అవకాశాలు ఇవ్వలేదు!

అవకాశాలు ఇవ్వలేదు!


టెస్టుల్లో స్థానంపై సురేశ్ రైనా   

 మళ్లీ వస్తానన్న యూపీ బ్యాట్స్‌మన్


 

 వన్డేలు, టి20ల్లో భారత స్టార్ ఆటగాడిగా గుర్తింపు ఉన్నా...సురేశ్ రైనా టెస్టుల్లో మాత్రం రెగ్యులర్ సభ్యుడు కాలేకపోయాడు. టెస్టుల్లో స్థానం లభించిన తర్వాత గత ఐదేళ్లలో అడపాదడపా వస్తూ పోతూ అతను 18 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. తనకు తగినన్ని అవకాశాలు దక్కకపోవడమే అందుకు కారణమంటూ అతను చెబుతున్నాడు. గురువారంతో అంతర్జాతీయ కెరీర్‌లో పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ ఉత్తరప్రదేశ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ తన టెస్టు పునరాగమనంపై ఆశాభావంతో ఉన్నాడు.

 

 న్యూఢిల్లీ:
వన్డేలు, టి20 సిరీస్‌లలో అవిశ్రాంతంగా ఆడిన తర్వాత ఒక టెస్టులో విఫలం కాగానే తనను పక్కన పెట్టేశారని భారత క్రికెటర్ సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు. తనలో సత్తా ఉన్నా కావాల్సినన్ని అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే టెస్టుల్లో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయానని అతను వాపోయాడు. ‘2012లో, ఆ తర్వాత మూడేళ్లకు నేను కొన్ని ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాననేది వాస్తవం. అయితే దానర్థం నాకు జట్టులో చోటుకు అర్హత లేదని కాదు. నిజానికి టెస్టు ఆటగాడిగా నన్ను నిరూపించుకునే అవకాశాలే ఇవ్వలేదు. ఒక మ్యాచ్‌తోనే మీరు ఆటగాడిపై అంచనాకు రావద్దు. నేనేమీ ఐదు టెస్టులు అడగడం లేదు. కనీసం 2-3 టెస్టులు ఇవ్వండి. బాగా ఆడకపోతే ఎప్పటికీ తీసేయండి’ అని ఆవేదనగా చెప్పాడు.

 

 గత ఐదేళ్లలో నాలుగు సార్లు అతను టీమ్‌లోకి వచ్చి మళ్లీ స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం ఆసీస్ ‘ఎ’తో తలపడుతున్న భారత ‘ఎ’ జట్టులోనూ సెలక్టర్లు అతడిని ఎంపిక చేయేలుద. అయితే టి20 ప్రపంచకప్‌లోగా టెస్టు జట్టులో తిరిగి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తానని రైనా చెప్పాడు. ‘టెస్టుల్లోనూ బాగా ఆడగలనననే నమ్మకం నాకుంది. ఆ ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో యూపీ తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడతాను. దేశవాళీ మ్యాచ్‌లు నాకు మంచి వేదిక. ఇక్కడ మంచి ప్రదర్శన చేసి టెస్టు ఆటగాడిగా పునరాగమనం చేస్తా’ అని రైనా ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.

 

 నెదర్లాండ్స్‌కు పయనం...

 భార్య ప్రియాంక చౌదరితో కలిసి రైనా రెండు వారాల పాటు నెదర్లాండ్స్‌కు వెళుతున్నాడు. అక్కడ బ్యాంకర్‌గా పని చేస్తున్న ప్రియాంక, పరీక్షలకు కూడా హాజరు కానుంది. ఈ సమయంలో అక్కడే తన ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించాడు. ‘ఇండోర్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాను. నిజానికి ఇంగ్లండ్ కౌంటీల్లో కొన్ని మ్యాచ్‌లైనా ఆడాలని ప్రయత్నించాను గానీ వారు అప్పటికే ఇతర ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే నా మిత్రులు ప్రత్యేకంగా బౌలింగ్ మెషీన్‌తో ప్రాక్టీస్ ఏర్పాట్లు చేశారు’ అని రైనా చెప్పాడు.

