'ధోని వల్ల అతనికి నష్టం'

'ధోని వల్ల అతనికి నష్టం'


న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కెరీర్ కు సంబంధించి ఏదొక రూపంలో విమర్శలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఇటీవల శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ కు ధోనిని ఎంపిక చేయడాన్ని మాజీ ఆటగాడు గౌతం గంభీర్ తీవ్రంగా తప్పుబట్టాడు. 2019 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేశామని టీమిండియా సెలక్టర్లు చెబుతున్న నేపథ్యంలో గంభీర్ స్వరం పెంచాడు.  ధోని వరల్డ్ కప్ లో కొనసాగాలంటే అతను అప్పటివరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉందంటూ గంభీర్ చురకలంటించాడు.




'మెరుగ్గా ఆడితే ధోని వరల్డ్ కప్ వరకూ కొనసాగుతాడు అని చీఫ్ సెలక్టర్ ఎంఎస్ కే ప్రసాద్ చెప్పారు. అది అతనికి మాత్రమే పరిమితమా. మిగతా వారికి ఆ అవకాశం ఎందుకు లేదు. ధోనికి ఒక నిబంధన.. వేరే ఆటగాళ్లకి మరొక నిబంధనా. ఎవర్నీ ఎంపిక చేసినా అది వారి ప్రస్తుత ఫామ్పైనే ఆధారపడుతుంది కదా. గతంలో సాధించిన ఘనతలు పెద్దగా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉండదు కదా. మరి ఫామ్ లోని ధోని ఎంపిక ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. అంటే వచ్చే వరల్డ్ కప్ వరకూ ధోనిని ఏదొక రకంగా కొనసాగించాలనే ఉద్దేశం సెలక్టర్లలో ఉంది. ఇలా చేస్తే చాలామంది ఆటగాళ్లు నష్టపోతారు. ఇక్కడ మరొక వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ను తీసుకోండి. అతను అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఎప్పుడు అవకాశం ఇచ్చినా నిరూపించుకుంటూనే ఉన్నాడు. మరి ధోనిని అప్పటివరకూ కొనసాగించాలని చూస్తే దినేశ్ కార్తీక్ కు నష్టం జరిగినట్లు కాదా. దినేశ్ కార్తీక్ ను పరిగణలోకి తీసుకోవపోవడం కచ్చితంగా మనకు లోటే. ధోని ఎంపిక వల్ల అతనికి నష్టం జరిగింది.  ధోని భవిష్యత్తు గురించి జట్టు సమావేశాల్లో చర్చించిన తరువాత అతని ఎంపికపై నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ చెబుతున్నారు. అతని ఒక్కడి గురించి మాత్రమే చర్చిస్తారా. మిగతవాళ్లు ఆటగాళ్లు కాదా. ఒక్కరి గురించి చర్చించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. అందరు గురించి చర్చించిన తరువాత జట్టును ఎంపిక చేయాలి. ఈ విషయంలో నీవు(ఎంఎస్కే) నిజాయితీగా ఉన్నావా.  నేను నిజాయితీగానే ఉన్నా'అని గంభీర్ తీవ్రంగా ధ్వజమెత్తాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top