షరపోవా జోరు

షరపోవా జోరు


అలవోక విజయంతో క్వార్టర్స్‌లోకి

 

మెల్‌బోర్న్: ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా... స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తున్న ప్రపంచ రెండో ర్యాంకర్ మరియా షరపోవా (రష్యా) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకుపోతోంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ షరపోవా 6-3, 6-0తో 21వ సీడ్ పెంగ్ షుయె (చైనా)పై అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. కేవలం 15 అనవసర తప్పిదాలు చేసిన ఈ రష్యా భామ నెట్ వద్దకు వచ్చిన ఐదుసార్లూ పాయింట్లు నెగ్గడం విశేషం.



 క్వార్టర్ ఫైనల్లో ‘కెనడా బ్యూటీ’ యూజిన్ బౌచర్డ్‌తో షరపోవా తలపడుతుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ బౌచర్డ్ 6-1, 5-7, 6-2తో ఇరీనా కమెలియా బెగూ (రుమేనియా)పై చెమటోడ్చి నెగ్గగా... మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-4, 6-2తో యానినా విక్‌మాయెర్ (బెల్జియం)పై, పదో సీడ్ మకరోవా (రష్యా) 6-3, 6-2తో జూలియా (జర్మనీ)పై విజయం సాధించారు.

 

శ్రమించిన ఆండీ ముర్రే: పురుషుల సింగిల్స్ విభాగంలో మూడుసార్లు రన్నరప్, ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)తోపాటు మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), ఆస్ట్రేలియా ఆశాకిరణం కియోరిస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో నెగ్గడానికి ముర్రే తీవ్రంగానే శ్రమించాడు.



3 గంటల 32 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ముర్రే 6-4, 6-7 (5/7), 6-3, 7-5తో విజయం సాధించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ నాదల్ 7-5, 6-1, 6-4తో 14వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై, బెర్డిచ్ 6-2, 7-6 (7/3), 6-2తో బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై, కియోరిస్ 5-7, 4-6, 6-3, 7-6 (7/5), 8-6తో సెప్పి (ఇటలీ)పై గెలిచారు.

 

పేస్ జంట శుభారంభం: మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం  6-2, 7-6 (7/2)తో థాంప్సన్-జొవనోవిచ్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో రోహన్ బోపన్న (భారత్)-స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట 2-6, 6-3, 4-10తో నెస్టర్ (కెనడా)-క్రిస్టినా మ్లడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top