జోరు తగ్గినా...

జోరు తగ్గినా...


భారత్ ఖాతాలో నాలుగు పతకాలు

 శ్రేయాసికి రజతం, అసబ్‌కు కాంస్యం

 ఓంకార్, పూనమ్‌లకూ కాంస్యాలు


 

 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మరో నాలుగు పతకాలతో మెరిసింది. తొలి మూడు రోజులతో పోలిస్తే నాలుగో రోజు జోరు కాస్త తగ్గినా... షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లలో రజత, కాంస్య పతకాలు దక్కడంతో మురిసింది. అయితే ఈ రెండు క్రీడాంశాల్లో స్వర్ణావకాశాలు చేజార్చుకోవడంతోపాటు టేబుల్ టెన్నిస్‌లో కాంస్య పతక పోరులో మహిళల జట్టు విఫలమై కాస్త నిరాశపరిచింది.

 

 గ్లాస్గో: పతకాల వేటలో భారత్ మున్ముందుకు దూసుకెళుతోంది. ఆదివారం భారత క్రీడాకారులు పసిడి వెలుగులు విరజిమ్మకపోయినా.... ఓ రజతం, మూడు కాంస్యాలు తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తం పతకాల సంఖ్యను 20కి పెంచుకున్నారు.

 

 శ్రేయాసి వెండి వెలుగులు... అసబ్ కంచు మోత

 భారత్‌కు పతకాల పంట పండిస్తున్న షూటింగ్... ఆదివారం మరో రెండు పతకాలనందించింది. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో శ్రేయాసి సింగ్ రజతం సాధించగా, పురుషుల డబుల్ ట్రాప్‌లో మహమ్మద్ అసబ్ కాంస్యం నెగ్గాడు. ఈ ఇద్దరికీ ఇవే తొలి కామన్వెల్త్ పతకాలు కావడం విశేషం. మహిళల ఫైనల్స్‌లో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల శ్రేయాసి మొత్తం 92 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం ద్వారా వెండి పతకాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ షూటర్లు కెర్వుడ్ 94 పాయింట్లతో స్వర్ణం, రాచెల్ పారిష్ 91 పాయింట్లతో కాంస్యం దక్కించుకున్నారు.

 

 అయితే మరో భారత మహిళా షూటర్ వర్ష వర్మన్ 81 పాయింట్లు మాత్రమే సాధించి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక పురుషుల డబుల్ ట్రాప్‌లో నాథన్ జురెబ్ (మాల్టా)తో చివరిదాకా ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో ‘మీరట్ వీరుడు’ అసబ్ 26 పాయింట్లు నమోదు చేసి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. జురెబ్ 24 పాయింట్లు మాత్రమే నమోదు చేయగలిగాడు. మరో భారత షూటర్ అంకుర్ మిట్టల్... క్వాలిఫికేషన్స్‌లో రెండో స్థానంతో సత్తా చాటినా తుదిపోరులో ఐదో స్థానానికి పడిపోయి నిరాశ పరిచాడు.

 

 కాంస్యాలు నెగ్గిన ఓంకార్, పూనమ్

 భారత్‌కు పతకాలు సాధించిపెడుతున్న మరో క్రీడాంశం వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో రెండు కాంస్యాలు భారత్ సొంతమయ్యాయి. పురుషుల 69 కేజీల విభాగంలో ఓంకార్ ఒటారి, మహిళల 63 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్‌లు కాంస్య పతకాలు సాధించారు.

 

 భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల 69 కేజీల విభాగంలో ఓంకార్ మొత్తం 296 కేజీలు (స్నాచ్‌లో 136 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 160 కేజీలు) ఎత్తాడు. ఇక ఆదివారం జరిగిన మహిళల 63 కేజీల పోటీల్లో పూనమ్  202 కేజీలు ఎత్తి మూడో స్థానంతో కాంస్యం దక్కించుకుంది. స్నాచ్‌లో 88 కేజీలు ఎత్తిన పూనమ్... క్లీన్ అండ్ జెర్క్‌లో 114 కేజీలు నమోదు చేసింది. అయితే మరో భారత లిఫ్టర్ వందనా గుప్తా 198 కేజీలతో నాలుగో స్థానానికే పరిమితమైంది.  మహిళల టీటీ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో భారత్ 1-3తో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.




 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top