లెక్క తప్పుతోంది!

లెక్క తప్పుతోంది!


లక్ పోతుంది

ధోనికి దూరమవుతున్న ఫినిషింగ్ టచ్

ఇకపై ఆ ‘మ్యాజిక్’ ముగింపులు చూడలేమా?




ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్ ఎవరు..? ఎలాంటి సందేహం లేకుండా ఈ ప్రశ్నకు వినిపించే సమాధానం ధోని. అతను క్రీజులో ఉన్నాడంటే భారత్‌కు విజయం ఖాయమనే ధీమా అందరిలోనూ ఉండేది. చివరి ఓవర్లో ఎన్ని పరుగులు అవసరమైనా... చివరికి రెండు బంతుల్లో 12 పరుగులు కావాలన్నా ధోని ఆడుతున్నాడంటే విజయం ఖాయమనే నమ్మకం ఉండేది. కానీ క్రమంగా ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. అదృష్టాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని తిరుగుతాడనే పేరున్న ధోనిని... ఇప్పుడు అదే అదృష్టం వెక్కిరిస్తోంది. ఇటీవల కాలంలో తరచుగా అతను ఆఖరి ఓవర్ల ‘మ్యాజిక్’ను మిస్ అవుతున్నాడు. తాజాగా అమెరికాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో ఆఖరి బంతికి విజయానికి కావాల్సిన రెండు పరుగులను చేయలేక అవుటయ్యాడు. ఎందుకిలా..?  




రెండో ఎండ్‌లో క్రీజులో ఎంత పేరున్న బ్యాట్స్‌మన్ అరుునా... ధోని సింగిల్స్ తీయకుండా భారీ షాట్‌లతో మ్యాచ్‌లు ముగించడం చాలాసార్లు చూశాం. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో జరిగిన టి20లో రెండో ఎండ్‌లో అంబటి రాయుడు రూపంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఉన్నా ధోని కనీసం సింగిల్స్ తీయకుండా ఒక్కడే మ్యాచ్‌ను ముగించే ప్రయత్నం చేశాడు. ధోని గత చరిత్ర తెలిసిన వాళ్లకు ఇది కొత్తగా అనిపించలేదు. గతంలో ఇదే తరహాలో మ్యాచ్‌లు గెలిపించినందున... ఒక్క మ్యాచ్ ఓడిపోతే విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అందరూ సరిపెట్టుకున్నారు. తర్వాత కాస్త తడబడ్డా మళ్లీ ఈ ఏడాది ఐపీఎల్‌లో వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ధోని చివరి ఓవర్లో తన విశ్వరూపం చూపించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లో విజయానికి 23 పరుగులు అవసరం కాగా... ఒక్కడే బాదేశాడు. ముఖ్యంగా చివరి మూడు బంతులకు 16 పరుగులు అవసరం కాగా... అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్, సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రెండు నెలల క్రితం జింబాబ్వే సిరీస్‌లో ఆఖరి ఓవర్లో విజయానికి 8 పరుగులు అవసరం కాగా... ధోని క్రీజులో ఉన్నా భారత్ ఓడిపోరుుంది. చివరి బంతికి ఫోర్ కొడితే గెలిచే స్థితిలో ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు.




తాజాగా వెస్టిండీస్‌తో టి20 మ్యాచ్‌లో 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ విజయానికి చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం అయ్యారుు. ఇంత భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఎనిమిది పరుగులు విషయమే కాదు. రెండో ఎండ్‌లో కేఎల్ రాహుల్ అప్పటికే సెంచరీ చేసి సంచలనాత్మకంగా హిట్టింగ్ చేస్తున్నాడు. కాబట్టి ధోని రెండో ఎండ్‌లో ఉన్న రాహుల్‌ను నమ్ముకోవచ్చు. అరుుతే వెస్టిండీస్ బౌలర్ బ్రేవో చాలా తెలివిగా వ్యవహరించాడు. ధోనితో కలిసి చెన్నై తరఫున ఆడిన బ్రేవోకు భారత కెప్టెన్ ఏం చేస్తాడో తెలుసు. ఇలాంటి ఓవర్లలో సహజంగా తొలి బంతిని బౌండరీకి పంపి బౌలర్‌పై ఒత్తిడి పెంచుతాడు. కాబట్టి బ్రేవో తెలివిగా వ్యవహరించడం తొలి నాలుగు బంతులకు నాలుగు సింగిల్స్ మాత్రమే వచ్చారుు. చివరి రెండు బంతుల్లో విజయానికి నాలుగు పరుగులు అవసరం కాగా.. ఐదో బంతికి రెండు పరుగుల తీసి, ఆఖరి బంతికి భారత కెప్టెన్ అవుటయ్యాడు. తన జీవితంలోనే మరచిపోలేని ఇన్నింగ్‌‌స ఆడి సెంచరీ చేసిన రాహుల్ ఆ క్షణంలో పడిన బాధను చూస్తే... ధోని కూడా కచ్చితంగా ఫీలయ్యే ఉంటాడు.


