బ్లిజార్డ్ ‘తుఫాన్'

బ్లిజార్డ్  ‘తుఫాన్'


సాక్షి, హైదరాబాద్: హోబర్ట్ హరికేన్స్ విజయలక్ష్యం 185 పరుగులు... చివరి 3 ఓవర్లలో మరో 44 పరుగులు చేయాల్సిన స్థితిలో మొగ్గు ప్రత్యర్థి కేప్ కోబ్రాస్ వైపే ఉంది.అయితే  మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ క్రెయిగ్ బ్లిజార్డ్ (48 బంతుల్లో 78 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో విజయం హరికేన్స్ సొంతమైంది. 12 బంతుల్లోనే 45 పరుగులు చేసిన ఆ జట్టు ఒక ఓవర్ ముందే మ్యాచ్‌ను ముగించింది. ఇందులో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉండటం ఉన్నాయి. వెల్స్ (17 నాటౌట్) కలిసి బ్లిజార్డ్ 26 బంతుల్లోనే 65 పరుగులు జోడించడం విశేషం.  అంతకు ముందు బెన్ డంక్ (35 బంతుల్లో 54; 10 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఒక దశలో డంక్ వరుసగా తాను ఎదుర్కొన్న 9 బంతుల్లో 7 ఫోర్లు బాదడం అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది.

 అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేప్ కోబ్రాస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రిచర్డ్ లెవీ (30 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. చివర్లో ఫిలాండర్ (14 బంతుల్లో 32 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), పీటర్సన్ (14 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు 24 బంతుల్లోనే అభేద్యంగా 52 పరుగులు జోడించడంతో కోబ్రాస్ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. అనంతరం హరికేన్స్ 19 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (8) విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌తో హోబర్ట్‌కు తొలి విజయం దక్కగా...కోబ్రాస్ తాము ఆడిన రెండు మ్యాచ్‌లూ

 ఓడిపోయింది.







 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top