ధోని మళ్లీ రైలెక్కాడు...

ధోని మళ్లీ రైలెక్కాడు...


13 ఏళ్ల తర్వాత ప్రయాణం

విజయ్‌ హజారే టోర్నీలో జార్ఖండ్‌ కెప్టెన్‌గా బరిలోకి  




కోల్‌కతా: ఔను... ధోని రైలెక్కాడు! జార్ఖండ్‌ వన్డే క్రికెట్‌ జట్టుతో పాటు రాంచీ నుంచి హౌరా వరకు ప్రయాణించాడు. అది కూడా ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు, సేవలు పొందకుండానే! ఓ సాధారణ ప్రయాణికుడిలా ఉల్లాసంగా తన జర్నీ సాగించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.అదేంటో ఏమోగానీ... ధోని ఏం చేసినా... ధనాధన్‌ సహజమేనేమో! క్రీజులో దిగినా... వీరబాదుడు బాదినా... సిక్సర్లతో మ్యాచ్‌ల్ని ముగిం చినా, చివరకు ఆకస్మిక నిర్ణయాలు చిటికెలో తీసుకున్నా... అన్ని మెరుపు వేగంతోనే! అప్పుడేమో భారత విజయవంతమైన సారథిగా వెలుగొందుతూనే టెస్టు కెరీర్‌కు బైబై చెప్పాడు. ఈ మధ్యే వన్డే సారథ్యాన్ని వద్దన్నాడు. తాజాగా తన రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహిస్తానన్నాడు. అదే పనిలో జట్టులో నేను ఓ ఆటగాడినేనంటూ అందరితో పాటు క్రియా యోగ ఎక్స్‌ప్రెస్‌లో 2టయర్‌ ఏసీ బోగీలో ప్రయాణించాడు.



విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నీ కోసం మంగళవారం రాత్రి రాంచీలో రైలెక్కిన ధోని సేన బుధవారం ఉదయం హౌరాలో దిగింది. 13 ఏళ్ల తర్వాత గతంలో తను టీటీఈగా పనిచేసిన ఖరగ్‌పూర్‌ స్టేషన్‌ మీదుగా ఈ ప్రయాణం సాగింది. ‘ధోని కోసం జార్ఖండ్‌ జట్టు వర్గాలు ప్రత్యేక బోగీని కోరలేదు. అయితే ధోని వస్తున్నట్లు ముందుగానే సమాచారం అందడంతో భద్రతా ఏర్పాట్లు చేశాం’ అని సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే (ఎస్‌ఈఆర్‌) పౌర సంబంధాల అధికారి సంజయ్‌ ఘోష్‌ తెలిపారు. ఈ రైల్వే జోన్‌లోనే ధోని 2001 నుంచి 2004 వరకు ఖరగ్‌పూర్‌ స్టేషన్‌లో టీటీఈగా పనిచేశాడు. ధోని సారథ్యంలోని జార్ఖండ్‌ జట్టు తమ తొలి మ్యాచ్‌లో కర్ణాటకతో తలపడుతుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈనెల 25న ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ జాతీయ వన్డే టోర్నీలో ధోనితోపాటు భారత స్టార్‌ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్, యువరాజ్‌ సింగ్‌ పంజాబ్‌ తరఫున... రోహిత్‌ శర్మ ముంబై తరఫున బరిలోకి దిగుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top