రవి'శాస్త్రీయం' గట్టెక్కిస్తుందా?

రవి'శాస్త్రీయం' గట్టెక్కిస్తుందా?

ఇంగ్లండ్ సిరీస్ లో ఘోర పరాజయంతో విమర్శకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విదేశీ గడ్డపై దారుణ ఓటమికి భాద్యతగా కోచ్ డంకన్ ఫ్లెచర్, కెప్టెన్ ధోనిపై వేటు వేయాలని ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో రవిశాస్త్రిని రంగంలోకి దించింది. భారతజట్టుకు మరమత్తులు చేసేందుకు భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రిని డైరెక్టర్ గా పదవీ భాద్యతల్ని అప్పగించింది. 

 

విదేశీ గడ్డపై భారత జట్టు వైఫల్యాల బారిన పడినపుడు మన జట్టు కుదుటపడేలా రవిశాస్త్రికి బాధ్యతల్ని అప్పగించడం ఇది తొలిసారి కాదు. గతంలో 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి దశలోనే ఇంటిదారి పట్టిన తర్వాత అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్‌పై బీసీసీఐ వేటు పడింది. ప్రపంచకప్ తర్వాత  పాల్గొన్న బంగ్లా పర్యటనలో భారత జట్టుకు క్రికెట్ మేనేజర్‌గా శాస్త్రిని నియమించారు. ఇప్పుడు ధోని సేన వైఫల్యాల నేపథ్యంలో రవిశాస్త్రిని తెరమీదకు తీసుకువచ్చారు. 

 

క్లిష్ట సమయంలో భారత జట్టును గాడిన పెట్టేందుకు రవిశాస్త్రి డైరెక్టర్ గా భాద్యతల్ని భుజాన వేసుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ లో టెస్ట్ లలో 1-3 తేడాతో ఓటమి పాలైన భారత జట్టు త్వరలో వన్డే, టీ20 మ్యాచ్ లను ఆడనుంది. చెత్త బ్యాటింగ్ తో నైతిక స్థైర్యం కోల్పోయిన భారత జట్టును రవిశాస్త్రి సరైన దారిలోకి తీసుకువస్తారా అనేది భారత క్రికెట్ అభిమానుల ముందున్న ప్రశ్న. అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరించనున్న సంజయ్ బంగర్, భరత్ అరుణ్‌ల సహకారంతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో వైఫల్యాలను అధిగమించి భారత జట్టును గట్టేక్కిస్తుందా అనేది వేచి చూడాల్సిందే!
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top