శతక్కొట్టిన వార్నర్

శతక్కొట్టిన వార్నర్

రెండో వన్డేలోనూ కివీస్‌పై ఆసీస్ విజయం సిరీస్ 2-0తో కై వసం  

కాన్‌బెర్రా: ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ మరోసారి మెరిశాడు. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో వార్నర్ (115 బంతుల్లో 119; 14 ఫోర్లు, ఒక సిక్స్) సూపర్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 116 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల చాపెల్-హ్యాడ్లీ  వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. వార్నర్ కెరీర్‌లో ఇది పదో సెంచరీకాగా... ఈ ఏడాది ఆరోది కావడం విశేషం. ఒకే ఏడాదిలో అత్యధికంగా ఆరు సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌గా వార్నర్ గుర్తింపు పొందాడు.

 

 గతంలో పాంటింగ్ (2003, 2007లో), హేడెన్ (2007లో) ఒకే ఏడాది ఐదేసి సెంచరీలు చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 378 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (72; 6 ఫోర్లు, ఒక సిక్స్), ట్రావిస్ హెడ్ (32 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (40 బంతుల్లో 76; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. 379 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 47.2 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (81; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), నీషమ్ (74; 7 ఫోర్లు, ఒక సిక్స్) మూడో వికెట్‌కు 125 పరుగులు జోడించారు. నీషమ్ అవుటయ్యాక కివీస్ ఇన్నింగ్‌‌స తడబడింది. ఆసీస్ బౌలర్లలో కమిన్‌‌స (4/40) రాణించాడు. మూడో వన్డే ఈనెల 9న జరుగుతుంది.  

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top