'ఫాస్ట్' పిచ్చెక్కించింది!

'ఫాస్ట్' పిచ్చెక్కించింది!


ఆక్లాండ్: ' మీ భరతం పడతాం.. మెక్ కల్లమ్ కాచుకో' అంటూ మ్యాచ్ కు ముందు ఆసీస్ కోచ్ డారెన్ లీమన్ వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటోంది. న్యూజిలాండ్-ఇంగ్లండ్ లతో మ్యాచ్ జరిగిన అనంతరం లీమన్ చేసిన వ్యాఖ్యలు ఈ మ్యాచ్ సందర్భంగా మరింత వేడిని పుట్టించాయి. ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ ఓపెనర్ మెక్ కల్లమ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడిన తరువాత లీమన్ సవాల్ విసిరాడు. తమతో తదుపరి మ్యాచ్ కు మెక్ కల్లమ్ కాచుకోవాలంటూ మైండ్ గేమ్ కు తెరలేపాడు. తమ ఫాస్ట్ బౌలింగ్ తో మెక్ కల్లమ్ కు చుక్కలు చూపిస్తామని లీమన్ తెలిపాడు. గంటకు 130 కి.మీ వేగంతో వచ్చే బౌలింగ్ కు 145 కి.మీ వేగంతో వచ్చే బంతులకు చాలా తేడా ఉంటుందని.. ఆ బౌలింగ్ తమ వద్ద ఉందని కివీస్ ఆటగాళ్లకు ముందుగా హెచ్చరికలు పంపాడు.



అయితే ఆ వ్యాఖ్యలకు.. ప్రస్తుత మ్యాచ్ కు చాలానే దగ్గర సంబంధం ఉంది. అయితే ఆ వ్యాఖ్యలు ఆసీస్ గెలుపుకు పూర్తిగా వర్క్ ఫుట్ కాకపోయినా.. ప్రధానంగా ఫాస్ట్ బౌలింగ్ పోరే ఈ మ్యాచ్ లో కనబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ను కివీస్ బౌలింగ్ ఆయుధం ట్రెంట్ బౌల్ట్ కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్ లో ఐదు కీలక వికెట్లను తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. తన వంతు కోటాను పూర్తి చేసిన బౌల్ట్  కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మెయిడన్ ఓవర్లను బౌల్ట్ సంధించాడు.



అయితే అనంతరం కివీస్ కూడా ఆసీస్ బౌలింగ్ కు విలవిల్లాడింది.  తొలుత ఆసీస్ ను 151పరుగులకే కివీస్ ఆటగాళ్లు ఆలౌట్ చేస్తే.. తరువాత బ్యాటింగ్ దిగిన కివీస్ కు ఆసీస్ చుక్కలు చూపించింది. ఆసీస్ బౌలర్ స్టార్క్ రెచ్చిపోయాడు. వరుస కివీస్ ఆటగాళ్లను పెవిలియన్ కు పంపుతూ ఆసీస్ క విజయంపై ఆశలు చిగురింప చేశాడు. 9 ఓవర్లు వేసిన స్టార్క్ 26 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. వేగానికి బౌన్స్ కూడా జత చేసి కివీస్ ఆటగాళ్లను బోల్తా కొట్టించాడు. అయితే చివరకు ఈమ్యాచ్ లో కివీస్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ఈ విజయాన్ని ప్రక్కనే పెడితే మొత్తంగా ఈ పోరు ఫాస్ట్ బౌలింగ్ మధ్య పోరుగానే అభివర్ణించాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top