ఢిల్లీకి తొలి విజయం

ఢిల్లీకి తొలి విజయం


న్యూఢిల్లీ: తొలి రెండు మ్యాచ్‌లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో తమ మూడో మ్యాచ్‌లో దుమ్మురేపింది. మైదానంలో కళ్లు చెదిరే రీతిలో గోల్స్ చేస్తూ పటిష్టమైన చెన్నైయిన్ చిత్తు చేసింది. దీంతో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 4-1 గోల్స్ తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. రేమీకర్స్ (1వ ని.), జుంకెర్ (21వ ని.), హీరెరో (79వ ని.), డాస్ సాంటోస్ (90వ ని.) ఢిల్లీకి గోల్స్ అందించగా... ఎలానో (69వ ని.) అద్భుతమైన ఫ్రీకిక్‌తో చెన్నై తరఫున ఏకైక గోల్ సాధించాడు.



ఢిల్లీ కెప్టెన్ డెల్ పియరో పెద్దగా ఆకట్టుకోకపోయినా... మిడ్ ఫీల్డ్‌లో బ్రూనో, ముల్దర్, దియాస్, షైలో, మల్సావామ్‌తులంగాలు అంచనాలకు మించి రాణించారు. ప్రథమార్ధంలో పెద్దగా ప్రభావం చూపని చెన్నై రెండో అర్ధభాగంలో కాస్త వ్యూహాత్మకంగా ఆడింది. అయితే గోల్స్ చేయడంలో వెనుకబడి ఓటమిపాలైంది. పియరో ఇచ్చిన షాట్ కార్నర్‌ను తొలి నిమిషంలోనే రేమీకర్స్ నేర్పుగా గోల్ పోస్ట్‌లోనికి పంపాడు. 12వ నిమిషంలో హర్మన్‌జ్యోత్ (చెన్నై) కొట్టిన షాట్ నెట్ ముందు అడ్డుకున్నారు.



13వ నిమిషంలో జుంకెర్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌కు దూరంగా వెళ్లినా... మరో 8 నిమిషాల తర్వాత పియారో ఇచ్చిన పాస్‌ను సరైన షాట్‌తో నెట్‌లోకి పంపాడు. అయితే స్కోరును సమం చేసేందుకు చెన్నై చేసిన ప్రయత్నాలను ఢిల్లీ డిఫెండర్లు సమర్థంగా తిప్పికొట్టారు. రెండో అర్ధభాగం ఆరంభంలో మెండోజా రెండుసార్లు గోల్స్ చేసినంత పని చేశాడు. కానీ ఢిల్లీ కీపర్ హౌట్ చక్కగా తిప్పికొట్టాడు. అయితే 69వ నిమిషంలో ఎలానో కొట్టిన ఫ్రీ కిక్ చెన్నైకి గోల్ సాధించిపెట్టింది. తర్వాత ఢిల్లీ మరో రెండు గోల్స్ చేసినా.. చెన్నై మాత్రం విఫలమైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top