చెన్నైపై ‘మ్యాక్స్’ దాడి

చెన్నైపై ‘మ్యాక్స్’ దాడి


మ్యాక్స్‌వెల్ సంచలన ఇన్నింగ్స్

సూపర్ కింగ్స్‌పై పంజాబ్ విజయం

 రాణించిన మిల్లర్

 స్మిత్, మెకల్లమ్ శ్రమ వృథా

 

 అబుదాబి: టి20ల్లో ఏ బంతికి ఎలాంటి షాట్ ఆడాలో మ్యాక్స్‌వెల్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చేమో. ఎందుకంటే చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఆడని షాట్ లేదంటే అతిశయోక్తి కాదు.

 

 సంప్రదాయ ఆటతీరుతో పాటు స్వీప్, రివర్స్ స్వీప్, స్విచ్ హిట్, స్కూప్... ఇలా భిన్నమైన షాట్లతో పరుగుల వరద పారించాడు. ఫలితంగా పొట్టి ఫార్మాట్‌లో 200ల పైచిలుకు స్కోరును నీళ్లు తాగినంత సులువుగా ఛేదించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు అద్వితీయ విజయాన్ని అందించాడు. షేక్ జాయెద్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఐపీఎల్-7 లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో చెన్నైకి షాకిచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసింది.

 

 

 బ్రెండన్ మెకల్లమ్ (45 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), స్మిత్ (43 బంతుల్లో 66; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడారు. చివర్లో రైనా (19 బంతుల్లో 24; 2 ఫోర్లు), ధోని (11 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్సర్) విజృంభించారు. బాలాజీ 2, అక్షర్ పటేల్, అవానా చెరో వికెట్ తీశారు.

 

  తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (43 బంతుల్లో 95; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా... మిల్లర్ (37 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. సెహ్వాగ్ (10 బంతుల్లో 19; 4 ఫోర్లు) విఫలమయ్యాడు. అశ్విన్ 2, నెహ్రా, స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.  

 

 మెకల్లమ్ మెరుపులు

 పంజాబ్ పేసర్లు ప్రభావం చూపకపోవడంతో ఓపెనర్లు స్మిత్, మెకల్లమ్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించారు. 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెయిలీ క్యాచ్ జారవిడచడంతో ఊపిరి పీల్చుకున్న మెకల్లమ్ సిక్సర్ల వర్షం కురిపించాడు.  పవర్ ప్లేలో ఈ జోడి 7 బౌండరీలు, 3 సిక్సర్లు బాదడంతో చెన్నై ఖాతాలో 70 పరుగులు సమకూరాయి.

 

 ధావన్ బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్‌తో మెకల్లమ్ 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాత స్ట్రయిక్ రొటేట్ చేయడంతో చెన్నై 10 ఓవర్లలో 102 పరుగులు చేసింది. పటేల్ బౌలింగ్‌లో మెకల్లమ్ షాట్‌కు ప్రయత్నించి మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

 

 ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ కొట్టిన రైనా అదే స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రెండో ఎండ్‌లో దూకుడు తగ్గించని స్మిత్... మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్సర్ కొట్టి 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బాలాజీకి వికెట్ సమర్పించుకున్నాడు.

 

 ధోని వచ్చి రావడంతోనే రెండు ఫోర్లు కొట్టాడు. రైనా భారీ షాట్లకు ప్రయత్నించకపోవడంతో కీలకమైన 18వ ఓవర్‌లో జాన్సన్ 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాతి ఓవర్‌లో రైనా స్కూప్ చేయబోయి ఫైన్‌లెగ్‌లో సెహ్వాగ్ చేతికి చిక్కాడు. చివరి ఓవర్‌లో ధోని, బ్రేవో రెండు సిక్సర్లు కొట్టడంతో చెన్నై 200 పరుగుల మైలురాయిని దాటింది. కెప్టెన్ ఆఖరి బంతికి అవుటయ్యాడు.

 

 మ్యాక్స్‌వెల్ సెంచరీ మిస్

 పుజారాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సెహ్వాగ్ చకచకా 4 బౌండరీలు కొట్టి టచ్‌లో కనిపించాడు. కానీ 9 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ నుంచి బయటపడ్డా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. పుజారా, వీరూ వరుస ఓవర్లలో అవుట్‌కాగా కొద్దిసేపటికే అక్షర్ కూడా వెనుదిరిగాడు. మ్యాక్స్‌వెల్ వేగంగా ఆడటంతో తొలి ఆరు ఓవర్లలో పంజాబ్ 3 వికెట్లకు 64 పరుగులు చేసింది.



37 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ మ్యాక్స్‌వెల్ ఆ తర్వాత మిల్లర్‌తో కలిసి వీరవిహారం చేశాడు. బౌలర్ ఎవరైనా లెక్క చేయకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు.  

 

14వ ఓవర్‌లో బద్రీ క్యాచ్ డ్రాప్ చేయడంతో బ్రతికి బయటపడ్డ మ్యాక్స్‌వెల్ (77) మిల్లర్‌ను ఓ ఎండ్‌లో నిలబెట్టి ఓవర్‌కు ఒకటి, రెండు ఫోర్లు కొట్టాడు. చివరకు స్మిత్ బౌలింగ్‌లో వరుసగా సిక్సర్, ఫోర్ కొట్టి తర్వాతి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 63 బంతుల్లో 115 పరుగులు జోడించింది.

 

 32 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన మిల్లర్... జడేజా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టాడు. చివరకు 12 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో బెయిలీ రెండు ఫోర్లతో 7 బంతులు మిగిలి ఉండగానే లాంఛనం పూర్తి చేశాడు.

 

 స్కోరు వివరాలు

 చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) బెయిలీ (బి) బాలాజీ 66; బి. మెకల్లమ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ పటేల్ 67; రైనా (సి) సెహ్వాగ్ (బి) అవానా 24; ధోని (సి) రిషీ ధావన్ (బి) బాలాజీ 26; డ్వేన్ బ్రేవో నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 205.

 

వికెట్ల పతనం: 1-123; 2-161; 3-185; 4-205

బౌలింగ్: అక్షర్ పటేల్ 4-0-34-1; అవానా 3-0-35-1; జాన్సన్ 4-0-47-0; బాలాజీ 4-0-43-2; రిషీ ధావన్ 3-0-21-0; మ్యాక్స్‌వెల్ 2-0-23-0

 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: పుజారా ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 13; సెహ్వాగ్ (బి) నెహ్రా 19; మ్యాక్స్‌వెల్ (బి) స్మిత్ 95; అక్షర్ పటేల్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 2; మిల్లర్ నాటౌట్ 54; బెయిలీ నాటౌట్ 17; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 206.

 

 వికెట్ల పతనం: 1-31; 2-38; 3-52; 4-167

 బౌలింగ్: నెహ్రా 3-0-24-1; మోహిత్ శర్మ 2.5-0-35-0; అశ్విన్ 4-0-41-2; నేగి 3-0-37-0; జడేజా 4-0-43-0; స్మిత్ 2-0-25-1.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top