'పాకిస్థాన్ తో ఆడాల్సిన అవసరమే లేదు'

'పాకిస్థాన్ తో ఆడాల్సిన అవసరమే లేదు'


లండన్:  ప్రపంచ ధనిక క్రికెట్ బోర్డుల్లో ఒకటైన భారత్ కు పాకిస్థాన్ తో క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదంటున్నాడు ఇంగ్లండ్ మాజీ క్రికెట్  లెజెండ్ జెఫ్రీ బాయ్ కాట్.  అంతర్జాతీయ క్రికెట్ ను  శాసిస్తున్న భారత్ కు పాకిస్థాన్ తో సిరీస్ కు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పనిలేదన్నాడు. భారత్ లో క్రికెట్ కు ఉన్న ప్రజాదరణ అమోఘమని బాయ్ కాట్ పేర్కొన్నాడు. క్రికెట్ లో ఓ ఉన్నతస్థానాన్ని ఆక్రమించిన భారత్ లో ఐసీసీ సభ్యత్వం గల ప్రతీ దేశం క్రికెట్ ఆడటానికి మొగ్గు చూపుతాయని ఈ సందర్భంగా జెఫ్రీ తెలిపాడు. భారత్ లో క్రికెట్ ఆడిన ఆయా దేశాలు భారీగా లబ్ధిపొందుతాయని.. భారత్ లో ప్రకటనల ద్వారా  క్రికెట్ కు వచ్చే ఆదాయమే ఇందుకు ప్రధాన కారణమన్నాడు. అంతటి స్థాయి కల్గిన బీసీసీఐ.. పాకిస్థాన్ తో సిరీస్ ఆడకపోయినా వచ్చిన నష్టమేమీలేదన్నాడు.





భారత-పాకిస్థాన్ ల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ను శ్రీలకంలో నిర్వహించేందుకు మార్గం సుగుమైన సంగతి తెలిసిందే. దుబాయ్ లోని ఐసీసీ కార్యాలయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్, భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ల మధ్య ఆదివారం జరిగిన సమావేశంలో శ్రీలంకలో సిరీస్ ను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా, దీనిపై  అధికారిక ప్రకటన ఈనెల 27వ తేదీన వెలువడనుంది.



ముందస్తు ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య  వచ్చే నెలలో యూఏఈలో క్రికెట్ సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ ను ఆడటానికి భారత్ కు రావాలని పీసీబీని బీసీసీఐ ఆహ్వానించినా అందుకు ముందడుగు పడలేదు. యూఏఈలోనే ఆడాలని పాక్ పట్టుబట్టింది. కాగా, యూఏఈలో ఆడటానికి భారత్ కొన్ని అడ్డంకులు ఉన్నట్లు బీసీసీఐ పేర్కొంది.  ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తో సిరీస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపి తీరాలని భారత్ సంకల్పించగా, పాక్ కూడా ఆ సిరీస్ ద్వారా భారత్ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావించింది. దీనిలో భాగంగా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తటస్థ వేదిక శ్రీలంకలో సిరీస్ జరపాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారానికి వచ్చాయి. ఈ సిరీస్ లో పాక్ తో మూడు వన్డేలు, రెండు ట్వంటీ20లను భారత్ ఆడుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top