవి కోసం అప్లికేషన్ పెట్టాలి. ఆ తర్వాత కోచ్‌గా తమ పనితీరు ఎలా ఉండబోతోందనే ప్రజెంటేషన్ ఇవ్వాలి. దీని తర్వాత బీసీసీఐ అధికారులు, మాజీ కెప్టెన్లు కలిసి చేసే ఇంటర్వ్యూలో పాసవ్వాలి. కాబట్టి కోచ్ ఎంపిక పెద్ద తతంగం.

► కోచ్ పదవి కోసం మాజీ కెప్టెన్ గంగూలీ అమితాసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియాను కలిసి బెంగాల్ టైగర్ ఇప్పటికే దీని గురించి చర్చించాడు. అయితే దాల్మియా నుంచి ప్రస్తుతానికి దాదాకు ఎలాంటి హామీ రాలేదు. అయితే తనకు క్రికెట్ రాజకీయాలపై ఆసక్తి ఉందని, కోచ్ పదవిపై ఆసక్తిలేదని గంగూలీ చెప్పినట్లు కూడా కథనాలు వినిపిస్తున్నాయి.

► రాజస్తాన్ రాయల్స్ మెంటార్‌గా అద్భుతమైన విజయాలతో ద్రవిడ్ కోచ్ పదవికి సరిపోతానని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిగా ద్రవిడ్ భారత జట్టు కోచ్‌కు అసలైన అర్హుడంటూ బీసీసీఐలోని కొందరు పెద్దలు అంటున్నారు. ద్రవిడ్‌తో మాట్లాడి కోచ్ పదవికి అప్లికేషన్ ఇప్పించాలని వీళ్ల ఆలోచన.

► ద్రవిడ్, గంగూలీలలో ఎవరు కోచ్‌గా వచ్చినా ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మారుతుంది. ప్రస్తుతం జట్టుకు డెరైక్టర్‌గా రవిశాస్త్రి ఉన్నారు. పెత్తనం అంతా ఆయనదే. ఈ ఇద్దరిలో ఎవరు కోచ్ అయినా దీనికి ఒప్పుకోరు. కాబట్టి అప్పుడు డెరైక్టర్ పదవిని రద్దు చేయాలి.

► రవిశాస్త్రి కూడా డెరైక్టర్ పదవిలో కొనసాగాలనే ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. సంజయ్ బంగర్ లేదా ప్రవీణ్ ఆమ్రేలలో ఒకరిని కోచ్‌గా చేసి రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా కొనసాగడం ఓ ప్రత్యామ్నాయం.

► ప్రస్తుతం అందరూ ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. అయితే ఈ టోర్నీ ముగిశా క కూడా భారత జట్టుకు రెండు నెలల పాటు టోర్నీలు లేవు. కాబట్టి కోచ్ ఎంపికపై తొందరపాటు లేకుండా బీసీసీఐ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top