నొవాక్ ‘జై’కొట్టేనా!

నొవాక్ ‘జై’కొట్టేనా!


కెరీర్ స్లామ్‌పై సెర్బియా స్టార్ గురి

ఫేవరెట్‌గా బరిలోకి నాదల్ నుంచే అసలు ముప్పు

నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్


 

 ఫ్రెంచ్ ఓపెన్ మధ్యాహ్నం గం. 2.30 నుంచి నియో స్పోర్ట్స్, నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

 పారిస్ : కొన్నేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గి ‘కెరీర్ స్లామ్’ సాధించాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... పదోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ సాధించి అరుదైన ఘనత సాధించాలనే పట్టుదలతో రాఫెల్ నాదల్... మూడు పదుల వయసు దాటినా తనలో పదును తగ్గలేదని నిరూపించుకునేందుకు రోజర్ ఫెడరర్... ఈ ముగ్గురు స్టార్‌లకు తానేమీ తీసిపోనని చాటిచెప్పేందుకు ఆండీ ముర్రే... ఈ నేపథ్యంలో టెన్నిస్ సీజన్‌లోని రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌కు ఆదివారం తెరలేవనుంది.



► గత పదేళ్లలో తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ సాధించిన రాఫెల్ నాదల్‌ను కాకుండా ఈసారి ఫేవరెట్‌గా ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్‌ను పరిగణిస్తుండటం విశేషం. ఈ ఇద్దరూ ఒకే పార్శ్వంలో ఉండటం, క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్‌నే ఫైనల్‌గా భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో నెగ్గిన వారికే ఈసారి టైటిల్ ఖాయమని టెన్నిస్ పండితులు అంచనా వేస్తున్నారు.

► ఇప్పటికే తన కెరీర్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకున్న జొకోవిచ్ ఖాతాలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ మాత్రమే చేరాల్సి ఉంది. పదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన ఈ సెర్బియా స్టార్ రెండు సార్లు రన్నరప్ (2014, 2012)గా నిలువడంతోపాటు నాలుగుసార్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది జొకోవిచ్ ఐదు టైటిల్స్ సాధించడమే కాకుండా కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

► మరోవైపు పదేళ్ల తర్వాత తొలిసారి టాప్-5 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయిన నాదల్ ఈ ఏడాది కేవలం ఒక టైటిల్ మాత్రమే సాధించాడు.     ఫామ్‌ను లెక్కలోకి తీసుకొని నాదల్‌ను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది.  

► జొకోవిచ్, నాదల్, ముర్రే ఒకే పార్శ్వంలో ఉండటంతో 2009 చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)కు ఈసారి సునాయాసమైన ‘డ్రా’ పడిందనే చెప్పాలి. స్థాయికి తగ్గట్టు ఆడితే ఫెడరర్ ఫైనల్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం జరిగే తొలి రౌండ్‌లో క్వాలిఫయర్ అలెజాంద్రో ఫలా (కొలంబియా)తో ఫెడరర్ తలపడనున్నాడు. మిగతా తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మార్సెల్ (టర్కీ)తో ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), పాల్ హెన్రీ మాథ్యూ (ఫ్రాన్స్)తో ఐదో సీడ్ నిషికోరి (జపాన్), లిండెల్ (స్వీడన్)తో 14వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) ఆడనున్నారు.

► మహిళల విభాగానికొస్తే కచ్చితమైన ఫేవరెట్ కనిపించడంలేదు. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), డిఫెండింగ్ చాంపియన్ మరియా షరపోవా (రష్యా), మాజీ చాంపియన్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) టైటిల్ రేసులో ఉన్నారు.

► ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 18 లక్షల యూరోల (రూ. 12 కోట్ల 58 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top