‘చలో చలో’ అంటున్న బ్రేవో!
చెన్నై: అవును...ఇది దేవిశ్రీ ప్రసాదో, అల్లు అర్జునో పాడింది కాదు! అచ్చంగా విండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో అంటున్న మాట. ఆల్‌రౌండర్ ఆటతో పాటు మైదానంలో కొత్త కొత్త డ్యాన్స్‌లతో బ్రేవో చేసే సందడి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అతను పాట కోసం గొంతు విప్పాడు. తనలోని గాయకుడిని పరిచయం చేస్తూ చలో చలో... అనే కొత్త పాటను అతను స్వయంగా పాడి సంగీతాన్ని అందించాడు. ఇంగ్లీష్‌తో పాటు హిందీ పదాలు చేర్చిన ఈ ఆంగ్లో ఇండియన్ ‘సింగిల్’లో నిషా అనే గాయని బ్రేవోతో గొంతు కలిపింది.
దాదాపు నెల రోజుల క్రితమే బ్రేవో దీనిని ట్రినిడాడ్‌లో విడుదల చేశాడు. అయితే ఆదివారం చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ పాట ఆవిష్కరణ జరిగింది. చెన్నై, బెంగళూరు జట్ల ఆటగాళ్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు దీనికి హాజరయ్యారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి గాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని పట్టుదలగా ఉన్న బ్రేవో ఈ పాటతో ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు.