'డే అండ్ నైట్ టెస్టు వాయిదా'

'డే అండ్ నైట్ టెస్టు వాయిదా'


న్యూఢిల్లీ:న్యూజిలాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా భారత్లో తొలిసారి గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరపాలని భావించిన బీసీసీఐ తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. న్యూజిలాండ్తో సిరీస్ నాటికి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ పై పలు విధాల పరిశీలన సాధ్యమయ్యే అవకాశం లేనందున ఆ చారిత్రాత్మక మ్యాచ్ను వాయిదా వేయనున్నట్లు బీసీసీఐ జాయింట్ సెక్రటరీ అమితాబ్ చౌదరి తెలిపారు.


'కివీస్ తో సిరీస్ లో ఒక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ను నిర్వహించాలని బీసీసీఐ భావించింది. సాధ్యమైనంత పరిశీలన లేకుండా అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ను నిర్వహించలేము. పింక్ బాల్ తో నిర్వహించే ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఎక్కువమంది టాప్ ఆటగాళ్లు పాల్గొంటే ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి అది సాధ్యం కాని కారణంగా డే అండ్ నైట్ టెస్టును వాయిదా వేస్తున్నాం. స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో కానీ, ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్లో కానీ పింక్ బాల్ టెస్టును నిర్వహించాలని అనుకుంటున్నాం'అని అమితాబ్ చౌదరి తెలిపారు.



గత మూడు రోజుల క్రితం న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు జరిగే తొలి టెస్టుకు కాన్పూర్ ఆతిథ్యమివ్వనుండగా, సెప్టెంబర్ 30వ తేదీన రెండో టెస్టు కోల్ కతాలో ఆరంభం కానుంది. ఇక మూడో టెస్టు ఇండోర్ లో నిర్వహించనున్నారు. దీంతో ఇండోర్ తొలిసారి టెస్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం అక్టోబర్ 16 నుంచి 29 వరకు ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 16వ తేదీన ధర్మశాలలో తొలి వన్డే, అక్టోబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రెండో వన్డే, అక్టోబర్ 23వ తేదీన మొహాలీలో మూడో వన్డే, అక్టోబర్ 26వ తేదీన రాంచీలో నాల్గో వన్డే జరుగుతుండగా, చివరి వన్డేను అక్టోబర్ 26వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top