 

బౌలర్లు హోమ్‌వర్క్ చేస్తున్నారు

ధోని మంచి ఫినిషర్ అని ప్రపంచంలో ఉన్న బౌలర్లందరికీ తెలుసు. బంతి వేసేది తెలివైన బౌలర్ అరుుతే ధోనిని నియంత్రించవచ్చని గతేడాది దక్షిణాఫ్రికా బౌలర్ రబడ ప్రపంచానికి చూపించాడు. కాన్పూర్‌లో జరిగిన వన్డేలో ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా... రబడ భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు. ధోని కదలికలను బట్టి బంతుల్లో వైవిధ్యం చూపించాడు. ఈసారి వెస్టిండీస్ బౌలర్ బ్రేవో కూడా అదే చేశాడు. ధోని క్రీజులో కదులుతున్న విషయాన్ని గమనించి స్లో బంతితో బోల్తా కొట్టించాడు. అంటే... అన్ని జట్ల బౌలర్లు  హోమ్ వర్క్ చేసే బరిలోకి దిగుతున్నారు.




విశ్రాంతి వల్ల ఇబ్బందా?

ధోని కెరీర్ ఆరంభం నుంచి ఎప్పుడూ సుదీర్ఘంగా విశ్రాంతి తీసుకోలేదు. అన్ని ఫార్మాట్లలోనూ అలుపెరగకుండా ఆడాడు. దీంతో ఎప్పుడూ ‘టచ్’ కోల్పోలేదు. కానీ ఇప్పుడు ధోని టెస్టులు ఆడటం లేదు. కేవలం వన్డేలు, టి20లకు పరిమితమయ్యాడు. వాస్తవానికి జింబాబ్వే పర్యటన తర్వాత భారత్‌కు అన్నీ టెస్టు మ్యాచ్‌లే ఉన్నారుు. అనుకోకుండా అమెరికాలో రెండు టి20లు ఆడాల్సి రావడం వల్ల ధోని వచ్చాడు. లేదంటే దాదాపు మరో రెండు మూడు నెలలు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగానే ఉండేవాడు. ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత ఫిట్‌నెస్ కోసం శ్రమించినా మ్యాచ్ ప్రాక్టీస్ ఉన్న ఆటగాళ్లే మెరుగ్గా రాణిస్తారనేది ఎవరూ కాదనలేని వాస్తవం. దీనిని ధోని ఎలా అధిగమిస్తాడో చూడాలి.


ఆర్డర్ మారడం మేలేమో..!

ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, అంచనాల ప్రకారం ధోని ఇంగ్లండ్‌లో వన్డే ప్రపంచకప్ (2019) వరకు కొనసాగాలని అనుకుంటున్నాడు. గతంతో పోలిస్తే ధోనిలో ఫినిషింగ్ పవర్, భారీ హిట్టింగ్ పవర్ తగ్గిందనేదీ వాస్తవం. ఈ నేపథ్యంలో మరో మూడేళ్లు క్రికెట్ ఆడాలంటే ధోని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవడం మేలు. ఆఖరి ఓవర్లలో హిట్టింగ్ చేయగల ఆటగాడిని చూసుకుని ధోని మిడిలార్డర్‌లో నాలుగు, ఐదు స్థానాల్లో ఆడటం వల్ల క్రీజులో కుదురుకోవడానికి సమయం దొరుకుతుంది. 




వెస్టిండీస్‌తో ఆఖరి బంతికి అవుటైనా ఆ మ్యాచ్‌లో ధోని బాగా ఆడాడు. ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన ధోనిని విమర్శించడం కరెక్ట్ కాదు. కానీ గతంలోలాగా ఆఖరి ఓవర్లలో ఒక్కడే షో చేయడం ఇకపై సాధ్యం కాకపోవచ్చు. అదృష్టం కూడా ప్రతిసారీ వెంట ఉండదు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని మార్పులు, చేర్పులు చేసుకుంటే భారత క్రికెట్‌కు మంచి జరుగుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top