‘గురి' కుదిరింది

‘గురి' కుదిరింది


10 మీ. ఎయిర్ రైఫిల్‌లో బింద్రాకు స్వర్ణం

 కామన్వెల్త్ గేమ్స్‌కు గుడ్‌బై చెప్పిన అభినవ్

 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో మలైకాకు రజతం


 

 గ్లాస్గో:  వరుస పాయింట్లతో సహచరుడు దూసుకుపోయినా... మధ్యలో కాస్త ఏకాగ్రత చెదిరినా... లక్ష్యం మాత్రం చెదరలేదు. సిరీస్.. సిరీస్‌కు.. ఒక్కొక్క షాట్‌కు తన అనుభవాన్నంతా రంగరించి పాయింట్లు సాధించిన భారత్ మేటి షూటర్ అభినవ్ బింద్రా కామన్వెల్త్ గేమ్స్‌లో ‘పసిడి’ గురితో అదరగొట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 205.3 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా గేమ్స్‌లో కొత్త రికార్డును నమోదు చేశాడు.


 


బ్యారీ బుడాన్ షూటింగ్ సెంటర్‌లో జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో మూడో స్థానంలో నిలిచినా ఫైనల్లో మాత్రం ఎలాంటి తప్పిదాలు చేయకుండా లక్ష్యాన్ని చేరుకున్నాడు. సగం టైమ్ వరకు అగ్రస్థానంలో ఉన్న మరో షూటర్ రవి కుమార్ (162.4 పాయింట్లు) చివరకు నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. బాకీ (బంగ్లాదేశ్-202.1 పాయింట్లు) రజతం, రైవర్ (182.4 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు.

 

 ఇవే నా చివరి గేమ్స్....

 స్వర్ణం గెలిచిన తర్వాత బింద్రా కామన్వెల్త్ గేమ్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘నాకు ఇవే చివరి గేమ్స్. మొత్తం 9 పతకాలు గెలిచా. ఇక చాలు. ఈ ఘనత సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. వీటి కోసం చాలా కష్టపడ్డా. నా శ్రమకు తగిన ఫలితాలు వచ్చాయి’ అని మీడియాతో వెల్లడించాడు. రియో ఒలింపిక్స్ చివరిదా? కాదా? అనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ప్రస్తుతానికి వరల్డ్ చాంపియన్‌షిప్‌పై దృష్టిపెట్టానన్నాడు.

 

 రజతం సాధించిన 16 ఏళ్ల మలైకా

 మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత షూటర్, 16 ఏళ్ల మలైకా గోయల్ భారత్‌కు రజతాన్ని అందించింది. 197.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. సీనియర్ స్థాయిలో ఈమెకు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఇదే ఈవెంట్‌లో హీనా సిద్ధు నిరాశపరిచింది.  షున్ జి టియో (సింగపూర్-198.6 పాయింట్లు) స్వర్ణం, డోర్తీ లుడ్‌విగ్ (కెనడా-117.2 పాయింట్లు) కాంస్యం గెలుచుకున్నారు.

 

 నెల రోజుల క్రితమే డోప్ టెస్టులో పాజిటివ్‌గా తేలినా.. పారా పవర్‌లిఫ్టర్ సచిన్ చౌదరి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లడాన్ని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు అతనిపై జీవితకాల నిషేధం విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పీసీఐ కార్యదర్శి జె.చంద్రశేఖర్ వెల్లడించారు.

 

 సంతోషికి కాంస్యం

 కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు తేజం మత్స సంతోషి కాంస్యంతో మెరిసింది. మహిళల 53 కేజీల గ్రూప్-ఎ విభాగంలో ఆమె 188 (స్నాచ్ 83 + క్లీన్ అండ్ జర్క్ 105) కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. క్లీన్ అండ్ జర్క్ మూడో ప్రయత్నంలో 20 ఏళ్ల సంతోషి 109 కేజీల బరువు ఎత్తే ప్రయత్నం చేసి విఫలమైంది.

 

  దీంతో తొలి రెండు స్థానాలకు దూరమైంది. విజయనగరానికి చెందిన సంతోషి గేమ్స్‌కు ముందు సిమ్లాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. మరో భారత లిఫ్టర్ స్వాతి సింగ్ 183 (స్నాచ్ 83 + క్లీన్ అండ్ జర్క్ 100) కేజీలు ఎత్తి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. క్లీన్ అండ్ జర్క్‌లో స్వాతి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. చికా అమల్హా (నైజీరియా-196 కేజీలు) స్వర్ణం, డికా టౌవా (పపువా అండ్ న్యూగినియా-193 కేజీలు) రజత పతకాలను కైవసం చేసుకున్నారు.




 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top