‘ఎడారి’లో ఫుల్ క్రేజ్


అబుదాబి: విదేశాల్లో ఐపీఎల్‌కు ఆదరణ  ఉంటుందా..? 2009లో ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికాలో జరిగినప్పుడు పెద్దగా ప్రేక్షకులు లేరు. కాబట్టి ఈసారి పరిస్థితి ఏమిటి? యూఏఈని వేదికగా ఎంచుకోక ముందు ఉన్న సందేహం ఇది. కానీ ఒక్కసారి యూఏఈలోని మూడు వేదికలను ఖరారు చేసిన తర్వాత అక్కడి అభిమానుల నుంచి వచ్చిన స్పందనతో బీసీసీఐ ఊపిరి పీల్చుకుంది. టిక్కెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. భారత్‌ను మించి యూఏఈలో బ్లాక్‌లో టిక్కెట్లు కొంటున్నారు.

 

 తొలి మ్యాచ్ ముంబై, కోల్‌కతాల మధ్య పోరుకు వాస్తవ విలువ (80 దిర్హామ్‌లు)కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువగా 1500 దిర్హామ్‌లకు బ్లాక్‌లో టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఈ ఒక్క మ్యాచ్‌కే కాదు... మొత్తం యూఏఈలోని మూడు వేదికల్లో జరిగే 20 మ్యాచ్‌లకు ఇదే స్థాయిలో డిమాండ్ ఉంది.



ఇన్నేళ్లుగా తమ దేశంలో చూడని పాపులర్  లీగ్ టోర్నీ కోసం వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లను తిలకించినా...ఐపీఎల్‌లో పెద్ద సంఖ్యలో ఉండే స్టార్ క్రికెటర్ల సందడిని కోల్పోకూడదని వారు భావిస్తున్నారు. సంపన్నులైన స్థానికులకు ఇదో రకం కొత్త సరదా కాబట్టి వారూ ఐపీఎల్‌పై అమితాసక్తి కనబరుస్తున్నారు.

 

 అంతా మనోళ్లే...

 ఉపాధి కోసం యూఏఈ వెళ్లిన భారత్, పాక్, బంగ్లాదేశ్, నేపాల్  దేశాల అభిమానులే ఈ టోర్నీకి శ్రీరామరక్ష కానున్నారు. సహజంగానే మనోళ్ల క్రికెట్ పిచ్చి అరబ్ దేశంలో ప్రతిఫలిస్తోంది. ‘నా స్వస్థలం రాంచీ. డైనమైట్ ధోని ఆటను ప్రత్యక్షంగా తిలకించేందుకు నాకు ఇదో మంచి అవకాశం. అతను ఆడే ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాను’ అని రాజేందర్ సోరేన్ అనే అభిమాని అన్నాడు.

 

  నేపాల్‌కు చెందిన కారు డ్రైవర్ మదన్ బహదూర్...స్టేడియం వరకు ప్యాసింజర్లతో వెళతానని, మ్యాచ్ చూసి మళ్లీ ప్యాసింజర్లతో తిరిగి వస్తానని చెబుతున్నాడు. పాకిస్థాన్ వీరాభిమాని అయిన 35 ఏళ్ల మొహమ్మద్ హుస్సేన్ కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. ‘భోజనం చేయకుండా ఉండగలను కానీ క్రికెట్ మ్యాచ్ చూడకుండా ఉండలేను. మా ఆటగాళ్లు ఐపీఎల్‌లో లేరని తెలుసు. అయితే ఎవరు ఆడినా ఆడకున్నా ఆటపైనే నా ప్రేమంతా’ అని తన అభిమానం చాటుకున్నాడు. ఐపీఎల్‌తో తమ వ్యాపారం కూడా మెరుగుపడుతుందంటున్న మరో బంగ్లాదేశ్ డ్రైవర్... షకీబ్ ఆడుతున్నాడు కాబట్టి కోల్‌కతాకే తన మద్దతు ప్రకటించాడు.

 

 ఎండ సమస్యే

 గత కొన్నేళ్లుగా షార్జా, అబుదాబి, దుబాయ్‌లు పాకిస్థాన్ జట్టుకు సొంత మైదానంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రధాన కార్యాలయం ఉన్న దుబాయ్‌లో ఇన్నేళ్లకు ఒక పెద్ద పండగ జరుగుతుండటం అన్ని వర్గాలను ఆనంద పరుస్తోంది. ముఖ్యంగా అక్కడి కొన్ని వ్యాపార సంస్థలు ప్రత్యేకంగా ఐపీఎల్ ప్రచారం కోసమే జట్లతో తాత్కాలిక ఒప్పందాలు చేసుకున్నాయి.

 

  ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడి వాతావరణమే ఇప్పుడు ఐపీఎల్‌కు పెద్ద సవాల్‌గా కనిపిస్తోంది. తీవ్రమైన ఎండ వేడిమి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టవచ్చు. భారత్‌లో ఈ సీజన్‌లో 35-38 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఆడేందుకే విదేశీ ఆటగాళ్లు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేడిని వారు తట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో క్రికెటర్లు చెమటోడ్చక తప్పదు.

 

 పెద్ద మైదానాలు

 అసలు ఆట విషయానికి వస్తే ఇక్కడి మూడు మైదానాలు కూడా భారత్‌లోని గ్రౌండ్‌లతో పోలిస్తే చాలా పెద్దవి.  కాబట్టి బ్యాట్‌కు, బంతికి మధ్య సమాన పోటీ ఉంటూ ఆసక్తికర మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. అయితే పిచ్‌లు నెమ్మదిగా ఉంటూ ఇటీవల బౌన్స్ కూడా తగ్గింది. కాబట్టి భారీ స్కోర్లు ఎక్కువగా నమోదు కాకపోవచ్చు. షార్జా స్టేడియంలో 9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగితే రెండు సార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top