ధోనిదే భారం

ధోనిదే భారం


భారత్‌కు ఫాలో ఆన్ గండం

 తొలి ఇన్నింగ్స్‌లో 323/8

 పోరాడుతున్న ధోని

 ఇంగ్లండ్‌తో మూడో టెస్టు


 

 మూడో టెస్టులో భారత్ ఫాలోఆన్ గండం తప్పించుకోవాలంటే మరో 47 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ధోని ఒక్కడే. చివరి ఇద్దరిని అడ్డుపెట్టుకుని భారత్‌ను గట్టెక్కించాల్సిన బాధ్యత, భారం ఇక ధోనిదే. లేదంటే మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకోవాల్సిందే.

 

 సౌతాంప్టన్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ శతకాలతో చెలరేగిన చోట... భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. భారత బౌలర్లకు బంతి బౌన్స్ కాని చోట... ఇంగ్లండ్ సీమర్లు చెలరేగారు. ఫలితం... మూడో టెస్టులో భారత్ ఎదురీదుతోంది. రోజ్‌బౌల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. రహానే (113 బంతుల్లో 54; 5 ఫోర్లు), కెప్టెన్ ఎంఎస్ ధోని (103 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు; 1 సిక్స్) మినహా  భారత బ్యాట్స్‌మెన్ విఫలయ్యారు. విరాట్ కోహ్లి (75 బంతుల్లో 39; 3 ఫోర్లు), మురళీ విజయ్ (95 బంతుల్లో 35; 5 ఫోర్లు) ఓ మోస్తరుగా ఆడారు. క్రీజులో ధోనితో పాటు షమీ (4 బ్యాటింగ్) ఉన్నాడు. భారత్ జట్టు ఫాలోఆన్ తప్పించుకోవాలంటే 370 పరుగులు చేయాలి. అంటే మరో 47 పరుగులు చేస్తే ఫాలోఆన్ ప్రమాదం తప్పుతుంది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, బ్రాడ్‌లకు మూడేసి వికెట్లు, అలీకి రెండు వికెట్లు దక్కాయి.

 

 తొలి సెషన్ నుంచే తడబాటు

 ఓవర్‌నైట్ స్కోరు 25/1తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొలి సెషన్‌లో తడబడింది. స్వల్ప వ్యవధిలోనే పుజారా (52 బంతుల్లో 24; 3 ఫోర్లు), మురళీ విజయ్ వికెట్లను తీసిన బ్రాడ్ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఈ సమయంలో రహానేతో కలిసి కోహ్లి జట్టు ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. లంచ్ విరామం తర్వాత కోహ్లి అండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు ఆడుతున్న రోహిత్ శర్మ (61 బంతుల్లో 28; 3 ఫోర్లు) ప్రారంభంలో ఎక్కువగా రహానేకు స్ట్రయికింగ్ ఇచ్చాడు. మరోవైపు 92 బంతుల్లో రహానే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. టీ విరామానికి ముందు నిర్లక్ష్యపు షాట్‌తో రోహిత్ అవుటయ్యాడు.

 

 చివర్లోనూ...

 టీ విరామం తర్వాత మూడో ఓవర్‌లోనే జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిలకడగా ఆడుతున్న రహానే.. అలీ బౌలింగ్‌లో మిడ్ ఆన్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ధోని, జడేజా (52 బంతుల్లో 31; 6 ఫోర్లు) ఎక్కువగా భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఆడారు. కానీ జడేజా అండర్సన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 97వ ఓవర్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో భువనేశ్వర్ (35 బంతుల్లో 19; 4 ఫోర్లు) కూడా అవుటయ్యాడు. ఈ దశలో ఫాల్ ఆన్ ప్రమాదం తప్పించేందుకు ధోని వేగం పెంచి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధోని, షమీ (4 బ్యాటింగ్)తో మరో వికెట పడకుండా రోజును ముగించారు.

 

 స్కోరు వివరాలు

 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 569/7 డిక్లేర్డ్

 భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (బి) బ్రాడ్ 35; ధావన్ (సి) కుక్ (బి) అండర్సన్ 6; పుజారా (సి) బట్లర్ (బి) బ్రాడ్ 24; కోహ్లి (సి) కుక్ (బి) అండర్సన్ 39; రహానే (సి) సబ్ టెర్రీ (బి) అలీ 54; రోహిత్ (సి) బ్రాడ్ (బి) అలీ 28; ధోని బ్యాటింగ్ 50; జడేజా ఎల్బీడబ్ల్యు (బి) అండర్సన్ 31; భువనేశ్వర్ (సి) బ్యాలెన్స్ (బి) బ్రాడ్ 19; షమీ బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు (బైస్ 12, ఎల్బీ 13; వైడ్లు 8) 33; మొత్తం (102 ఓవర్లలో 8 వికెట్లకు) 323.




 వికెట్ల పతనం: 1-17; 2-56; 3-88; 4-136; 5-210; 6-217; 7-275; 8-313.

 బౌలింగ్: అండర్సన్ 24-9-52-3; బ్రాడ్ 23-6-65-3; జోర్డాన్ 17-4-59-0; వోక్స్ 20-8-60-0; అలీ 18-0-62-2.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top