బోర్డు దృష్టిలో దోషులే!

బోర్డు దృష్టిలో దోషులే!


శ్రీశాంత్ త్రయంపై నిషేధం ఎత్తివేయరట  

ఫిక్సింగ్ చేసినట్లు బీసీసీఐ దగ్గర సాక్ష్యాలు

 


సాధారణంగా దేశంలో ఏ అంశమైనా న్యాయవ్యవస్థ చుట్టూ తిరుగుతుంది. కోర్టు ఏదైనా చెబితే దానిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ బీసీసీఐ మాత్రం దీనికి భిన్నం. ప్రభుత్వాలతో, కోర్టులతో సంబంధం లేని స్వయం ప్రతిపత్తి గల సంస్థ తమదేననే భావనతో బోర్డు నిర్ణయాలు ఉంటాయి. పదవిలో ఎవరున్నా ఇదే దృక్ప థంతో నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీశాంత్ త్రయం ఫిక్సింగ్ చేసినట్లు ఆధారాలు లేవని కోర్టు తీర్పు చెప్పినా... తమ దగ్గర ఉన్న సాక్ష్యాల కారణంగా వారిపై నిషేధం ఎత్తివేసే ప్రసక్తే లేదని బోర్డు అంటోంది. దీనిపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.

 

క్రీడావిభాగం ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ జరగలేదని మీరు నమ్ముతారా? ఈ లీగ్‌లో మ్యాచ్‌లన్నీ నిజాయితీగానే ఆడుతున్నారా? ఈ రెండు ప్రశ్నలు వేస్తే భారత్‌లో సగటు క్రికెట్ అభిమాని ఎవరైనా అవునని సమాధానం చెప్పే అవకాశం చాలా తక్కువ. నిజంగా ఫిక్సింగ్ జరిగిందా? జరుగుతుందా? అంటే అవునని ఆధారాలు చూపే వాళ్లు కూడా లేరు. అందుకే ఆ లీగ్ అలా సాగిపోతూనే ఉంటుంది. కారణం... క్రికెట్ అంటే ప్రేమ. అందుకే శ్రీశాంత్ బృందం తప్పు చేయలేదని ఢిల్లీ కోర్టు చెప్పగానే చాలా మంది పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఈ ఎపిసోడ్‌లో శ్రీశాంత్ బృందాన్ని సమర్ధించేవాళ్లు కొందరైతే... తప్పు చేసినా తప్పించుకున్నారని ఆరోపించేవారు మరికొందరు. ఇదంతా కూడా ‘స్క్రిప్ట్’లో భాగమేనంటూ నిర్వేదం చెందేవారు మరికొందరు.



బోర్డుకు ముందే తెలుసు

శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్‌ల గురించి ఇలాంటి తీర్పే వస్తుందని బీసీసీఐ లీగల్ నిపుణులు ముందే ఊహించారట. అందుకే బోర్డు కేవలం రెండు లైన్ల స్టేట్‌మెంట్‌తో దీనిని సరిపెట్టింది. దీనిపై ఇక స్పందించేది లేదని కూడా స్పష్టం చేసింది. న్యాయస్థానం ఏం చెప్పినా తమకు సంబంధం లేదని, తాము స్వతంత్రంగా చేసిన విచారణతోనే ఈ త్రయంపై నిషేధం విధించామని బీసీసీఐ చెబుతోంది. 2013లో ఈ కేసు గురించి బోర్డు ఓ విచారణ కమిటీని నియమించింది. ఢిల్లీ పోలీసుల దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ వీళ్ల దగ్గర ఉన్నాయి. వీటికి అదనంగా క్రికెటర్లు ముగ్గురూ తప్పు ఒప్పుకుంటూ సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ బోర్డు దగ్గర ఉన్నాయని అంటున్నారు. ఇది బలమైన ఆధారం కాబట్టి నిషేధం ఎత్తివేయాల్సిన అవసరం లేదని బోర్డు భావించింది. కాబట్టి శ్రీశాంత్ బృందం బీసీసీఐ మీద కోర్టుకు వెళ్లి... అజయ్ జడేజా తరహాలోనే నిషేధం ఎత్తి వేయించుకోవాలి. 2000లో ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్నప్పుడు జడేజా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తనపై ఉన్న నిషేధాన్ని తీయించుకున్నాడు. ఆ తర్వాత రంజీల్లో ఆడాడు. అయితే అదే కేసులో అజహరుద్దీన్‌కు కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ  ఇప్పటికీ నిషేధం ఎత్తివేయలేదనేది గమనార్హం.



ఆ నష్టానికి బాధ్యులెవరు?

 శ్రీశాంత్‌ను సమర్ధిస్తున్న వారు ఇప్పుడు ఓ కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. అతను తప్పు చేయలేదని కోర్టు చెప్పినందున సచ్ఛీలుడేనని, కావాలని అతణ్ని కేసులో ఇరికించి బలిపశువును చేశారని అంటున్నారు. దీనివల్ల రెండేళ్ల పాటు ఆటకు దూరమవడంతో పాటు ఆర్థికంగా, ప్రతిష్ట పరంగా కూడా నష్టపోయాడని చెబుతున్నారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలనే అంశంపై చర్చిస్తున్నారు. ఇప్పటికీ తాను తిరిగి క్రికెట్ ఆడగలననే నమ్మకంతో శ్రీశాంత్ ఉన్నాడు. అందుకే బీసీసీఐ మీద ఎలాంటి విమర్శలూ చేయడం లేదు. బోర్డు పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాడు. ఒకవేళ తమ ఆశలు నెరవేరబోవని తెలిస్తే శ్రీశాంత్ బృందం బోర్డుకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది.



బోర్డు చేసిందేమిటి..?

శ్రీశాంత్ త్రయంపై ఆరోపణలకు తగ్గ సాక్ష్యాలను ఢిల్లీ పోలీసులు ఇవ్వలేకపోతున్నారని తెలిసినప్పుడు బీసీసీఐ ఎందుకు కలగజేసుకోలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వీళ్లు దోషులే అని బోర్డు నమ్మినప్పుడు తమ దగ్గర ఉన్న అదనపు డాక్యుమెంట్స్‌ను ఢిల్లీ పోలీసులకు ఇస్తే సరిపోయేది. కానీ బోర్డు శైలి భిన్నం. తాము ఎవరి కనుసన్నల్లో పని చేయాల్సిన అవసరం లేదని, తమదో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని బీసీసీఐ పెద్దల అభిప్రాయం. శరద్ పవార్ నుంచి అనురాగ్ ఠాకూర్ దాకా అధికారంలో ఎవరు ఉన్నా ఇదే తరహాలో వ్యవహరించారు. నిజానికి ఇది మంచిది కూడా కాదు.

 

హైకోర్టుకు ఢిల్లీ పోలీసులు

స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఈ కేసులో తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను సరైన పద్ధతిలో న్యాయస్థానం ముందు ఉంచడంలో విఫలమయ్యారని అధికారులు భావిస్తున్నారు. బంతి వేసేముందు వాచ్ చూపించడం, లాకెట్‌ను ముట్టుకోవడం లాంటి పనులు చేసిన ఈ క్రికెటర్లు ముందుగా బుకీలకు చెప్పినట్లే పరుగులు ఇచ్చారని, దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు. వారంలోగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఓ పోలీస్ అధికారి చెప్పారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top