‘బ్రెండన్’ బాదుడుకు బ్రేక్!

‘బ్రెండన్’ బాదుడుకు బ్రేక్! - Sakshi


ఆఖరి సిరీస్ ఆడనున్న మెకల్లమ్

కెరీర్‌లో 100వ టెస్టుకు రెడీ

వరుసగా వంద మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్


 

 ‘క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్ల జాబితాలో నేను ఉండకపోవచ్చు. అయితే నా దేశం తరఫున ఎంతో కొంత సాధించిన, ఎందరికో స్ఫూర్తినిచ్చినవారిగా అందరికీ గుర్తుండిపోతాను. బ్యాటింగ్‌లో నా శైలితో నాదైన ముద్ర చూపించాననే నమ్ముతున్నా’...ఆఖరి సిరీస్‌కు ముందు తన గురించి బ్రెండన్ మెకల్లమ్ చెప్పుకున్న మాట ఇది. నిజమే... క్రికెట్‌పై ‘బాజ్’ సంతకం మరచిపోలేనిది. అతని సునామీ ఇన్నింగ్స్ ప్రత్యర్థుల గుండెల్లో కల్లోలం రేపాయి. వన్డేల్లో దూకుడు, టి20ల్లో విధ్వంసం కామన్ కావచ్చు... కానీ టెస్టుల్లోనూ ఆ బ్యాట్ పదునేంటో భారత జట్టుకే అందరికంటే బాగా తెలుసు. నాలుగు డబుల్ సెంచరీలు చేస్తే అందులో మూడు భారత్‌పైనే వచ్చాయి. దాదాపు రెండేళ్ల క్రితం ధోని సేన గెలవాల్సిన మ్యాచ్‌ను అద్భుతమైన ట్రిపుల్ సెంచరీతో (302) రక్షించుకున్న ఇన్నింగ్స్ అజరామరం. గత సోమవారం వన్డేలకు విజయంతో గుడ్‌బై చెప్పిన మెకల్లమ్ ఇప్పుడు ఆఖరిసారిగా టెస్టు సిరీస్ బరిలోకి దిగుతున్నాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారంనుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ అతని అంతర్జాతీయ కెరీర్‌లో ఆఖరిది. వెల్లింగ్టన్‌లో నేటినుంచి జరిగే తొలి టెస్టు మెకల్లమ్ కెరీర్‌లో 100వది కావడం విశేషం. అరంగేట్రం చేసిననాటినుంచి విరామం లేకుండా వరుసగా వంద టెస్టులు ఆడిన తొలి క్రికెటర్‌గా బ్రెండన్ మరో ఘనతను తన పేరిట లిఖిస్తున్నాడు.





 గ్రేట్ జెంటిల్‌మన్...

విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా మెకల్లమ్‌కు కొత్తగా పరిచయం అవసరం లేదు. 155 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతులను కూడా స్కూప్ షాట్ ఆడుతూ 50 బంతుల్లో చేసిన టి20 సెంచరీనుంచి... టెస్టుల్లో పాకిస్తాన్‌పై మెరుపు వేగంతో డబుల్ సెంచరీ చేయడం వరకు అతని దూకుడుకు ఉదాహరణలు ఎన్నో. ఇక వన్డేల్లో మెరుపు ఆరంభాలతో మ్యాచ్ దిశ మార్చిన ఇన్నింగ్స్‌కు లెక్కే లేదు. కానీ ఇదంతా ఆటలోనే. ప్రత్యర్థిని ఒక్క మాట అన్నదీ లేదు. ఆవేశంతో నోరు జారినదీ లేదు! అసలు సిసలైన జెంటిల్‌మన్‌లా వ్యవహరించిన అతను కెప్టెన్‌గా అదే తన జట్టుకు నేర్పాడు. మెకల్లమ్ సారథ్యంలో కొత్త బ్రాండింగ్‌తో కనిపించిన కివీస్ తమ దేశ చరిత్రలో గతంలో సాధ్యం కాని వరుస విజయాలు అందుకుంది. వన్డే వరల్డ్ కప్‌లో తొలిసారి ఫైనల్ చేరడమే కాకుండా సొంతగడ్డపై వరుసగా 13 టెస్టుల పాటు పరాజయమన్నదే లేకుండా కొనసాగుతోంది. ఐపీఎల్‌లో అతని బ్యాటింగ్ చూసే అవకాశాలు ఉన్నా...అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి మరో రెండు మ్యాచ్‌లే మెకలమ్ మెరుపులకు వేదికగా నిలవనున్నాయి.

 

 గత 15-20 టెస్టులు నా జీవితంలో గొప్పగా సాగాయి. ప్రతిభ గల కొంతమందితో కలిసి అద్భుతాలు చేయగలిగాం. నేను సాధించినదాని పట్ల గర్వంగా ఉన్నా. గాయాలను అధిగమించి వరుసగా 100 టెస్టులు ఆడటం నిజంగా మధురానుభూతి. భారత్‌పై చేసిన ట్రిపుల్ సెంచరీతోనే మా జట్టు పోరాటపటిమ ప్రపంచానికి తెలిసింది. కాబట్టి అదే నా అత్యుత్తమం. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను పడిన కఠోర శ్రమ, ఆ తర్వాతి విజయాలు గుర్తుకొచ్చాయి. నా జీవితానికి ఈ జ్ఞాపకాలు చాలు’     -బ్రెండన్ మెకల్లమ్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top