ద్రవిడ్ 'మార్క్'

ద్రవిడ్ 'మార్క్'


మాజీ క్రికెటర్లకు బీసీసీఐలో పదవి అంటే కామధేనువు లాంటిదే. హోదా, గుర్తింపుతో పాటు ఆర్థిక ప్రయోజనాలూ మామూలే. కానీ రాహుల్ ద్రవిడ్ అలాంటి పదవిని కాదన్నాడు. సలహా సంఘంలో ఉండటం కంటే కుర్రాళ్లను సానబెట్టడమే తనకు ఇష్టమన్నాడు. ప్రశాంతంగా సాగిపోయే పదవులకంటే... సవాల్ విసిరే కోచ్ పదవినే కోరుకున్నాడు. కొత్తతరాన్ని తయారు చేసే బాధ్యత తీసుకున్నాడు. శ్రీలంక సిరీస్ ద్వారా ఇప్పటికే ద్రవిడ్ ‘మార్క్’ కనబడింది కూడా.

 

 సాక్షి క్రీడా విభాగం : చదువులో ఫస్ట్ క్లాస్ విద్యార్థి ఎప్పుడైనా వెనుకబడితే తన లోపాలు సరిదిద్దుకునేందుకు, మళ్లీ టాప్‌లోకి వచ్చేందుకు తనకు ఇష్టమైన టీచర్ దగ్గరికి వెళ్లడం చూస్తుంటాం. ఇప్పుడు భారత క్రికెట్‌కు కూడా రాహుల్ ద్రవిడ్ అలాంటి గురువుగానే కనిపిస్తున్నాడు. పుజారా కావచ్చు లేదా రహానే కావచ్చు...కుర్రాడు లోకేశ్ రాహుల్ అయినా, ఇంకా టెస్టు ఆడని కరుణ్ నాయర్ అయినా కావచ్చు. ఇటీవల వీరందరి ఆటపై ద్రవిడ్ ప్రభావం ఉంది. వారంతా తమ ఆట ను మెరుగు పర్చుకునేందుకు ద్రవిడ్‌ను ఆశ్రయిం చారు. ఫలితం రాబట్టిన తర్వాత తమ వెనుక ‘వాల్’ ఉన్నాడంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు.



 అతని సూచనలతోనే

 ఒకప్పుడు శైలిలోనూ, టెక్నిక్‌లోనూ ద్రవిడ్ వారసుడు అంటూ చతేశ్వర్ పుజారా టెస్టు జట్టులోకి వచ్చాడు. చాలా వరకు ఆ అంచనాలను నిలబెట్టుకున్నా కొన్ని ఇన్నింగ్స్‌ల వైఫల్యంతో తుది జట్టులో స్థానం లేకుండా పోయింది. కానీ ఇటీవల చెన్నైలో భారత్ ‘ఎ’ మ్యాచ్ సందర్భంగా ద్రవిడ్ అతని ఆటను ప్రత్యేకంగా పరీక్షించాడు. ‘పుజారా ఆటను బాగా దగ్గరినుంచి చూశాను. అతని ఆటలో, టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదు. రాబోయే సిరీస్‌లో ఒక్క అవకాశం దక్కినా భారీ ఇన్నింగ్స్ ఖాయం’ అని విశ్లేషించిన ద్రవిడ్... పుజారాను ప్రోత్సహించాడు.



ద్రవిడ్ మాటలు తనలో ఉత్సాహం నింపాయని, ఆయన ఇచ్చిన సూచనలతో ఆత్మవిశ్వాసం పెరిగిందని కొలంబో సెంచరీ అనంతరం పుజారా వ్యాఖ్యానించాడు. నిజానికి పేరుకు బ్యాటింగ్ ప్రాక్టీస్ అన్నా... ఇండియా ‘ఎ’ మ్యాచ్ సందర్భంగా ద్రవిడ్‌నుంచి కోహ్లికి కూడా చక్కటి సలహాలు లభించాయి. ఇక రహానే అయితే రాజస్తాన్ రాయల్స్ జట్టులో కలిసి ఆడిన నాటినుంచి తన మంచి ప్రదర్శనకు కారణంగా ద్రవిడ్ పేరే చెబుతాడు. వెల్లింగ్టన్‌లో తన తొలి టెస్టు సెంచరీని రాహుల్‌కే అంకితమిచ్చిన అజింక్య... బ్యాటింగ్‌లో ఏ లోపం ఉన్నా ద్రవిడ్ దగ్గరికే పరిగెడతాడు.



