ధోనీకి డబుల్ బొనాంజా చాన్స్?

ధోనీకి డబుల్ బొనాంజా చాన్స్?


ప్రపంచ కప్ సాధించాలన్నది ప్రతీ జట్టు లక్ష్యం. కప్ను ఒక్కసారైనా ముద్దాడాలన్నది క్రికెటర్ల జీవితాశయం.తమ దేశమే విజేతగా నిలవాలన్నది అభిమానుల ఆకాంక్ష. తన సారథ్యంలో దేశానికి ప్రపంచ కప్ అందివ్వాలన్నది ప్రతీ కెప్టెన్ కల. అలాంటిది రెండోసారి తన కెప్టెన్సీలో టైటిల్ గెలిస్తే.. అంతకన్నా అపురూప క్షణం మరోటి ఉండబోదు. ఈ అరుదైన అవకాశం టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఊరిస్తోంది. ఈ ఘనత సాధించిన వెస్టిండీస్, ఆస్ట్రేలియా దిగ్గజాలు క్లైవ్ లాయిడ్, రికీ పాంటింగ్ సరసన నిలవడానికి ధోనీ మూడు మ్యాచ్ల దూరంలో ఉన్నాడు.



1975లో ప్రపంచ కప్ పోటీలకు అంకురార్పణపడ్డాక ఇప్పటివరకు 10 ఈవెంట్లు నిర్వహించారు. తాజా టోర్నీ 11వది. తాజా ఈవెంట్లో టెస్టు హోదాగల పది దేశాలతో పాటు మరో నాలుగు జట్లు ఆడుతున్నాయి. మరికొన్ని చిన్నాచితకా జట్లు ప్రపంచ కప్లో ఆడిపోతుంటాయి. కాగా ఇప్పటి వరకు ఐదు దేశాలు మాత్రమే ప్రపంచ కప్ను సాధించాయి. ఆస్ట్రేలియా 4, వెస్టిండీస్ 2, భారత్ 2, పాకిస్థాన్, శ్రీలంక చెరోసారి విజేతలుగా నిలిచాయి. 1975, 79 టోర్నీలలో క్లైవ్ లాయిడ్ సారథ్యంలోని విండీస్ జట్టు జగజ్జేతగా నిలిచింది. ఇక 2003, 2007లలో రికీ పాంటింగ్ నాయకత్వంలోని ఆసీస్ ప్రపంచ చాంపియన్గా ఆవిర్భవించింది. ప్రపంచ కప్ చరిత్రలో తమ సారథ్యంలో రెండు సార్లు జట్టును గెలిపించిన కెప్టెన్లు వీరిద్దరే. వీరి సరసన నిలిచే చాన్స్ ధోనీకి వచ్చింది.



2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్లో ధోనీసేన కప్ సాధించిన సంగతి తెలిసిందే. తాజా ఈవెంట్లో మహీ టీమ్ అద్భుత విజయాలు సాధిస్తోంది. దాదాపుగా నాకౌట్ బెర్తు సొంతం చేసుకున్నట్టే. అయితే నాకౌట్ దశలో గట్టిపోటీ తప్పదు. కప్ గెలవాలంటే క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్లు నెగ్గాలి. అంటే ధోనీ గ్యాంగ్ ఆడాల్సిన మిగిలిన రెండు లీగ్ మ్యాచ్లూ వదిలిస్తే.. ప్రపంచ కప్కు మూడు మ్యాచ్ల దూరంలో ఉందన్నమాట. లీగ్ దశలో హ్యాట్రిక్ కొట్టిన టీమిండియా నాకౌట్లోనూ ఇదే ఫీట్ రిపీట్ చేస్తే మనోళ్లు ప్రపంచ కప్తో తిరిగొస్తారు.  అప్పడు మహీ.. లాయిడ్, పాంటింగ్ సరసనలో చరిత్రలో మిగిలిపోతాడు. 120 కోట్ల భారతీయుల కల నెరవేరాలని ఆశిద్దాం..!



తాజా ప్రపంచ కప్లో ఆయా జట్ల ప్రదర్శనను పరిశీలిస్తే ఐదు జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టైటిల్ రేసులో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక ముందంజలో ఉన్నాయి. టైటిల్ రేసులో బలమైన పోటీదారుగా ఉన్న కివీస్ తొలిసారి ప్రపంచ చాంపియన్ కావాలని ఆరాటపడుతుంటే.. లీగ్ దశలో రాణించి నాకౌట్లో తడబడే బలహీనత ఉన్న దక్షిణాఫ్రికా కూడా తొలిసారి ట్రోఫీ ముద్దాడాలనే లక్ష్యంతో ఉంది. మరో ఆతిథ్య జట్టు ఆసీస్ ఐదోసారి ట్రోఫీ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక గత రెండు టోర్నీల్లో రన్నరప్గా నిలిచి కొద్దిలో అవకాశం చేజార్చుకున్న ఉపఖండం జట్టు లంక ఈ సారైనా విజేతగా నిలిచి రెండో టైటిల్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. గత ఈవెంట్లో సొంతగడ్డపై దుమ్మురేపిన టీమిండియా.. ఆస్ట్రేలియాలోనూ సత్తాచాటి మూడో టైటిల్.. మహీ సారథ్యంలో రెండో కప్ గెలవాలనే కృతనిశ్చయంతో ఉంది. ఎవరి కల సాకారమవుతుందో ఈ నెల 29న (ఫైనల్ మ్యాచ్) తేలనుంది? అంతవరకు ఉత్కంఠ తప్పదు..!


-ఎన్.రమేష్ బాబు





ప్రపంచ కప్        విజేత    కెప్టెన్        రన్నరప్



1975        వెస్టిండీస్    క్లైవ్ లాయిడ్    ఆస్ట్రేలియా

1979        వెస్టిండీస్    క్లైవ్ లాయిడ్    ఇంగ్లండ్

1983        భారత్       కపిల్ దేవ్        వెస్టిండీస్

1987        ఆస్ట్రేలియా    అలెన్ బోర్డర్    ఇంగ్లండ్

1992        పాకిస్థాన్    ఇమ్రాన్ ఖాన్    ఇంగ్లండ్

1996        శ్రీలంక    అర్జున రణతుంగ    ఆస్ట్రేలియా

1999        ఆస్ట్రేలియా    స్టీవ్ వా        పాకిస్థాన్

2003        ఆస్ట్రేలియా    రికీ పాంటింగ్    భారత్

2007        ఆస్ట్రేలియా    రికీ పాంటింగ్    శ్రీలంక

2011        భారత్     మహేంద్ర సింగ్ ధోనీ    శ్రీలంక

2015        ..     ..        ..

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top