బోపన్న జంటకు నిరాశ

బోపన్న జంటకు నిరాశ


రెండోసారీ రన్నరప్‌తో సరి

* రోజర్-టెకావ్ జోడీకి డబుల్స్ టైటిల్

* ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ

లండన్: ప్రతిష్టాత్మక ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఈ మెగా ఈవెంట్ పురుషుల డబుల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం 4-6, 3-6తో రెండో సీడ్ హొరియా టెకావ్ (రుమేనియా)-జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట చేతిలో ఓడిపోయింది.



2012లో భారత్‌కే చెందిన మహేశ్ భూపతితో కలిసి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన బోపన్న రన్నరప్‌గా నిలువగా... ఈసారి మెర్జియాతో కూడా రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకున్నాడు.

 

డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌తో ఈ సీజన్‌ను ముగించనున్న టెకావ్-రోజర్ ద్వయం ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ సాధించడం విశేషం. 1986లో ఈ టోర్నీలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిని ప్రవేశపెట్టాక ఈ ఘనతను సాధించడం ఇదే తొలిసారి.

 గంటపాటు జరిగిన ఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం సర్వీస్‌లలో నిలకడ లోపించింది.



ఈ జంట ఏడు ఏస్‌లు సంధించినప్పటికీ మరోవైపు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు టెకావ్-రోజర్ జోడీ ఏడు ఏస్‌లు సంధించి, ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసే అవకాశం బోపన్న-మెర్జియాలకు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. టెకావ్-రోజర్ మాత్రం బోపన్న జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు.



ఇప్పటిదాకా టెకావ్-రోజర్ జంటతో ఆడిన నాలుగు పర్యాయాలు బోపన్న-మెర్జియాలకు ఓటమే ఎదురైంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ సెమీఫైనల్లో, ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో, రోమ్ మాస్టర్స్ సిరీస్ ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న ద్వయం టెకావ్-రోజర్‌ల చేతిలో ఓడిపోయింది.

 ఈ టోర్నీలో అజేయంగా నిలిచి విజేతగా అవతరించిన టెకావ్-రోజర్ జంటకు 4,23,000 డాలర్లు (రూ. 2 కోట్ల 79 లక్షలు), రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీకి 2,29,000 డాలర్లు (రూ. కోటీ 51 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top