డుమిని ఆల్‌రౌండ్ ‘షో’

డుమిని ఆల్‌రౌండ్ ‘షో’


ఒంటిచేత్తో ఢిల్లీని గెలిపించిన కెప్టెన్  

 సన్‌రైజర్స్‌కు మరోసారి భంగపాటు


 

 బ్యాటింగ్‌లో అర్ధసెంచరీ... బౌలింగ్‌లో నాలుగు వికెట్లు... ఫీల్డింగ్‌లో కళ్లుచెదిరే క్యాచ్... ఒక టి20 మ్యాచ్‌లో ఇవన్నీ ఒకే ఆటగాడు చేస్తే అద్భుతం. ఢిల్లీ కెప్టెన్ డుమిని ఇలాంటి అద్భుతాన్నే వైజాగ్‌లో చేశాడు. సంచలన ఆల్‌రౌండ్ ‘షో’ తో చెలరేగిపోయాడు. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరోసారి సొంత మైదానంలో నిరాశే ఎదురయింది. ఢిల్లీ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరింది.

 

 సాక్షి, విశాఖపట్నం: ఇక ఓడిపోతారనుకున్న మ్యాచ్‌లో పోరాడటం... విజయం అంచుల దాకా వచ్చి మ్యాచ్ వదిలేయడం... డెక్కన్ చార్జర్స్ నుంచి సన్‌రైజర్స్‌కూ అలవాటయినట్లుంది. చివర్లో తడబాటును జయించలేక హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి-ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన హోమ్ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలో ఓడింది.

 

 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 60; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేశాడు. కెప్టెన్ డుమిని (41 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడాడు.

 

 భువనేశ్వర్ (1/21) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసి ఓడింది. రవి బొపారా (30 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. వార్నర్ (20 బంతుల్లో 28; 4 ఫోర్లు), ఆశిష్ రెడ్డి (8 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్సర్) రాణించారు. డుమిని పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీశాడు.



సూపర్ భాగస్వామ్యం

ఢిల్లీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో తొలి బంతికే భువనేశ్వర్ చక్కటి బంతితో మయాంక్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. డుమిని, శ్రేయస్ జాగ్రత్తగా ఆడుతూనే రన్‌రేట్ తగ్గకుండా చూసుకున్నారు. దీంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 40 పరుగులు చేసింది. కరణ్ శర్మ వేసిన రెండు ఓవర్లలో శ్రేయస్ ఐదు బంతుల వ్యవధిలో మూడు సిక్సర్లు బాదాడు. 32 బంతుల్లోనే ఈ యువ ఆటగాడు అర్ధసెంచరీ చేశాడు. శ్రేయస్, డుమిని  78 పరుగులు జోడించారు.

 

 ప్రవీణ్ బౌలింగ్‌లో భారీషాట్‌కు వెళ్లి శ్రేయస్ అవుటయ్యాక... డుమిని వేగం పెంచాడు. బొపారా వేసిన 15వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ కొట్టాడు. 39 బంతుల్లో డుమిని అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే ఇదే ఓవర్లో డుమిని... తర్వాతి ఓవర్లో యువరాజ్ అవుటయ్యారు. భువనేశ్వర్ స్లాగ్ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ 167 పరుగులకే పరిమితమైంది.

 

ఊరించి... ఉస్సూరు

లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు వార్నర్, ధావన్ (18) మంచి ఆరంభాన్నిచ్చారు. పవర్‌ప్లే ఆరు ఓవర్లలో 50 పరుగులు చేశారు. అయితే ఏడో ఓవర్లో డుమిని మూడు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరినీ అవుట్ చేసి దెబ్బతీశాడు. ఈ దశలో బొపారా... రాహుల్ (24), నమన్ ఓజా (12)ల సహకారంతో పరిస్థితి అదుపు తప్పకుండా చూశాడు. ఓ దశలో సన్‌రైజర్స్ 120/3తో లక్ష్యం దిశగా సాగింది.

