ఆనాటి చరిత్రను పునరావృతం చేస్తారా?

ఆనాటి చరిత్రను పునరావృతం చేస్తారా?


బెంగళూరు:నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న భారత జట్టు.. ఇక రెండో టెస్టు విజయంపై దృష్టి పెట్టింది. శనివారం నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలని భారత్ జట్టు భావిస్తోంది. ఆ టెస్టులో గెలిస్తేనే సిరీస్ పై భారత్ ఆశలు పెట్టుకోవచ్చు.దాంతో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత్ జట్టు తన ప్రణాళికల్ని సిద్ధం చేసుకునే పనిలో పడింది. ఎలాగైనా తొలి టెస్టులో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది. తదుపరి టెస్టులో భారత్ జట్టు విజయం సాధిస్తే గనుక దశాబ్దానికి పైగా ఉన్న చరిత్ర పునరావృతం అవుతుంది.



2001లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబైలో్ని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్ లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత్ ను ఘోరంగా ఓడించిన ఆసీస్ సిరీస్ లో ఆధిక్యం సాధించింది. ఆ తరువాత కోల్ కతాలో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ ను భారత్ 171 పరుగుల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్ లో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయగా, భారత్ ను 171 పరుగులకు ఆలౌట్ చేసింది. దాంతో భారత్ జట్టు ఫాలో ఆన్ ఆడింది. అయితే ఇక్కడ ఇన్నింగ్స్ తేడాతో గెలుద్దామని భావించిన ఆసీస్ కు ద్రవిడ్-లక్ష్మణ్లు చుక్కలు చూపెట్టారు.



భారత జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో రాహుల్ ద్రవిడ్-వీవీఎస్ లక్ష్మణ్ల జోడి 376 భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఆ క్రమంలోనే లక్ష్మణ్ తన కెరీర్ బెస్ట్ 281 పరుగులు చేయగా, ద్రవిడ్ 180 పరుగులతో మెరిశాడు.  దాంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 657 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దాంతో ఆసీస్ కు 384 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించకల్గింది.  ఇక తన గెలుపు సంగతిని పక్కను పెట్టి ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలా అనే పనిలో పడింది ఆనాటి ఆసీస్ . భారత స్పిన్ దెబ్బకు 212 పరుగులకే చాపచుట్టేసిన ఆసీస్ ఓటమి పాలైంది. ఆ తరువాత మూడో టెస్టును సైతం భారత్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది.





దాదాపు 16 ఏళ్ల తరువాత అదే సీన్ ను ఆసీస్ రిపీట్ చేయడంతో రెండో టెస్టుపైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు.. భారత్ జట్టును 333 పరుగులతో ఓడించి సిరీస్ లో పైచేయి సాధించింది. మరి ఆనాటి చరిత్రను భారత్ పునరావృతం చేస్తుందా?లేదా? అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంచితే, అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా కాగా, ఇప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్. అప్పుడు భారత్ జట్టుకు సౌరవ్ గంగూలీ కెప్టెన్ కాగా, ఇప్పుడు విరాట్ కోహ్లి. భారత్ జట్టుకు దూకుడు నేర్పిన కెప్టెన్ ఒకరైతే, దూకుడునే తన శ్వాసగా చేసుకున్న కెప్టెన్ మరొకరు.  ఇప్పుడు అదే జరుగుతుందనేది సగటు భారత క్రీడాభిమాని ఆశ. ఆల్ ద బెస్ట్ టీమిండియా.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top