ఆటను అవమానించాక...

ఆటను అవమానించాక...


ఇంగ్లండ్ క్రికెట్‌లో అన్నీ అపశకునాలే

 పరాజయం బాట వీడని జట్టు


 

 ప్రతి క్రికెటర్‌కీ పిచ్ దైవంలాంటిది. కోట్లాది మంది దేవుడిలా ఆరాధించే సచిన్ కూడా... తాను రిటైర్ అయ్యాక వెళ్లి పిచ్‌కు మొక్కి వచ్చాడు. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. కానీ ఇంగ్లండ్ క్రికెటర్లు ఏడాది క్రితం ‘యాషెస్’ గెలిచిన మైకంలో పిచ్ మీద మూత్ర విసర్జన చేశారు. ఆ తర్వాత యాదృచ్ఛికమే అయినా ఇంగ్లండ్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. ఏడాది పాటు ఆడిన అన్ని సిరీస్‌ల్లో ఓడిపోయింది.

 

 సరిగ్గా అదే కారణం కాకపోయినా, ‘మా జట్టు ఆటను అవమానించినందుకే ఇలా జరుగుతోందేమో’ అని ఇప్పుడు సగటు ఇంగ్లండ్ అభిమానులు వాపోతున్నారు. అందుకు ఉదాహరణగా గత ఏడాది కాలంలో ఇంగ్లండ్‌కు ఎదురవుతున్న అపశకునాలను వారు గుర్తు చేసుకుంటున్నారు.

 

గత ఏడాది ఆగస్ట్ 25న ఓవల్‌లో టెస్టు మ్యాచ్ ముగిశాక ఇంగ్లండ్ క్రికెటర్లు పీటర్సన్, అండర్సన్, బ్రాడ్ బీర్లు తాగుతూ పిచ్ మీద మూత్రవిసర్జన చేశారు. అంతకు ముందు టెస్టులోనే ఇంగ్లండ్ యాషెస్ సిరీస్‌ను గెలుచుకుంది. ఆ వెంటనే జరిగిన వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియాకు కోల్పోయింది.

ఆ తర్వాత డిసెంబర్‌లో ఆస్ట్రేలియా వెళ్లిన ఇంగ్లండ్ జట్టు 0-5 తేడాతో చిత్తు చిత్తుగా ఓడి యాషెస్‌ను కోల్పోయింది. అంతే కాదు...అక్కడే జరిగిన వన్డే, టి20 సిరీస్‌లలో కూడా జట్టుకు పరాజయమే ఎదురైంది.

  మూడు టెస్టుల్లో పరాజయం పాలు కాగానే, జట్టు ప్రధాన స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన వల్ల కాదంటూ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. మరో నాణ్యమైన స్పిన్నర్‌ను తయారు చేసుకోవడం సంగతి అటు ఉంచితే... స్వాన్ తర్వాత ఇంగ్లండ్‌కు ఇప్పటి వరకు స్పిన్ వేయగలిగే బౌలర్ కూడా దిక్కు లేడు.

యాషెస్ పరాజయంతో టీమ్ డెరైక్టర్ ఆండీ ఫ్లవర్ రాజీనామా చేశాడు.


జట్టు నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్‌ను క్రమశిక్షణా రాహిత్యం పేరుతో ఇంగ్లండ్ బోర్డు పక్కన పెట్టేసింది.


  టి20 ప్రపంచకప్‌లో ఆ జట్టు నెదర్లాండ్స్ చేతిలోనూ చిత్తుగా ఓడింది.

  మరో అవమానం నెల రోజుల క్రితం సొంతగడ్డపై బ్రిటీష్ జట్టుకు ఎదురైంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా అడుగు పెట్టిన ఉపఖండపు జట్టు శ్రీలంక టెస్టు, వన్డే, టి20 సిరీస్‌లను వరుసగా గెలిచి చావుదెబ్బ కొట్టింది.

  జట్టు సభ్యుడు గ్యారీ బ్యాలెన్స్ పబ్‌లో చిత్తుగా తాగి నగ్న ప్రదర్శన చేయడం జట్టుకు చెడ్డ పేరు తెచ్చింది.

  తాజాగా లార్డ్స్‌లో పరాభవం జట్టు స్థైర్యాన్ని ఒక్కసారిగా దెబ్బ తీసింది. ప్రయర్ ఇప్పటికే తప్పుకోగా, సీనియర్ల వైఫల్యం సమస్యగా మారింది. అన్నింటికి మించి కెప్టెన్‌గా కుక్ పనితీరు, అతని బ్యాటింగ్‌పై అన్ని వైపులనుంచి విమర్శలు చుట్టుముడుతున్నాయి.

  ఇక తొలి టెస్టులో రవీంద్ర జడేజాతో అనవసరంగా కయ్యం పెట్టుకున్న అండర్సన్‌పై ఇప్పుడు కత్తి వేలాడుతోంది. విచారణలో అతను దోషిగా తేలితే ఇక ఈ సిరీస్‌పై ఇంగ్లండ్ ఆశలు వదిలేసుకోవాల్సిందే.

  ‘మూత్ర విసర్జన’ ఘటన తర్వాత ఇంగ్లండ్ 9 టెస్టులు ఆడితే 7 ఓడి రెండు మాత్రమే డ్రా చేసుకోగలిగింది. ఇకపై కూడా ఇదే బాట కొనసాగుతుందా లేక మేలుకొని కోలుకుంటుందా చూడాలి.

 - సాక్షి క్రీడా విభాగం

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top