డియర్ మెకల్లమ్...

డియర్ మెకల్లమ్... - Sakshi


భారత క్రికెట్ అభిమానులు మాకే మద్దతు ఇవ్వాలంటూ నువ్వు రాసిన లేఖకు జవాబు.

నువ్వు అడగకపోయినా మా దేశంలో ప్రతి పది మంది క్రికెట్ అభిమానుల్లో ఏడుగురు మీ వెంటే ఉన్నారు. దీనికి రెండు కారణాలు. ఇందులో మొదటిది మాకు జాలి ఎక్కువ. ఆస్ట్రేలియా నాలుగు సార్లు గెలిచింది. పాపం... న్యూజిలాండ్ మొదటిసారి ఫైనల్‌కు వచ్చింది. ఒకసారి గెలిస్తే బావుంటుంది అనే భావన. ఇక రెండో కారణం... ఆస్ట్రేలియా మమ్మల్ని సెమీస్‌లో చిత్తు చేసింది. అందుకే ఉదయాన్నే మేం టీవీలకు అతుక్కుపోయాం. నువ్వు టాస్ గెలవగానే మ్యాచ్ గెలిచినట్లే అని సంబరపడ్డాం.

 

స్టార్క్ ఈ టోర్నమెంట్‌లో ఎంత బాగా బౌలింగ్ చేస్తున్నాడో అందరికీ తెలుసు. అలాంటి బౌలర్‌కు కొంత గౌరవం ఇవ్వాలి. కనీసం ఒకట్రెండు ఓవర్లు నిలదొక్కుకుని వికెట్‌ను చూసి ఆడాలి. కానీ నువ్వేమో తొలి బంతి నుంచే అడ్డంగా బ్యాట్ ఊపడం మొదలెట్టావ్. ఫలితం అనుభవించావ్. పది ఓవర్లు మెకల్లమ్ క్రీజులో ఉంటే స్కోరు 100కి వెళుతుంది. ఈ విషయం మాకంటే నీకే ఎక్కువ తెలుసు. అయినా తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు చేరి కప్‌ను ఆస్ట్రేలియా చేతిలో పెట్టేశావ్.



ఇక గప్టిల్, విలియమ్సన్ కూడా అవుటయ్యాక... కోలుకోలేరని అర్థమైంది. సెమీస్‌లో అద్భుతంగా ఆడిన ఇలియట్ మరోసారి చక్కగా ఆడాడు. రాస్ టేలర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 35 ఓవర్లలో 3 వికెట్లకు 150. ఇక బ్యాటింగ్ పవర్ ప్లే. ఈ సమయంలో మీ స్కోరు కచ్చితంగా 270 నుంచి 300 వరకు వెళ్లే అవకాశం కనిపించింది. కానీ ఏం ఉపయోగం... ఫాల్క్‌నర్ ప్రతిభ కొంత, మీ బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యం కొంత... వెరసి కుప్పకూలారు. 300 పరుగులు చేయాల్సిన వికెట్‌పై 183తో సరిపెట్టుకున్నారు.

 

భారత అభిమానులు ప్రేమిస్తే ఎంత బాగుంటుందో మీకు తెలియదు. 1983 ప్రపంచకప్‌లో మేం 183 పరుగులే చేసినా బలమైన వెస్టిండీస్‌పై గెలిచి కప్ సాధించాం. అదే మాకూ తొలి ఫైనల్. ఇప్పుడు మీరూ 183 చేశారు. మీకూ తొలి ఫైనల్. క్రికెట్‌లో ఓ చిన్న గణాంకాన్ని, సెంటిమెంట్‌ను పట్టుకుని మాకు మేమే ధైర్యం చెప్పుకున్నాం.

 

ఈ టోర్నీ మొత్తం సంచలన బౌలింగ్‌తో మీకు విజయాలు అందించిన బౌల్ట్... తన తొలి ఓవర్లోనే ఫించ్‌ను అవుట్ చేయగానే... ఇక్కడ మేం సంబరపడ్డాం. ఆస్ట్రేలియాకు, మీకు మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో తక్కువ స్కోర్లే వచ్చినా ఎంత ఉత్కంఠగా పోరాటం జరిగిందో గుర్తొచ్చింది. ఫైనల్లో వికెట్ బౌలర్లకు అనుకూలంగా లేకపోయినా... ఏదో ఆశ. మీరు కచ్చితంగా పోరాడతారనే నమ్మకంతో టీవీలకు అతుక్కునే ఉన్నాం. వార్నర్, స్మిత్, క్లార్క్ ప్రొఫెషనల్‌గా ఆడిన ఆటకు మీ దగ్గర జవాబు లేకపోయింది.

 

ఎంత మీకు మద్దతిచ్చినా... ఆస్ట్రేలియా ప్రొఫెషనల్ ఆటతీరుకు ఫిదా అయిపోయాం. భారత్ ఓడిపోతే ఉండే వేదన, బాధ మాకు లేవు, మీ మీద జాలి మాత్రం ఉంది. పాపం... అనుకోవడం తప్ప ఇంకేం చేస్తాం. అయితే ఈ ప్రపంచకప్‌లో మీరు చాలా బాగా ఆడారు. వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలవడం అంటే చిన్న విషయం కాదు. అయితే స్వదేశంలో మీరు వేరు... బయట మీరు వేరు.



న్యూజిలాండ్‌లో ఆడుతున్నంతసేపు ‘నీటిలో మొసలి’లా బలంగా ఉంటారు. బయటకొస్తే మాత్రం చేతులెత్తేస్తారు. ఈ పరిస్థితి నుంచి బాగా మెరుగుపడితే తప్ప ప్రపంచ విజేతలు కాలేరు. మొత్తానికి ఈ ఫైనల్ ఒకటి చూపించింది... ‘గెలవడానికే పుట్టిన జట్టు ఆస్ట్రేలియా... గెలవడం ఎలాగో నేర్చుకుంటున్న జట్టు న్యూజిలాండ్’.

 -ఓ భారత అభిమాని

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top