సూపర్ సెరెనా

సూపర్ సెరెనా


అలవోక విజయంతో సెమీస్‌లోకి

 

గత రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను తక్కువ అంచనా వేసిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా క్వార్టర్‌ఫైనల్లో మాత్రం జూలు విదిల్చింది. గతేడాది రన్నరప్ డొమినికా సిబుల్కోవాను హడలెత్తించి వరుస సెట్‌లలో విజయాన్ని సాధించింది. ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గతంలో సెమీస్‌కు చేరిన ప్రతిసారీ సెరెనా టైటిల్ గెలవడం విశేషం. మరి ఆరోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందో లేదో వేచి చూడాలి. ఒకవైపు చెల్లెలు సెరెనా సెమీస్‌కు చేరుకోగా... మరోవైపు అక్క వీనస్ విలియమ్స్‌కు క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి మాడిసన్ కీస్ చేతిలో ఓటమి ఎదురైంది.

 

మెల్‌బోర్న్: ప్రొఫెషనల్‌గా మారి 20 ఏళ్లు గడిచినప్పటికీ... నాటికి, నేటికి ఒకే ఉత్సాహంతో ఆడుతోన్న సెరెనా విలియమ్స్ తన కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆరోసారి టైటిల్‌పై గురి పెట్టిన ఈ అమెరికా నల్లకలువ అలవోక విజయంతో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 6-2, 6-2తో నిరుటి రన్నరప్, 11వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)ను ఓడించింది.



65 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 33 ఏళ్ల సెరెనా 15 ఏస్‌లతో విరుచుకుపడింది. నెట్ వద్దకు వచ్చిన మూడుసార్లూ పాయింట్లు నెగ్గిన ఈ ప్రపంచ నంబర్‌వన్ రెండు సెట్‌లలోనూ రెండేసి సార్లు సిబుల్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో తన ప్రత్యర్థులకు తొలి సెట్‌ను కోల్పోయిన సెరెనా ఈసారి మాత్రం ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. సిబుల్కోవాకు ఏ దశలోనూ పట్టుబిగించే అవకాశం ఇవ్వకుండా ఈ మాజీ చాంపియన్ వరుస సెట్‌లలో మ్యాచ్‌ను ముగించింది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో అన్‌సీడెడ్, 19 ఏళ్ల అమెరికా రైజింగ్ స్టార్ మాడిసన్ కీస్‌తో సెరెనా; పదో సీడ్ మకరోవా (రష్యా)తో రెండో సీడ్ షరపోవా (రష్యా) తలపడతారు.

 

వీనస్‌కు నిరాశ

సెరెనా మ్యాచ్‌కంటే ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో అక్క వీనస్ విలియమ్స్‌కు చుక్కెదురైంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో మాడిసన్ కీస్ 6-3, 4-6, 6-4తో వీనస్‌పై సంచలన విజయాన్ని సాధించింది. తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది.

 

ఎదురులేని జొకోవిచ్, వావ్రింకా

పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) వరుస సెట్‌లలో తమ ప్రత్యర్థులను ఓడించి సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ వావ్రింకా 6-3, 6-4, 7-6 (8/6)తో ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్)పై నెగ్గగా... జొకోవిచ్ 7-6 (7/5), 6-4, 6-2తో ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను ఓడించాడు.



ఈ టోర్నీలో ఇప్పటివరకు తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని జొకోవిచ్ శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో వావ్రింకాతో అమీతుమీ తేల్చుకుంటాడు. వావ్రింకాతో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 16-3తో ముందంజలో ఉన్నాడు. అయితే గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో వావ్రింకా చేతిలో జొకోవిచ్‌కు ఓటమి ఎదురైంది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) ఆడతాడు.

 

సెమీస్‌లో పేస్, సానియా జంటలు

మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ క్రీడాకారులు లియాండర్ పేస్, సానియా మీర్జా వేర్వేరు భాగస్వాములతో సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ 6-3, 6-1తో అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా)-హలవకోవా (చెక్ రిపబ్లిక్) జంటను ఓడించగా... టాప్ సీడ్ సానియా మీర్జా-బ్రూనో సొరెస్ (బ్రెజిల్) ద్వయం 6-2, 6-2తో కేసీ డెలాక్వా-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top