ధోనినే వద్దన్నాడా?

ధోనినే వద్దన్నాడా?


ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 వేలానికి ఒక రోజు ముందు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని  తప్పించడంపై రకరకాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ధోనిపై పుణె ఫ్రాంచైజీ వేటు వేసిందనే వార్తలు బలంగా వినిపిస్తుండగా, అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని  ఆ యాజమాన్యం వర్గాల ద్వారా తెలుస్తోంది. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ఇప్పటికే తప్పుకున్న నేపథ్యంలో ఐపీఎల్లో కూడా ఆ బాధ్యతను చేపట్టలేనని ధోని చెప్పినట్లు సమాచారం. దీనిలో భాగంగా ధోనిని ఆటగాడిగా మాత్రమే కొనసాగించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.. ఆ క్రమంలోనే స్టీవ్ స్మిత్ ఎంపికకు మొగ్గు చూపినట్లు సదరు ఫ్రాంచైజీ సీనియర్ అధికారులు తెలియజేస్తున్నారు. 'ఆ నిర్ణయం మాది కాదు.. ధోనిదే. ఆ నిర్ణయం తీసుకున్న తరువాతే ధోని మా  వద్దకు వచ్చాడు. తాను కెప్టెన్ గా చేయలేనని చెప్పాడు'అని ఫ్రాంచైజీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.





గతేడాది ధోని నేతృత్వంలో పుణె సూపర్ జెయింట్స్ పేలవమైన ఆట తీరుతో టాప్-4లో స్థానం సంపాదించలేకపోయింది. గత ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ జట్టుతో పాటు, పుణె సూపర్ జెయింట్స్ లు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ లీగ్ దశలో గుజరాత్ టాప్ లో నిలిస్తే, పుణె చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.ఐపీఎల్-9 సీజన్ లో 14 మ్యాచ్లాడిన పుణె.. కేవలం ఐదు విజయాల్ని మాత్రమే నమోదు చేసి యాజమాన్యం పెట్టుకున్న ఆశలను వమ్ము చేసింది. ఈ క్రమంలోనే  ఏడో స్థానానికి పరిమితమైంది పుణె.  మరొకవైపు ధోని కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. 12 ఇన్నింగ్స్ ల్లో ఒక హాఫ్ సెంచరీ సాధించి 284 పరుగులు సాధించాడు. మరొకవైపు పుణె  కొత్త కెప్టెన్ గా నియమించబడ్డ స్టీవ్ స్మిత్ గతేడాది ఆ జట్టు తరపున భారీ ఇన్నింగ్స్ లు ఏమీ ఆడలేదు. స్టీవ్ స్మిత్ 7 ఇన్నింగ్స్ ల్లో ఆడి ఒక సెంచరీ సాయంతో 270 పరుగులు చేశాడు. ఇదిలా ఉంచితే సవాళ్లను స్వాగతించే ధోని నిజంగానే కెప్టెన్సీ వద్దన్నాడా?లేక పొగబెట్టి అతన్ని తొలగించారా?అనే దానిపై అతను పెదవి విప్పితేగానీ తెలియదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top