ముంబై ముందుకు వెళుతుందా!

ముంబై ముందుకు వెళుతుందా!

రాయ్‌పూర్: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ చాంపియన్స్ లీగ్ ప్రధాన పోటీలకు అర్హత సాధిస్తుందా... లేక టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుందా అనేది నేడు తేలిపోతుంది. సీఎల్ టి20 టోర్నీ క్వాలిఫయింగ్ దశలో మంగళవారం ముంబై తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఒకటి ఓడి, మరొకటి గెలిచిన పొలార్డ్ సేన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌తో తలపడుతుంది. నార్తర్న్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌లూ నెగ్గి ప్రధాన పోటీలకు దాదాపు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్ ముంబైకి కీలకంగా మారింది. ప్రస్తుతం నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఖాతాలో 8 పాయింట్లు ఉండగా... సదరన్ ఎక్స్‌ప్రెస్ (0 పాయింట్లు) ఇప్పటికే దాదాపుగా టోర్నీ నుంచి వెనుదిరిగింది. కాబట్టి ప్రధానంగా పోటీ ముంబై (4), లాహోర్ లయన్స్ (4) మధ్యే ఉంది. ఆఖరి లీగ్ మ్యాచ్ సందర్భంగా రన్‌రేట్ కీలకం కావచ్చు. మరోవైపు గాయపడిన పేసర్ ప్రవీణ్ కుమార్ స్థానంలో ముంబై తమ జట్టులో లెఫ్టార్మ్ సీమర్ పవన్ సూయల్‌ను ఎంపిక చేసింది. 

 ముంబై అవకాశాలను పరిశీలిస్తే...

  నార్తర్న్‌పై నెగ్గితే... అంతకుముందు సదరన్  చేతిలో లాహోర్ ఓడిపోతే చాలు. ఇక్కడ రన్‌రేట్ అవసరం లేకుండా నేరుగా క్వాలిఫై అవుతుంది.  

  తొలి మ్యాచ్‌లో లాహోర్ గెలిస్తే... మెరుగైన రన్‌రేట్‌తో నార్తర్న్‌ను ముంబై ఓడించాలి. తర్వాతి మ్యాచ్ కాబట్టి ఎంత తేడాతో గెలవాలనేదానిపై ముంబైకి స్పష్టత ఉంటుంది. 

  నార్తర్న్ చేతిలో ముంబై ఓడిపోతే లయన్స్ కూడా గెలవకూడదు. అప్పుడు ఇరు జట్లలో ముంబై రన్‌రేట్ చాలా బాగుంది కాబట్టి ముందుకు వెళ్లవచ్చు. లాహోర్‌ను ఓడిస్తే సదరన్ కూడా నాలుగు పాయింట్లతో పోటీలోకి వస్తుంది కానీ ఆ జట్టు రన్‌రేట్ చాలా తక్కువ కాబట్టి పెద్దగా అవకాశం లేదు. 

  ఇక తొలి మ్యాచ్‌లో లాహోర్ గెలిచి... తర్వాతి మ్యాచ్‌లో ముంబై ఓడిపోతే మరో అవకాశం లేకుండా పొలార్డ్ సేన నిష్ర్కమిస్తుంది.

 

 

 

 


 


 


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top