తన క్రికెట్ కెరీర్‌కు స్ఫూర్తిగా నిలిచిన ద్రవిడ్ వల్లే ఈ స్థాయికి చేరానని ప్రతీ సారి చెప్పే సహచర బెంగళూరు ఆటగాడు కేఎల్ రాహుల్... ఇటీవల ఇండియా ‘ఎ’ సిరీస్ సందర్భంగా ద్రవిడ్ మార్గదర్శనంలో తన బ్యాటింగ్‌ను మెరుగు పర్చుకున్నాడు. ఈ ముగ్గురి ఆటలో కచ్చితంగా ఎక్కడో ఒక చోట ద్రవిడ్ పోలికలు కనిపిస్తాయి. ఈ ముగ్గురూ శ్రీలంకలో ఆకట్టుకున్నారు.



 ఇంకా చాలా ఉంది

 ‘కోచ్‌గా ఇంకా నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఆటగాళ్లతో ఎలా ఉండాలి. ఏం మాట్లాడాలి. అసలు ఏ సమయంలో కల్పించుకోవాలి. ఏం చెబితే వారు ఇబ్బంది పడరో చూడాలి’ అంటూ ద్రవిడ్ తన శిక్షణపై స్వీయ అభిప్రాయం చెప్పాడు. అయితే అతని శిక్షణ ‘ఎ’ జట్టును రాటుదేలేలా చేసిందనడంలో సందేహం లేదు. తన తొలి అసైన్‌మెంట్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో టెస్టుల్లో ఓడిన భారత ‘ఎ’ జట్టు... ఆ తర్వాత ముక్కోణపు వన్డే సిరీస్‌లో, దక్షిణాఫ్రికా ‘ఎ’తో టెస్టు సిరీస్‌లో విజేతగా నిలిచింది. ఫలితాలకంటే యువ ఆటగాళ్లకు ఆడే అవకాశాలు రావడమే ఈ సిరీస్‌ల ముఖ్య ఉద్దేశమని చెప్పిన ద్రవిడ్ అందుకు తగినట్లుగా కుర్రాళ్లను గుర్తించి సానబెట్టే పనిలో పడ్డాడు.



కరుణ్ నాయర్ భారత జట్టుకు ఎంపిక కావడం కుర్రాళ్ళలో స్ఫూర్తి నింపిందని రాహుల్ అభిప్రాయ పడ్డాడు. అసలు తొలి సిరీస్ కోసం ఫాస్ట్ పిచ్‌లు కావాలంటూ బోర్డును అడిగి మరీ తయారు చేయించుకోవడం ద్రవిడ్ భవిష్యత్ ఆలోచనలకు సూచన. విదేశాల్లో ఎదురయ్యే పరిస్థితులను ఆటగాళ్లు ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాలని పట్టుదలగా ఉన్నాడనేది అర్థమవుతుంది. ఇక అండర్-19 జట్టుకు కూడా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఉండాలని ద్రవిడ్ కోరుతున్నాడు. భవిష్యత్తులో భారత జట్టులోకి వచ్చే ఆటగాళ్లంతా ‘ఎ’ జట్టు, అండర్-19 టీమ్‌లనుంచే రావాలి. వీరంతా ఇకపై ద్రవిడ్ శిక్షణలోనే సిద్ధం కానున్నారు. అంటే ఎవరు జట్టులోకి వచ్చినా ద్రవిడ్ ముద్ర, మార్క్ స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

 

 చెలరేగిన సమిత్ ద్రవిడ్

రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ స్కూల్ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. బెంగళూరులో జరుగుతున్న గోపాలన్ క్రికెట్ చాలెంజ్ కప్ అండర్-12 టోర్నీలో అతను 93 పరుగులు చేసి తన జట్టు మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్‌ను గెలిపించాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సమిత్ ఇన్నింగ్స్ కారణంగా అదితి 63 పరుగులతో గెలిచింది. అంతకు ముందు హారిజన్ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సమిత్ 77 పరుగులు చేశాడు. ఈ అక్టోబర్‌తో సమిత్‌కు 10 ఏళ్లు నిండుతాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top