కుర్రాళ్లకు అవకాశం

కుర్రాళ్లకు అవకాశం


ముంబై: దాదాపు రెండు వారాల క్రితం భారత గడ్డపై సాగిన వెస్టిండీస్ డ్రామా అనంతరం ఇప్పుడు మరో సారి అందరూ క్రికెట్‌పై దృష్టి పెట్టే సమయం వచ్చింది. బీసీసీఐతో ‘స్నేహ పూర్వక’ సంబంధాల కారణంగా అడగ్గానే ఆటకు శ్రీలంక సిద్ధమైపోవడంతో అభిమానులకు మళ్లీ భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్‌లు చూసే అవకాశం లభించింది. ఈ ఐదు వన్డేల సిరీస్‌కు ముందు శ్రీలంక, భారత్ ‘ఎ’తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. గురువారం బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్... ఇరు జట్లలోని యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు మంచి అవకాశం కల్పిస్తోంది.



 ఆకట్టుకుంటారా?

 మనోజ్ తివారి నాయకత్వంలో భారత ‘ఎ’ తరఫున బరిలోకి దిగుతున్న ఆటగాళ్లలో ఇప్పుడు అందరి దృష్టి సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మపైనే ఉంది. భుజం, చేతి వేలికి గాయంతో విండీస్‌తో వన్డేలు ఆడలేకపోయిన రోహిత్ ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు సెలక్టర్లు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చారు. అతను ఫిట్‌గా ఉంటే లంకతో సిరీస్‌లో చివరి రెండు వన్డేలకు ఎంపిక చేయవచ్చు. అప్పుడే ప్రపంచకప్, అంతకు ముందు ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్ కోసం ఓపెనర్‌గా రోహిత్ స్థానానికి మార్గం సుగమం అవుతుంది.  



సీనియర్ జట్టులో చాలా వరకు స్థానాలు భర్తీ అయిపోయినా...ఒకటి, రెండు స్థానాల కోసం గట్టి పోటీ ఉంది. కాబట్టి యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకోవాలని పట్టుదలగా ఉన్నారు. కేదార్ జాదవ్, ఉన్ముక్త్ చంద్, స్టువర్ట్ బిన్నీ, పర్వేజ్ రసూల్, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్, ధావల్ కులకర్ణి, కరణ్ శర్మలతో ఈ జాబితా పెద్దదిగానే కనిపిస్తోంది. గాయం కారణంగా పేసర్  బుమ్రా  మ్యాచ్‌కు దూరం కానున్నాడు.



 అక్కడా కుర్రాళ్లే...

 మరో వైపు అనాసక్తిగా భారత్‌లో అడుగు పెట్టి, తమ అసంతృప్తిని బహిరంగంగా ప్రకటించిన శ్రీలంక జట్టు వార్మప్ మ్యాచ్‌కు ముందు అంతా ఓకే అనే సందేశాన్నిచ్చింది. ఈ మ్యాచ్‌లో సీనియర్ ఆటగాళ్లు జయవర్ధనే, సంగక్కరలకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. కాబట్టి లంక టీమ్‌లోని కుర్రాళ్లు కూడా అవకాశాన్ని వినియోగించుకుని సెలక్టర్ల దృష్టిలో పడాలనే తపనతో ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top