స్పాన్సర్ లేడు.. ఆరేళ్లుగా ప్రమోషన్ లేదు

స్పాన్సర్ లేడు.. ఆరేళ్లుగా ప్రమోషన్ లేదు


నా మొండితనమే నిలబెట్టింది : బాక్సర్ మనోజ్



 న్యూఢిల్లీ:

రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ముగ్గురు భారత బాక్సర్లలో అతడు ఒకడు.. స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ఆ బాక్సర్‌కు స్పాన్సర్లే కరువయ్యారు. కనీసం తన ఉద్యోగంలో ప్రమోషన్ కూడా లేదు. అయినా మొండితనమే తనను ముందుకు నడిపిస్తోందని బాక్సర్ మనోజ్ కుమార్ అంటున్నాడు. రెండుసార్లు ఆసియా గేమ్స్‌లో పతకాలు, కామన్వెల్త్‌లో స్వర్ణం సాధించిన మనోజ్.. మొదట్నుంచి తనకు అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

 

శివాజే స్పూర్తి..

మరాఠి మూలాలున్న మనోజ్.. మరాఠ యోధుడు చత్రపతి శివాజీనే స్పూర్తిగా తీసుకున్నాడు. శివాజీ జీవితమే తనకు పాఠంలా ఉపయోగపడిందని, నూతన శక్తిని తెచ్చుకునేందుకు అది తోడ్పడిందని మనోజ్ అంటున్నాడు. ‘శివాజీ నమ్మిన సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నాను. అవే నన్ను మొండిగా మార్చాయి. క్లిష్ట పరిస్థితులను తట్టుకొని నిలబడేందుకు మొండితనమే నాకు తోడ్పడింది’అని 64 కేజీల విభాగంలో పోటీ పడబోతున్న మనోజ్ చెప్పాడు.



ఆరుగురు మారారు..

2010 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించినప్పుడే.. ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తామని స్వయంగా కేంద్ర మంత్రే మాట ఇచ్చినా ఇప్పటివరకు అది సాకారం కాలేదు. ప్రస్తుతం మనోజ్ రైల్వేలో క్లాస్-3 ఉద్యోగిగా ఉన్నాడు. అప్పట్లో మమత బెనర్జీ మాట ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు రైల్వే మంత్రులుగా ఆరుగురు మారారు. ‘కొత్తగా వచ్చిన ప్రతీ రైల్వే మంత్రికి లేఖలు రాశాను. ముకుల్ రాయ్ నుంచి ప్రస్తుతం ఉన్న సురేశ్ ప్రభు వరకు అందరికి రాశా. న్యాయం జరిగేలా చూస్తానని ప్రతి ఒక్కరు చెప్పారు. కానీ అది జరగడం లేదు’అని మనోజ్ తెలిపాడు.



స్పాన్సర్‌లు ముందుకు రాలేదు..

ప్రముఖ సంస్థలన్నింటికీ లేఖలు రాసినా కూడా తనకు స్పాన్సర్‌గా ఉండేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదని చెబుతున్నాడు. బహుశా తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఎవరూ ఊహించలేదేమో అన్నాడు. తన లేఖలకు ఎవరూ స్పందించలేదన్నాడు. అయినా జీవితంలో ఒక్క సెకన్ కూడా బాక్సింగ్‌ను వదిలేద్దామని అనుకోలేదన్నాడు. రింగ్‌లో విజయాలు సాధించి తన విషయంలో వాళ్లందరూ తప్పుగా ఆలోచించారని తెలిసేలా చేయడం చాలా సరదాగా ఉందన్నాడు. ప్రస్తుతం ఉన్న స్థాయికి చేరుకోవడానికి తన అన్నయ్య, కోచ్ రాజేశ్ మినహా మరేవరూ సహాయం చేయలేదని తెలిపాడు.



నేను మినహాయింపు..

హర్యానా ప్రభుత్వం అథ్లెట్లకు వెన్నుదన్నుగా నిలుస్తుందని.. బాక్సర్లు, రెజ్లర్లకు చాలా రకాలుగా సహాయం అందిస్తోందని, కానీ తన ఒక్కడి విషయంలో మాత్రం మినహాయింపు ఉందన్నాడు. ప్రభుత్వం తనకు ఏ విధంగా కూడా సహాయం అందించలేదని నిందించాడు. ‘కొంతమంది ముందు తలవంచకపోవడం వల్లే ఇదంతా జరిగి ఉండవచ్చు. అయినా ఏ ఒక్కరినో ఆకట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. మన దేశంలో క్రికెటర్లకు స్పాన్సర్లు దొరుకుతారు. బంగ్లా క్రికెటర్లకు కూడా మనవాళ్లు స్పాన్సర్లుగా ఉంటారు. కానీ నాలాంటి వాళ్లకు ఎందుకు దొరకరో అర్థం కాదు. మనం అంత తీసికట్టుగా ఉన్నామా అని ప్రశ్నించుకుంటుంటాను’అని ఆవేదన వ్యక్తం చేశాడు. తను మానసికంగా కుంగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. బాక్సింగ్ అంటేనే నొప్పిని భరించాల్సిన క్రీడ అని.. ఒక గేమ్ ఆడేందుకు కష్టపడి సన్నద్ధమవుతామని.. కష్టాన్ని గుర్తించకపోతే బాధగా ఉంటుందన్నాడు.



నన్ను విమర్శించారు..

అర్జున అవార్డు కోసం కోర్టుకెక్కినప్పుడు చాలా మంది తనను విమర్శించారని చెప్పుకొచ్చాడు. కానీ ఆ సమయంలో తనకు అంతకంటే వేరే దారి కనిపించలేదన్నాడు. (2014లో అర్జున అవార్డు కోసం మనోజ్ పేరును పరిశీలించకపోవడంతో అతని కోచ్.. ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. మనోజ్‌కు అర్జున పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని వాదించారు. కోర్టు కూడా మనోజ్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అతనికి అర్జున దక్కింది)



బిగ్‌బాస్‌లో వస్తాను..

మరోవైపు రియో నుంచి వచ్చిన తర్వాత బిగ్‌బాస్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నాడు. ప్రస్తుతం తన చుట్టూ అల్లుకున్న డ్రామా నుంచి బయటపడేందుకు ఆ ప్రోగ్రాం తోడ్పడుతుందన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top