చెన్నైని సెమీస్‌కు చేర్చిన పెర్త్

చెన్నైని సెమీస్‌కు చేర్చిన పెర్త్


కీలక మ్యాచ్‌లో ఓడిన లాహోర్

 బెంగళూరు: చాంపియన్స్ లీగ్‌లో పెర్త్, లాహోర్‌ల మధ్య గ్రూప్ ‘ఎ’ ఆఖరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో లాహోర్ కనీసం 46 పరుగుల తేడాతో పెర్త్‌ను ఓడిస్తే సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ పెర్త్ గెలిచినా లేక లాహోర్ 46 కంటే తక్కువ పరుగుల తేడాతో  నెగ్గినా... చెన్నై సెమీస్‌కు వెళుతుంది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం నాటకీయంగా మ్యాచ్ సాగింది. తొలుత లాహోర్ కేవలం 124 పరుగులే చేసింది. లక్ష్య ఛేదనలో పెర్త్ తడబడి 40 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 78 పరుగులకు పెర్త్‌ను నియంత్రిస్తే లాహోర్ సెమీస్‌కు చేరుతుంది.



ఈ స్థితిలో పెర్త్ కెప్టెన్ మిషెల్ మార్ష్ (38 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో పెర్త్‌ను మూడు వికెట్ల తేడాతో గెలిపించాడు. ఫలితంగా చెన్నై ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా సెమీస్‌కు చేరింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో పెర్త్ ఫీల్డింగ్ ఎంచుకోగా... లాహోర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. సాద్ నసీమ్ (55 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లాహోర్‌ను నసీమ్, ఉమర్ అక్మల్ (19 బంతుల్లో 26; 4 ఫోర్లు) కలిసి ఆదుకున్నారు. పెర్త్ బౌలర్లలో పారిస్ 3, మిషెల్ మార్ష్ 2 వికెట్లు తీసుకున్నారు. పెర్త్ జట్టు 19 ఓవర్లలో ఏడు వికెట్లకు 130 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మార్ష్‌తో పాటు బ్రాడ్ హాగ్ (19 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు. హఫీజ్, ఇక్బాల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంతో చెన్నై సెమీస్‌కు చేరింది.







 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top