పమాదపు ‘గంట’ మోగింది!

పమాదపు ‘గంట’ మోగింది!


రెండో రోజూ భారత్ శ్రమ నిష్ఫలం

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 569/7 డిక్లేర్డ్

బెల్ భారీ సెంచరీ, రాణించిన బట్లర్

భారత్ 25/1

 

వరుసగా రెండో రోజూ అదే వరుస... పేలవ బౌలింగ్‌కు తోడు పట్టు లేని ఫీల్డింగ్ వెరసి సౌతాంప్టన్ టెస్టులో భారత్ కష్టాలు పెరిగాయి. అలవోకగా పరుగులు సాధించిన ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసి సురక్షిత స్థితికి చేరుకుంది. సీనియర్ ఆటగాడు బెల్ భారీ స్కోరుకు... బట్లర్ వన్డే తరహా దూకుడు జత కలిసి ఇంగ్లండ్‌ను ముందంజలో నిలిపాయి. ఇక మూడో రోజు భారత్ బ్యాటింగ్ ఏ మాత్రం నిలబడుతుందనే దానిపైనే మూడో టెస్టు ఫలితం ఆధారపడి ఉంది.

 

సౌతాంప్టన్: ఇంగ్లండ్ బ్యాటింగ్ జోరు ముందు భారత బౌలింగ్ మరోసారి తలవంచింది. ఇయాన్ బెల్ (256 బంతుల్లో 167; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), బట్లర్ (83 బంతుల్లో 85; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్రదర్శనతో మూడో టెస్టులో కుక్ సేన భారీ స్కోరు సాధించింది. ఇక్కడి రోజ్ బౌల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్ల నష్టానికి 569 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బ్యాలెన్స్ (288 బంతుల్లో 156; 24 ఫోర్లు) కూడా ఓవర్‌నైట్ స్కోరుకు మరిన్ని పరుగులు జత చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. ధావన్ (6) విఫలమయ్యాడు. విజయ్ (11 బ్యాటింగ్), పుజారా (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.

 

కొనసాగిన జోరు...

ఓవర్‌నైట్ స్కోరు 247/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మొదటి సెషన్‌లో ధాటిగా ఆడింది. భారత బౌలింగ్‌లో పస లేకపోవడంతో బ్యాలెన్స్, బెల్ అలవోకగా పరుగులు సాధించారు. ఆరంభంలోనే ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి బ్యాలెన్స్ భువనేశ్వర్ లయను దెబ్బ తీశాడు. 99 బంతుల్లో బెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే బ్యాలెన్స్ 278 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. రెగ్యులర్ బౌలర్లు విఫలమైన చోట రోహిత్ శర్మ మెరిశాడు.



లంచ్‌కు ముందు బ్యాలెన్స్‌ను కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అయితే రీప్లేలో బంతి, బ్యాట్‌కు తాకలేదని తెలిసింది. గత కొన్ని మ్యాచ్‌లుగా విఫలమవుతున్న ఇయాన్ బెల్ ఈసారి చెలరేగిపోయాడు. క్రీజ్‌లో కుదురుకున్నాక భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జడేజా బౌలింగ్‌ను చితక్కొట్టాడు. అతను వేసిన ఒకే ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 20 పరుగులు రాబట్టాడు. అదే ఓవర్ రెండో బంతికి భారీ సిక్స్‌తో 179 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  భారత కెప్టెన్ ధోని ఎన్ని మార్పులు, ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది.

 

స్కోరు వివరాలు

 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) ధోని (బి) జడేజా 95; రాబ్సన్ (సి) జడేజా (బి) షమీ 26; బ్యాలెన్స్ (సి) ధోని (బి) రోహిత్ 156; బెల్ (సి) పంకజ్ (బి) భువనేశ్వర్ 167; రూట్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 3; మొయిన్ అలీ (సి) రహానే (బి) భువనేశ్వర్ 12; బట్లర్ (బి) జడేజా 85; వోక్స్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (163.4 ఓవర్లలో 7 వికెట్లకు) 569 డిక్లేర్డ్

 వికెట్ల పతనం: 1-55; 2-213; 3-355; 4-378; 5-420; 6-526; 7-569.

 బౌలింగ్: భువనేశ్వర్ 37-10-101-3; షమీ 33-4-123-1; పంకజ్ సింగ్ 37-8-146-0; రోహిత్ శర్మ 9-0-26-1; రవీంద్ర జడేజా 45.4-10-153-2; శిఖర్ ధావన్ 2-0-4-0.

 

భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (బ్యాటింగ్) 11; ధావన్ (సి) కుక్ (బి) అండర్సన్ 6; పుజారా (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (14 ఓవర్లలో వికెట్ నష్టానికి) 25

 వికెట్ల పతనం: 1-17.  

 బౌలింగ్: అండర్సన్ 7-3-14-1; బ్రాడ్ 4-2-4-0; జోర్డాన్ 2-1-3-0; వోక్స్ 1-1-0-0.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top