కోల్‌కతా జోరు కొనసాగేనా!

కోల్‌కతా జోరు కొనసాగేనా!


- నేడు లాహోర్ లయన్స్‌తో పోరు

- మరో మ్యాచ్‌లో హోబర్ట్‌తో కోబ్రాస్ ఢీ

- చాంపియన్స్ లీగ్ టి20

సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ చాంపియన్‌గా తమకున్న హోదాను నిలబెట్టుకుంటూ తొలి మ్యాచ్‌ను గెలుచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్...  చాంపియన్స్ లీగ్‌టి20లో మరో విజయంపై దృష్టి పెట్టింది. ఈ లీగ్‌లో హైదరాబాద్‌ను హోమ్‌గ్రౌండ్‌గా మార్చుకున్న నైట్‌రైడర్స్ ఆదివారం జరిగే పోరులో లాహోర్ లయన్స్‌తో తలపడనుంది. క్వాలిఫయింగ్ దశలో రెండు మ్యాచ్‌లు నెగ్గి ప్రధాన పోటీలకు అర్హత సాధించిన లయన్స్‌కు ఇదే తొలి మ్యాచ్. నేడు జరిగే మరో మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ జట్టు కేప్ కోబ్రాస్‌ను ఎదుర్కొంటుంది.

 

గంభీర్ రాణించేనా?

ఐపీఎల్-7ను వరుసగా మూడు డకౌట్లతో ప్రారంభించిన నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ ఈ టోర్నీలోనూ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. టాపార్డర్‌లో అతను కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. మరో ఓపెనర్, వికెట్‌కీపర్‌గా ఈ మ్యాచ్‌లో బిస్లా స్థానంలో ఉతప్ప వచ్చే అవకాశం ఉంది. ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న ఉతప్ప పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇక యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండేలపై ఆ జట్టు బ్యాటింగ్ ఆధారపడుతోంది.



చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన ఆండ్రీ రసెల్, డస్కటేలపై కీలక బాధ్యత ఉంది. స్పిన్నర్‌గా నరైన్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను శాసించగల సమర్థుడు. గత మ్యాచ్‌లో 4 ఓవర్లలో అతను కేవలం 9 పరుగులు ఇచ్చాడు. లాహోర్ ఆటగాళ్లు ఈ స్థాయి స్పిన్‌ను ఏ మాత్రం ఎదుర్కోగలరో చూడాలి. తక్కువ స్కోర్ల మ్యాచే అయినా... ఇద్దరు ప్రధాన పేసర్లు కమిన్స్, ఉమేశ్ గత మ్యాచ్‌లో భారీ పరుగులు ఇచ్చారు. అయితే వెంటనే తుది జట్టులో మార్పు ఉండకపోవచ్చు.

 

లయన్స్ నిలబడగలరా

క్వాలిఫయింగ్ దశలో ఆటతీరు గమనిస్తే లాహోర్ లయన్స్ జట్టు కూడా మెరుగ్గానే కనిపిస్తోంది. ముంబైపై సునాయాస విజయం సాధించిన ఆ జట్టు సదరన్ ఎక్స్‌ప్రెస్‌ను చిత్తు చేసింది. జట్టు విజయంలో కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆల్‌రౌండర్‌గా అతనే జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక ఉమర్ అక్మల్, అహ్మద్ షహజాద్, నాసిర్ జంషెద్‌లతో పాటు వహాబ్ రియాజ్, అజీజ్ చీమావంటి అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. సాద్ నసీమ్ మరో కీలక ఆటగాడు. సీఎల్‌టి20లో విజయం సాధించి తమదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉంది.

 

శుభారంభం ఎవరిదో

ఉప్పల్ స్టేడియంలోనే ఆదివారం జరిగే మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కేప్ కోబ్రాస్, ఆస్ట్రేలియా జట్టు హోబర్ట్ హరికేన్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ తాము ఆడిన తొలి లీగ్ మ్యాచ్‌లలో ఓటమిపాలయ్యాయి. దాంతో మొదటి విజయం కోసం ఇరు జట్లపై ఒత్తిడి నెలకొని ఉంది. బలాబలాలు చూస్తే రెండు టీమ్‌లు సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. హరికేన్స్‌లో బ్లిజార్డ్, డంక్, బొలింజర్‌లతో పాటు పాకిస్థానీ షోయబ్ మాలిక్ గుర్తింపు ఉన్న ఆటగాడు. కోబ్రాస్ టీమ్‌లో దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ హషీం ఆమ్లా, ఫిలాండర్ మినహా చెప్పుకోదగ్గ క్రికెటర్లు ఎవరూ లేరు.

 

లాహోర్ జట్టుకు సానియా ఇంట్లో విందు

చాంపియన్స్ లీగ్‌లో ఆడేందుకు నగరానికి వచ్చిన పాకిస్థాన్ జట్టు లాహోర్ లయన్స్‌కు... శనివారం రాత్రి సానియా ఇంట్లో విందు ఇచ్చారు. ఇదే టోర్నీలో హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడుతున్న షోయబ్ మాలిక్... తన అత్తగారింట్లో ఈ విందును ఏర్పాటు చేశాడు. ‘సానియా   తో పెళ్లయ్యాక నగరంలో తొలి మ్యాచ్ ఆడుతుండటం ఉద్వేగంగా అనిపిస్తోంది. సానియా విజయాల పట్ల నేను గర్వపడుతున్నాను. ఆమె మరిన్ని గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గాలని కోరుకుంటున్నా’ అని షోయబ్ వ్యాఖ్యానించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top