 

అయితే డుమిని ఓ సంచలన క్యాచ్‌తో ఓజాను అవుట్ చేయడంతో పాటు... ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మూడు బంతుల వ్యవధిలో బొపారా, మోర్గాన్‌లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇక సన్‌రైజర్స్ ఆశలు వదులుకుంది. ఈ దశలో ఆశిష్ రెడ్డి, కరణ్ శర్మ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు) చెలరేగి ఆడినా... ఆఖరి ఓవర్లో కౌల్టర్ ైనె ల్ చక్కగా బౌలింగ్ చేసి హైదరాబాద్ ఆశలపై నీళ్లుజల్లాడు.

 

స్కోరు వివరాలు

ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: మయాంక్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 1; శ్రేయస్ అయ్యర్ (సి) వార్నర్ (బి) ప్రవీణ్ 60; డుమిని (బి) స్టెయిన్ 54; యువరాజ్ (సి) వార్నర్ (బి) ఆశిష్ 9; మ్యాథ్యూస్ నాటౌట్ 15; జాదవ్ నాటౌట్ 19; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1-15; 2-93; 3-132; 4-132. బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-38-1; స్టెయిన్ 4-0-27-1; భువనేశ్వర్ కుమార్ 4-0-21-1; రవి బొపారా 4-0-38-0; కరణ్ శర్మ 2-0-25-0; ఆశిష్ రెడ్డి 2-0-15-1.

 

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) అండ్ (బి) డుమిని 28; ధావన్ (బి) డుమిని 18; బొపారా (సి) తివారీ (బి) డుమిని 41; రాహుల్ (బి) మ్యాథ్యూస్ 24; నమన్ ఓజా (సి) డుమిని (బి) తాహిర్ 12; మోర్గాన్ (బి) డుమిని 1; ఆశిష్ రెడ్డి రనౌట్ 15; కరణ్ శర్మ (సి) మ్యాథ్యూస్ (బి) నైల్ 19; ప్రవీణ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 163.

 

వికెట్ల పతనం: 1-50; 2-51; 3-89; 4-120; 5-128; 6-129; 7-159; 8-163.

బౌలింగ్: కౌల్టర్ నైల్ 4-0-26-1; డుమిని 3-0-17-4; ముత్తుస్వామి 2-0-20-0; మ్యాథ్యూస్ 4-0-38-1; తాహిర్ 4-0-35-1; అమిత్ మిశ్రా 2-0-14-0; యువరాజ్ 1-0-10-0.

 

 వారెవ్వా... మయాంక్

 సన్‌రైజర్స్ గెలవాలంటే చివరి రెండు బంతుల్లో ఏడు పరుగులు చేయాలి. కౌల్టర్ నైల్ వేసిన  ఐదో బంతిని పాయింట్ బౌండరీ దిశగా కరణ్ శర్మ బలంగా కొట్టాడు. అక్కడ ఉన్న ఫీల్డర్ మయాంక్ అగర్వాల్ అద్భుతంగా స్పందించాడు. సిక్స్ పోతుందనుకున్న బంతిని గాల్లోకి ఎగిరి మైదానంలోకి నెట్టాడు. క్యాచ్ పట్టినా బౌండరీ దాటుతానని తెలిసి మయాంక్ తెలివిగా వ్యవహరించాడు. దీంతో రెండు పరుగులే వచ్చాయి.

 

  ఒకవేళ అది సిక్సర్ అయి ఉంటే సన్‌రైజర్స్ చివరి బంతికి ఒక్క పరుగు చేసి గెలిచేది. లేదా మ్యాచ్ టై అయ్యేది. ఇక చివరి బంతికి విజయానికి ఐదు పరుగులు కావాల్సి ఉండగా కరణ్ భారీ షాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. మొత్తానికి మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్ ఢిల్లీ చేజారకుండా కాపాడాడు.

 

 ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లు

 రాజస్తాన్ రాయల్స్

           x

 చెన్నై సూపర్ కింగ్స్

 వేదిక: అహ్మదాబాద్

 సా. గం. 4.00 నుంచి

 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

 



 బెంగళూరు రాయల్ చాలెంజర్స్

            x

 ముంబై ఇండియన్స్

 వేదిక: ముంబై; రాత్రి గం. 8.00 నుంచి

 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top