దినేశ్ మోంగియానే గ్యాంగ్‌లీడర్!

దినేశ్ మోంగియానే గ్యాంగ్‌లీడర్!


ఐసీఎల్ ఫిక్సింగ్‌పై విన్సెంట్ సాక్ష్యం  

   ఖండించిన మోంగియా

 లండన్: ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ఫిక్సింగ్ వివాదంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ మరో కొత్త అంశాన్ని తెర మీదికి తెచ్చాడు. ఫిక్సింగ్‌లో కీలక పాత్ర పోషించిన నలుగురు సభ్యుల బృందానికి భారత మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియా నాయకత్వం వహించాడని అతను వెల్లడించాడు. మోంగియా సూచనలతోనే చండీగఢ్ లయన్స్ జట్టు సభ్యులు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని విన్సెంట్ గుట్టు విప్పాడు. తనతో పాటు ఇతర కివీస్ క్రికెటర్లు క్రిస్ కెయిన్స్, డరైల్ టఫీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని అతను కోర్టులో చెప్పాడు. క్రిస్ కెయిన్స్ ‘మోసపూరిత’ కేసుకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న విచారణకు హాజరైన విన్సెంట్...

 

 నాటి సంగతులు బయట పెట్టాడు. ఒక్కో మ్యాచ్‌కు తనకు 50 వేల డాలర్లు ఇస్తానని కెయిన్స్ చెప్పినట్లు విన్సెంట్ కుండబద్దలు కొట్టాడు. అయితే ఈ తాజా ఆరోపణలను మోంగియా ఖండించాడు. ‘నేను చండీగఢ్ తరఫున ఆడిన మాట వాస్తవమే. కానీ ముగ్గురు కివీస్ క్రికెటర్లు కలిసి ఏం చేశారనేది నాకు తెలీదు’ అని అతను వివరణ ఇచ్చాడు. 2008లోనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పి మోంగియాపై ఐసీఎల్ నిర్వాహకులు నిషేధం విధించినా... సరైన కారణాలు బయట పెట్టలేదు. 2003 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన జట్టులో సభ్యుడైన దినేశ్ మోంగియా భారత్ తరఫున 57 వన్డేలు, 1 టి20 మ్యాచ్ ఆడాడు. ఐసీఎల్ నుంచి బయటికి వచ్చిన క్రికెటర్లు అందరికీ క్షమాభిక్ష అందించిన బీసీసీఐ, మోంగియాను మాత్రం పట్టించుకోలేదు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top