 

 రైనా మారిపోయాడా..?

 ఈతరం భారత క్రికెట్‌లో ధోని, రైనాలది రామలక్ష్మణుల అనుబంధం! క్రికెట్ వర్గాల్లో అందరూ చెప్పే మాట ఇది. కొన్ని మ్యాచ్‌లు మినహా  భారత జట్టయినా, చెన్నై సూపర్ కింగ్స్ అయినా రైనా కెరీర్ అంతా ధోని నాయకత్వంలోనే సాగింది. మైదానంలో అయినా, మైదానం బయట అయినా వీరిద్దరూ బాగా సన్నిహితులు. ధోనిపై ఏ విమర్శలు వచ్చినా మద్దతు పలకడానికి రైనా సదా సిద్ధంగా ఉండేవాడు.

 

  అతని కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ధోని మార్గదర్శనమే కాదు అతని కంపెనీ రితి స్పోర్ట్స్‌ది కూడా కీలక పాత్ర. అలాంటిది ఇప్పుడు రైనా అనూహ్యంగా రితికి గుడ్‌బై చెప్పాడు. ఆటగాళ్లు కొత్త ఒప్పందాలు చేసుకోవడం కొత్త కాదు గానీ రైనా మారిన సందర్భం, ఈ సందర్భంగా అతను చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం. ‘కొత్త కంపెనీలో అయితే నేను నంబర్ 2గా ఉండను’ అని అతను అన్నాడు. పైగా బీసీసీఐనుంచి ఆటగాళ్లకు ఇంకా కచ్చితమైన ఆదేశాలు రాకుండానే ‘ఇకపై పరస్పర ప్రయోజనాల సంఘర్షణ అంటూ నన్నెవరూ వేలెత్తి చూపలేరు. మనం జీవితంలో ఏ పని చేసినా చివరకు కాస్త గౌరవం, ప్రశాంతత కోరుకుంటాం కదా’ అంటూ వివరణ ఇచ్చుకున్నాడు.

 

 ధోని, రైనా మధ్య స్నేహం చెడిపోవడం, విభేదాలు రావడంతోనే అతను కంపెనీ మారాడని గట్టిగా చెప్పలేం కానీ అతను రితి స్పోర్ట్స్‌లో సౌకర్యంగా లేడని మాత్రం అర్థమవుతుంది. నంబర్2 కాబోను అంటే ఇన్నాళ్లూ తాను ధోని నీడలోనే ఉన్నానని అర్థమేమో. మరి దానినుంచి కూడా బయటికొచ్చి సొంత ముద్ర కోసం ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి రైనా ఈ సమయంలో తెలివిగా వ్యవహరించినట్లు అర్థమవుతుంది. బీసీసీఐకి శ్రీనివాసన్ దూరం కావడంతోనే ధోని హవా తగ్గుతూ వస్తోంది. పైగా అతను టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. వన్డేల్లోనూ ఎప్పటి వరకు కొనసాగుతాడో తెలీదు. ఇప్పుడంతా కోహ్లిమయంగా మారింది. కోహ్లి కూడా సహజంగానే తన టీమ్‌ను తయారు చేసుకునే పనిలో ఉంటాడు.


ఇటీవల చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. ధోని లేకపోతే పరిస్థితి ఏమిటనేది ఇప్పటికే జడేజాను చూస్తే అర్థమవుతుంది. మరో వైపు ఐపీఎల్‌నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కెప్టెన్ హోదాలో ధోని... రైనాకు ‘సహకరించే’, అండగా నిలిచే అవకాశాలు అంతంత మాత్రమే! ఈ దశలో సెంటిమెంట్‌కు పోయి రాముడిని అంటి పెట్టుకోకుండా లక్ష్మణుడు ముందుచూపుతో వ్యవహరించాడా అనిపిస్తుంది.   వచ్చే మూడేళ్ల పాటు తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేందుకు 29 ఏళ్ల రైనా, రితీనుంచి బయటికి వచ్చాడు. మరి తాను ఆశించిన ఫలితం రైనా పొందగలడా చూడాలి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top