బాబోయ్..ఇదేం బాదుడు!

బాబోయ్..ఇదేం బాదుడు!


184 పరుగుల లక్ష్యాన్ని 20 బంతులు మిగిలుండగానే ఛేదించిన చెన్నై

  చెలరేగిన స్మిత్, మెకల్లమ్

  ముంబైకి వరుసగా నాలుగో ఓటమి

  పొలార్డ్, రోహిత్‌ల శ్రమ వృథా


 

 టి20లో 183 పరుగులు చేసిన జట్టు గెలుస్తామనే ధీమాతో ఉంటుంది. కానీ ప్రత్యర్థి చెన్నై జట్టు అయితే మాత్రం ఆ ధీమా పనికిరాదు. ఒక్కడు బాదితేనే పరుగుల వరద పారే టి20లో... ఇద్దరు క్రికెటర్లు నువ్వానేనా అన్నట్లు పోటాపోటీగా బాదితే... లక్ష్యం ఎంత పెద్దదైనా చిన్నబోవాల్సిందే. చెన్నై ఓపెన ర్లు స్మిత్, మెకల్లమ్ కూడా అదే చేశారు. బంతికే భయంపుట్టేలా బాదారు. కేవలం 44 బంతుల్లో 109 పరుగులు జోడించి చెన్నై ఖాతాలో హ్యాట్రిక్ విజయాన్ని చేర్చారు.

 

 ముంబై: ఐపీఎల్‌లో అత్యంత ఆసక్తికరంగా సాగే పోరాటాల్లో ముంబై, చెన్నై మ్యాచ్ ఒకటి. అందుకే ప్రతి ఏడాదీ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌కు గిరాకీ ఎక్కువ. అంచనాలకు తగ్గట్లే ప్రతిసారీ హోరాహోరీ పోరాటాలు జరుగుతాయి. ఈసారి కూడా ముంబై చెలరేగి ఆడినా... చెన్నై ముందు తేలిపోయింది.

 

 

  డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 62; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), మెకల్లమ్ (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో 184 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో 20 బంతులు మిగిలుండగానే ఛేదించి ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది.

 

 పొలార్డ్ (30 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ (31 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. రాయుడు (16 బంతుల్లో 29; 1 ఫోర్, 3 సిక్సర్లు), హర్భజన్ (21 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. తర్వాత చెన్నై కేవలం 16.4 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసి నెగ్గింది. రైనా (29 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రేవో (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. మూడు వికెట్లు తీసిన చెన్నై బౌలర్ నెహ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

 

 పొలార్డ్ మెరుపులు: ఆరంభంలో నెహ్రా, ఈశ్వర్ నిప్పులు చెరగడంతో ఓపెనర్లు పార్థీవ్ (0), సిమ్మన్స్ (5)తో పాటు అండర్సన్ (4) కూడా స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబైని రోహిత్, హర్భజన్ నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించి ఆదుకోవడంతో జట్టు స్కోరు 10 ఓవర్లలో 62 పరుగులకు చేరుకుంది. తర్వాత వచ్చిన పొలార్డ్.... వరుసపెట్టి బౌండరీలు సిక్సర్లతో రెచ్చిపోయాడు. 30 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన రోహిత్ 15వ ఓవర్‌లో అవుటయ్యాడు.

 

 తర్వాత కూడా  జోరు తగ్గకుండా ఆడిన పొలార్డ్ 21 బంతుల్లో అర్ధసెంచరీ చేయగా, రాయుడు మూడు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.  చివరి 10 ఓవర్లలో 122 పరుగులు రావడంతో ముంబై భారీ స్కోరు చేసింది. ఓపెనర్ల విధ్వంసం: భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఓపెనర్లు స్మిత్, మెకల్లమ్ పరుగుల కల్లోలం సృష్టించారు. రెండో ఓవర్ నుంచే సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించడంతో రన్‌రేట్ వాయువేగంతో దూసుకుపోయింది.

 

 బౌలర్ బంతి వేసేదే ఆలస్యం స్టాండ్స్‌లోకి పంపేశారు. ఓవరాల్‌గా పవర్‌ప్లేలో 13 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి 90 పరుగులు చేశారు. ఈ క్రమంలో స్మిత్ 22 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో హర్బజన్ నా లుగు బంతుల తేడాతో ఈ ఇద్దర్ని అవుట్ చేయడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 7.2 ఓవర్లలో 109 పరుగులు జోడించారు. తర్వాత రైనా నిలకడగా ఆడుతూ మూడు భాగస్వామ్యాలు నెల కొల్పాడు. డుప్లెసిస్ (11)తో మూడో వికెట్‌కు 29; ధోని (3) తో నాలుగో వికెట్‌కు 22; బ్రేవోతో ఐదో వికెట్‌కు అజేయంగా 23 పరుగులు జోడించి విజయాన్ని అందించాడు.

 

 స్కోరు వివరాలు

 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) డుప్లెసిస్ (బి) పాండే 5; పార్థీవ్ ఎల్బీడబ్ల్యు (బి) నెహ్రా 0; అండర్సన్ (సి) డుప్లెసిస్ (బి) నెహ్రా 4; రోహిత్ (సి) బ్రేవో (బి) నెహ్రా 50; హర్భజన్ (సి) జడేజా (బి) మోహిత్ 24; పొలార్డ్ (సి) స్మిత్ (బి) బ్రేవో 64; రాయుడు (సి) జడేజా (బి) బ్రేవో 29; సుచిత్ నాటౌట్ 0; వినయ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 183.

 

 వికెట్ల పతనం: 1-1; 2-6; 3-12; 4-57; 5-132; 6-181; 7-181.

 బౌలింగ్: నెహ్రా 4-0-23-3; ఈశ్వర్ పాండే 3-1-22-1; మోహిత్ శర్మ 4-0-43-1; జడేజా 4-0-49-0; అశ్విన్ 1-0-13-0; బ్రేవో 4-0-30-2. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) రోహిత్ (బి) హర్భజన్ 62; మెకల్లమ్ (సి) వినయ్ (బి) హర్భజన్ 46; రైనా నాటౌట్ 43; డుప్లెసిస్ (బి) మలింగ 11; ధోని (సి అండ్ బి) పొలార్డ్ 3; బ్రేవో నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (16.4 ఓవర్లలో 4 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1-109; 2-115; 3-144; 4-166. బౌలింగ్: సుయల్ 3-0-28-0; మలింగ 4-0-40-1; సుచిత్ 2-0-33-0; హర్భజన్ 4-0-44-2; వినయ్ 2-0-18-0; పొలార్డ్ 1.4-0-26-1.

 

 ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లు

 సన్‌రైజర్స్ హైదరాబాద్

          x

 ఢిల్లీ డేర్‌డెవిల్స్

 వేదిక: విశాఖపట్నం;సా. గం. 4.00 నుంచి

 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

 


 

 పంజాబ్ కింగ్స్ ఎలెవన్

             x

 కోల్‌కతా నైట్‌రైడర్స్

 వేదిక: పుణే; రాత్రి గం. 8.00 నుంచి

 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top