మెదళ్లను తొలిచే మిథాలి ప్రశ్న

మెదళ్లను తొలిచే మిథాలి ప్రశ్న

లండన్‌ నగరం. శుక్రవారం సాయంత్రం వేళ. 

మహిళల ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీ సందర్భంగా భారత జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతోంది.

 ‘మిథాలీ! మీకు నచ్చిన మేల్‌ క్రికెటర్‌ ఎవరు?’

 – ఓ పేరున్న జర్నలిస్టు యథాలాపంగా అడిగాడు.

 సరిగ్గా ఇలాంటి ప్రశ్న కోసమే ఎప్పట్నుంచో ఎదురు చూస్తోందో ఏమో, ‘‘మీకు నచ్చిన ఫీమేల్‌ క్రికెటర్‌ ఎవరని ఓ మేల్‌ క్రికెటర్‌ను అడగరేం?’’ అంటూ సదరు జర్నలిస్టును నిలదీసింది మిథాలి. 

చూడ్డానికి మూమూలుగానే అనిపించవచ్చు గాక. 

కానీ నిజానికి మహిళల పట్ల సమాజంలో తరతరాలుగా పాతుకుపోయిన పెను వివక్షను నేరుగా నిలదీసే ప్రశ్న ఇది. 

ఆకాశంలో సగమంటూ అన్నింటా మగవాడికి దీటుగా రాణిస్తున్నా నట్టిల్లు మొదలుకుని నెట్టింటి దాకా సర్వే సర్వత్రా తమను వెక్కిరిస్తూ, వేధిస్తూ వికృతానందం పొందుతున్న అనాగరిక భావజాలాన్ని గల్లా పట్టి నిలదీసే ప్రశ్న ఇది.

పురుషాధిక్య సమాజాన్ని నిగ్గదీస్తూ, దమ్ముంటే బదులివ్వమని సవాలు విసిరే ప్రశ్న ఇది. మన వ్యవస్థ తాలూకు మూలాల్లోనే లోతుగా పాతుకుపోయిన అవ్యవస్థపైకి నేరుగా ఎక్కుపెట్టిన నిశిత శరం ఈ ప్రశ్న.

సమాధానం దొరికే లోపు ఇంకెన్ని తరాలు గడవాలో!!?? 

అప్పటిదాకా... బదులే లేని మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఇది!

 

మిథాలీ ఆవేదన అర్థరహితమేమీ కాదు. టెన్నిస్‌లోనూ, కొంతకాలంగా బ్యాడ్మింటన్‌ వంటి వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ మాత్రమే మహిళలకు మన దేశంలో అంతో ఇంతో గుర్తిం పు, ప్రతిఫలం దక్కుతున్నాయి. క్రికెట్, హాకీ వంటి టీమ్‌ ఈవెంట్లలో పురుష జట్లతో పోలిస్తే మహిళలు గుర్తింపుతో పాటు అన్ని విషయాల్లోనూ ఎంతగానో వెనకబడి ఉన్నారన్నది వాస్తవం. మిథాలీనే తీసుకుంటే, దాదాపు 2 దశాబ్దాలుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, ఏళ్ల తరబడి కెప్టెన్‌గా జట్టు భారం మోస్తూ వస్తోంది తను. అయినా సరే... ఆమెకు లభించిన గుర్తింపైనా, అందే పారితోషికమైనా నిన్నా మొన్నా జాతీయ జట్టులోకి వచ్చిన పురుష క్రికెటర్‌ కంటే కూడా తక్కువేనన్నది చేదు నిజం. కాంట్రాక్టు మనీ రూపంలో పురుష క్రికెటర్లపై కోట్లు కురిపిస్తున్న బీసీసీఐ, మహిళా క్రికెటర్లకు మాత్రం లక్షలతో సరిపెడుతోంది. గ్రేడ్‌ ‘ఏ’లో ఉన్న పురుష క్రికెటర్‌కు ఏటా రూ.2 కోట్లు ఇస్తుండగా, అదే గ్రేడ్‌లోని మహిళా క్రికెటర్‌కు మాత్రం రూ.15 లక్షలు విదిలిస్తోంది. 



పురుషుల జట్టు ఏడాది పొడవునా ఊపిరి సలపని అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీగా గడుపుతుంది. దీనికి తోడు పదేళ్లుగా వారిపై కాసుల వర్షం కురిపిస్తున్న కామధేనువు ఐపీఎల్‌ ఉండనే ఉంది. అదీ కాకుండా ప్రకటనల రూపంలో స్టార్‌ క్రికెటర్లు ఆర్జించే మొత్తానికి ఆకాశమే హద్దు. మరోవైపు మహిళల జట్టు ఏడాదికి కనీసం ఒక టెస్టు మ్యాచ్‌కు కూడా దిక్కుండదు. భారత మహిళా క్రికెట్‌ జట్టు చివరిసారి 2014లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో ఒక్కో టెస్టు ఆడింది!! అంతకుముందు వాళ్లు ఆడిన చివరి టెస్టు ఎప్పుడో తెలుసా? అప్పుడెప్పుడో 2006లో!! అసలు మిథాలీ విషయమే తీసుకుంటే, 18 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో ఆమె ఆడిన టెస్టు మ్యాచ్‌లెన్నో తెలుసా? కేవలం పదంటే పదే! రాహుల్‌ ద్రవిడ్‌ తన 16 ఏళ్ల కెరీర్లో ఏకంగా 164 టెస్టులాడాడు! ఈ లెక్కన మహిళా క్రికెటర్ల ఆదాయం ఎంతో అర్థం చేసుకోవచ్చు.

 

నిలకడకు మారుపేరు మిథాలి 

భారత మహిళా క్రికెట్‌కు హైదరాబాద్‌ అందించిన ఆణిముత్యం మిథాలి. 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. అప్పట్నుంచీ భారత జట్టులో రెగ్యులర్‌ మెంబర్‌గా ఉంటోంది. 2005లో తొలిసారి కెప్టెన్‌ అయింది. అదే ఏడాది జట్టును ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిపింది. ఆ తర్వాత కూడా ఆమె సారథ్యంలో భారత జట్టు చిరస్మరణీయ విజయాలెన్నో సాధించింది.

► 34 ఏళ్ల మిథాలీ తన 18 ఏళ్ల కెరీర్‌లో 10 టెస్టులాడి ఒక డబుల్‌ సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలతో 663 పరుగులు చేసింది

► 177 వన్డేల్లో 5 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలతో 5,781 పరుగులు చేసింది. మరో 212 పరుగులు చేస్తే మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకుంటుంది.

► టి20 ఫార్మాట్‌లో 63 మ్యాచులాడి 10 అర్ధ సెంచరీలతో 1,708 పరుగులు చేసింది. 

– సాక్షి, హైదరాబాద్‌
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top