సెక్స్‌ వ్యాఖ్యలు: ఐపీఎల్‌లోనూ గేల్‌కు కష్టాలు!

సెక్స్‌ వ్యాఖ్యలు: ఐపీఎల్‌లోనూ గేల్‌కు కష్టాలు!


గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్ క్రిస్‌ గేల్‌కు బొత్తిగా తెలిసినట్టు లేదు. గతంలో బిగ్‌ బాష్ లీగ్‌ (బీబీఎల్‌) సందర్భంగా టీవీ యాంకర్‌ను డేటింగ్‌కు వస్తావా అని ప్రత్యక్ష ప్రసారంలో అడిగి ఇబ్బందులు కొనితెచ్చుకున్న గేల్‌.. తాజాగా బ్రిటన్‌ మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు.



ఆస్ట్రేలియా యాంకర్‌ మెల్‌ మెక్‌లాలిన్‌ తో అసభ్యంగా ప్రవర్తించినందుకు బీబీఎల్‌ లో మెల్‌బోర్న్‌ జట్టు తరఫున అతని కాంట్రాక్టును పునరుద్ధరించేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. తమ జర్నలిస్టుతో అభ్యంతరకరంగా మాట్లాడినందుకు ఇంగ్లండ్‌ కూడా అతని చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లోనూ క్రిస్‌ గేల్‌కు చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. నిత్యం అసభ్యకర వ్యాఖ్యలతో వివాదాస్పదుడిగా మారిన గేల్‌పై ఐపీఎల్‌లోనూ చర్యలు తీసుకునే అవకాశముందని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్ శుక్లా సంకేతాలు ఇచ్చారు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) బెంగళూరు రాయల్‌  చాలెంజర్స్‌ తరఫున ఆడుతున్న గేల్‌ విషయంలో ఆంక్షలు కొరడా ఝళిపించే అవకాశముందని శుక్లా చెప్పారు.



'ఆటగాళ్లు సభ్యతతో ప్రవర్తించాల్సిన అవసరముంది. టోర్నమెంటు జరుగుతున్నప్పుడు ఆటగాళ్లు ప్రవర్తనా నియామళికి లోబడి సభ్యంగా నడుచుకుంటారని మేం భావిస్తాం. లీగ్‌ ప్రతిష్టను ఆటగాళ్లు కాపాడాల్సిన అవసరముంది. బహిరంగంగా అతను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తి అవాంఛనీయం. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళుతాం' అని శుక్లా ఓ ఆంగ్ల దినపత్రికకు తెలిపారు. మరోవైపు ఇది ఇద్దరు విదేశీయుల మధ్య జరిగిన అంశమే అయినా.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి అజయ్‌ షిర్కే స్పష్టం చేశారు.



 గేల్‌ ఇటీవల బ్రిటిష్ మహిళా జర్నలిస్టు చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్‌, మహిళలు, సమానత్వం గురించి వికృత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యల వివాదాన్ని గేల్‌ తోసిపుచ్చాడు. ఇవి సరదాగా చేసిన వ్యాఖ్యలు మాత్రమేనని, ఇందులో ఎలాంటి దురభిప్రాయాలకు తావు లేదని చెప్పుకొచ్చాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top