బ్లాటర్‌కు చెక్

బ్లాటర్‌కు చెక్ - Sakshi


రాజీనామాకు అన్నివైపుల నుంచి డిమాండ్

నేడు ఫిఫా అధ్యక్ష పదవికి ఎన్నికలు


 

 17 సంవత్సరాలుగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను కనుసైగలతో శాసిస్తున్న ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ కష్టాల్లో పడ్డారు. మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో... తన సహచరుల అరెస్టులతో ఆయన కంగుతిన్నారు. బ్లాటర్ ఇకపై ఆటతో కొనసాగడానికి వీల్లేదని, తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్ పెరిగింది.

 

 జురిచ్ : ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను విశేషంగా ఆకర్షించే క్రీడ ఫుట్‌బాల్. ఇంతటి శక్తివంతమైన క్రీడను పర్యవేక్షించే ఫిఫాలో అవినీతి ఉదంతం ఇప్పుడు తీవ్ర దుమారాన్నే రేపుతోంది. 2018 (రష్యా), 2022 (ఖతార్) ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు ఆయా దేశాలకు దక్కేందుకు లంచాలు తీసుకున్నారనే కారణంతో ఫిఫా ఉపాధ్యక్షుడితో పాటు మరో ఆరుగురిని స్విట్జర్లాండ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిఫాను 17 ఏళ్లుగా అంతా తానై నడిపిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు సెప్ బ్లాటర్‌ను ఈ పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫిఫాలో ఇంత దారుణ పరిస్థితులు నెలకొంటున్నా ఇంకా పదవిని పట్టుకుని వేళ్లాడటమేమిటని అన్ని వైపుల నుంచి నిలదీస్తున్నారు.



 నేడు (శుక్రవారం) జరిగే అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఐదో పర్యాయం ఎన్నికయ్యేందుకు 79 ఏళ్ల బ్లాటర్ సిద్ధమవుతున్నారు. కానీ ఎన్నికలకు రెండు రోజుల ముందే ఈ వ్యవహారం బయటపడడం ఆయన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. బ్లాటర్‌కు పోటీగా జోర్డాన్ ప్రిన్స్ అలీ బిన్ అల్ హుస్సేన్ పోటీ పడుతున్నారు. ఈనేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు తక్షణం వాయిదా వేయాలని యూరోపియన్ సమాఖ్య (యూఈఎఫ్‌ఏ) డిమాండ్ చేస్తోంది. ‘అవినీతి ఉదంతం ఫిఫాను అధోగతి పాలు చేసింది.



ఫుట్‌బాల్ క్రేజ్‌ని కూడా ఇది దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేసి ఆరునెలల్లోగా జరపాలి’ అని యూఈఎఫ్‌ఏ ప్రధాన కార్యదర్శి గియాని ఇన్‌ఫాంటినో అన్నా రు. మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్ కూడా బ్లాటర్‌పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ‘బ్లాటర్ గెటవుట్’ అంటూ ప్రపంచ మీడియా తమ తొలి పేజీలో కథనాలను గుప్పించింది. ఇదిలావుండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం బ్లాటర్‌కు మద్దతుగా నిలిచారు. ఫిఫాలో అవినీతి విచారణపై ఎఫ్‌బీఐ లోపభూయిష్టంగా పనిచేసిందని విమర్శించారు.



 స్పాన్సర్ల గుస్సా..

 ఫుట్‌బాల్‌లో మిలియన్ల కొద్ది డబ్బులను గుమ్మరిస్తున్న ప్రధాన స్పాన్సర్లు కూడా తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. కోకా కోలా, వీసా, అడిడాస్, మెక్‌డొనాల్డ్స్ ఇందులో ఉన్నాయి. ఫిఫాలో పరిస్థితులు మారకపోతే తమ ఒప్పందాలను రద్దు చేసుకుంటామంటూ కటువుగా వ్యాఖ్యానించాయి.



 ఫిఫా సమాఖ్యలతో బ్లాటర్ భేటి

 జరుగుతున్న పరిమాణాలపై ఫిఫాకు చెందిన ఆరు సమాఖ్యల అధ్యక్షులతో బ్లాటర్ గురువారం సమావేశమయ్యారు. అయితే చర్చల వివరాలు బయటికి రాలేదు కానీ కొందరు ఆయన్ని పదవి నుంచి దిగిపోవాలని అడిగినట్టు సమాచారం. అయితే ఎన్నికల్లో ఇప్పటికీ ఆయనే ఫెవరెట్‌గా కనిపిస్తున్నారు.

 

 అసలేం జరిగిందంటే...

 2010లో ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీలో 2018, 2022 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహణ హక్కుల కోసం బిడ్డింగ్ జరిగింది. ఓటింగ్‌లో 2018 టోర్నీ కోసం రష్యా.. 2022 టోర్నీ కోసం ఖతార్ నిర్వహణ హక్కులు గెలుచుకున్నాయి. అయితే ఈ వ్యవహారం వెనుక చాలా పెద్ద స్థాయిలోనే డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వినిపించాయి. సభ్య దేశాలకు చెందిన అధికారులు ఈ రెండు దేశాలకు అనుకూలంగా ఓటేయడానికి మిలియన్ల డాలర్లను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం స్విస్ పోలీస్ అధికారులు ఈ బిడ్డింగ్‌లో పాల్గొన్న 10 మంది ఫిఫా ఎగ్జిక్యూటివ్ అధికారులను విచారిస్తున్నారు. కొన్ని బ్యాంకు రికార్డులను, ఇతర ఫైళ్లను కూడా సీజ్ చేశారు. అలాగే 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీ కోసం కూడా 10 మిలియన్ డాలర్లను లంచాల రూపంలో తీసుకున్నట్టు యూఎస్ పరిశోధక సంస్థ తెలిపింది.  



 ప్రసార హక్కుల కోసం కూడా...

 ఇక ఫుట్‌బాల్ ప్రసార హక్కులను దక్కించుకునేందుకు స్పోర్ట్ బ్రాడ్‌కాస్ట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ 150 మిలియన్ డాలర్ల (రూ.958 కోట్లు)కు పైగానే ఫిఫా, కాంకాకాఫ్ (మధ్య, ఉత్తర అమెరికా) అధికారులకు లంచాల రూపంలో చెల్లించినట్టు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపించింది. 1991 నుంచే ఈ భాగోతం సాగుతున్నట్టు వారి విచారణలో తేలింది. నిందితులు దోషులుగా నిర్ధారణ అయితే 20 ఏళ్ల జైలు శిక్ష పడొచ్చు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top